Share News

నేటి నుంచి డిపోల వద్ద సరకులు

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:36 AM

బియ్యం కార్డుదారులకు రేషన్‌ డిపోల వద్ద సరకులు పంపిణీ ఆదివారం ప్రారంభించనున్నారు.

నేటి నుంచి డిపోల వద్ద సరకులు

ప్రజా ప్రతినిధులతో పంపిణీకి సన్నాహాలు

విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి):

బియ్యం కార్డుదారులకు రేషన్‌ డిపోల వద్ద సరకులు పంపిణీ ఆదివారం ప్రారంభించనున్నారు. జిల్లాలో గల 642 డిపోల పరిధిలో సరకులు పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లుచేసింది. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ సరకులు పంపిణీ చేయాలని ఇప్పటికే డీలర్లకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రతి డిపోలో ఈ-పోష్‌ మిషన్‌, తూకం యంత్రం సిద్ధం చేశారు. ప్రతి డిపో బయట ఏర్పాటుచేసిన బోర్డుపై డీలరు పేరు, నంబరు, ఏరియా, స్టాకు వివరాలు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌, జిల్లా పరిశీలకుడు భగన్నారాయణ శనివారం మర్రిపాలెం గోదామును సందర్శించి అక్కడ స్టాకు వివరాలు పరిశీలించారు. గోదాములో తూకం యంత్రం పనితీరును చూసి సూచనలు చేశారు. కాగా ఆదివారం బియ్యం కార్డుదారులకు సరకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులకు ఆహ్వానించారు. ఉదయమే ప్రజా ప్రతినిధులు డిపోలకు సందర్శించి సరకులు పంపిణీ చేసేలా ఏర్పాట్లుచేశారు.


నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

కానిస్టేబుళ్ల ఎంపికకు నేడు మెయిన్స్‌ పరీక్ష

జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 12,491 మంది అభ్యర్థులు హాజరు

గంట ముందు కేంద్రానికి చేరుకోవాలని సూచించిన అధికారులు

విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి):

కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆదివారం మెయిన్స్‌ పరీక్ష జరగనున్నది. ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయ నగరం జిల్లాలకు చెందిన 12,491 మంది నగరంలో పరీక్ష రాయనున్నారు. వారికోసం 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయన ఆదేశాలతో డీసీపీలు అజితా వేజెండ్ల, డి.మేరీ ప్రశాంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న 6,100 కాని స్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం 2022 నవం బరులో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అనేక కారణాల వల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది. 2023 జనవరి 22న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా, రాష్ట్రం మొత్తమ్మీద సుమారు ఐదు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 95 వేల మంది అర్హత సాధించారు. వారికి శారీరక, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి 38,910 మందిని ఎంపిక చేశారు. వారికి ఆదివారం మెయిన్స్‌ నిర్వహించబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన 12,491 మంది ఆదివారం మెయిన్స్‌ పరీక్షకు హాజరుకానున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మెయిన్స్‌ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్నది. అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 9 గంటల నుంచే అనుమతిస్తారు. పది గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలకు అనుమతించరు. అభ్యర్థులు హాల్‌ టికెట్‌తోపాటు ఆధార్‌ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. హాల్‌ టికెట్‌తోపాటు బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పెన్ను మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్‌ ద్వారా నమోదు చేయనున్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ వాచ్‌లు, ఇతర గాడ్జెట్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్లు పరిధిలో జెరాక్స్‌, కంప్యూటర్‌ కేంద్రాలను మూసియాలని ఇప్పటికే పోలీసు అధికారులు ఆదేశించారు.


జూన్‌ 6 నుంచి డీఎస్సీ రాత పరీక్షలు

ఉమ్మడి జిల్లాలో ఏడు కేంద్రాలు....32 వేల మంది అభ్యర్థులు

విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి):

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జూన్‌ ఆరో తేదీ నుంచి డీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు ఏడు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు జరుగుతాయి. మొత్తం 32 వేల మంది హాజరుకానున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 1,139 పోస్టులు భర్తీచేయనున్నారు. పరీక్షలకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లుచేసింది.

Updated Date - Jun 01 , 2025 | 12:36 AM