Share News

గిరిజన రైతుకు తీపి కబురు

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:19 AM

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులకు తీపి కబురుచెప్పింది. కొత్తగా లక్ష ఎకరాల్లో గిరిజనులతో కాఫీ తోటలు సాగు చేయించాలని నిర్ణయించింది. రానున్న ఐదేళ్ల కాలంలో.. అంటే 2026-27 నుంచి 2030-31 వరకు ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి కార్యచరణను ప్రకటించింది. ఇదే సమయంలో దాదాపు 70 వేల ఎకరాల్లో ఇప్పటికే వున్న కాఫీ తోటల్లో దిగుబడులు పెంచడానికి పునరుజ్జీవ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ సాగు, పాత తోటల పురుజ్జీవనానికి సుమారు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించింది.

గిరిజన రైతుకు తీపి కబురు
కాఫీ పండ్లు

మన్యానికి మరో కాఫీ ప్రాజెక్టు

కొత్తగా లక్ష ఎకరాల్లో తోటలు

ఇప్పటికే ఉన్న తోటల్లో 70 వేల ఎకరాల్లో పునరుజ్జీవ పనులు

మొత్తం వ్యయం రూ.202 కోట్లు

ఐదేళ్ల ప్రాజెక్టు అమలు

లక్ష గిరిజన రైతు కుటుంబాలకు లబ్ధి

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కానుక

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులకు తీపి కబురుచెప్పింది. కొత్తగా లక్ష ఎకరాల్లో గిరిజనులతో కాఫీ తోటలు సాగు చేయించాలని నిర్ణయించింది. రానున్న ఐదేళ్ల కాలంలో.. అంటే 2026-27 నుంచి 2030-31 వరకు ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి కార్యచరణను ప్రకటించింది. ఇదే సమయంలో దాదాపు 70 వేల ఎకరాల్లో ఇప్పటికే వున్న కాఫీ తోటల్లో దిగుబడులు పెంచడానికి పునరుజ్జీవ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ సాగు, పాత తోటల పురుజ్జీవనానికి సుమారు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించింది.

గిరిజనులను పోడు వ్యవసాయం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1989లో పాడేరు ఏజెన్సీలో ఆదివాసీలకు కాఫీ సాగును పరిచయం చేసింది. 2002 కాఫీ తోటల అభివృద్ధి అంతమాత్రంగానే వుంది. ఈ కాలంలో 32,072 ఎకరాల్లో మాత్రమే కాఫీ తోటలు వేశారు. తరువాత ఏజెన్సీలో కాఫీ సాగును అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పలురకాల రాయితీలు, ప్రోత్సాహకాలు అందించింది. ఫలితంగా 2003 నుంచి 2008 వరకు ఆదివాసీ రైతులు 64,265 ఎకరాల్లో కాఫీ తోటలు వేశారు. తర్వాత 2009లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. దీంతో 2016 వరకు 61,684 ఎకరాల్లో, ఈ తరువాత నుంచి ఇప్పటి వరకు మరో 84 వేల ఎకరాల్లో కాఫీ తోటలు వేశారు. మొత్తం మీద ఏజెన్సీ వ్యాప్తంగా ప్రస్తుతం రెండు లక్షల 62 వేల ఎకరాల్లో కాఫీ తోటలు వున్నాయి. వీటి ద్వారా 2.36 లక్షల మంది గిరిజన రైతులు లబ్ధిపొందుతున్నారు. ఇవి కాకుండా గిరిజన రైతులు సొంతంగా వేసుకున్న సుమారు 30 వేల ఎకరాలతో కలిపి మొత్తం 2 లక్షల 92 వేల ఎకరాల్లో కాఫీ తోటలు వున్నాయి. కానీ వివిధ కారణాల వల్ల లక్షా 52 వేల ఎకరాల్లోనే పంట వస్తున్నది. ఇది కూడా 70 వేల టన్నులకు అటుఇటుగా వుంటున్నది. ఎకరా కాఫీ తోట నుంచి ఏటా రూ.40-50 వేల ఆదాయం వస్తున్నది. ఇటు ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు సంతృప్తికరమైన ఆదాయం వస్తుండడంతో కాఫీ తోటల పెంపకంపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే సేంద్రీయ సాగు ద్వారా కాఫీ ఉత్పత్తి జరగడంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ పెరిగింది.

కొత్త ప్రాజెక్టులో రూ.202 కోట్లు వ్యయం

పాడేరు ఐడీడీఏ పరిధిలో గిరిజన రైతులు ఆర్థికంగా మరింత వృద్ధి చెందడానికి, స్వయం సమృద్ధి కోసం మరో లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ సాగు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో సంభవించిన హుద్‌హుద్‌ తుఫాన్‌తోపాటు ఇతర కారణాల వల్ల దెబ్బతిన్న సుమారు 70 వేల ఎకరాల్లో కాఫీ తోటలను పునరుజ్జీవింపజేయాలని భావించింది. వీటిని ఐదేళ్లలో పూర్తిచేయడానికి రూ.202 కోట్లు కేటాయించింది. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న ఐదేళ్ల కాలంలో కొత్తగా లక్ష ఎకరాల్లో (40 వేల హెక్టార్లు) కాఫీ తోటలను అభివృద్ధి చేస్తారు. ఇందులో 12 వేల హెక్టార్లు బంజరు భూములు, ఐదు వేల హెక్టార్లు రాగి పండిస్తున్న భూములు, మరో ఐదు వేల హెక్టార్లు సామ, రెండు వేల హెక్టార్లు వలిసె, మిగిలిన 16 వేల హెక్టార్లు అటవీ హక్కు పత్రాలు వున్న భూములు. కాఫీ తోటలకు నీడ అవసరం. ప్రస్తుతం సుమారు 40 వేల ఎకరాల్లో నీడను ఇచ్చే చెట్లు వున్నాయి. 2026-27లో పది వేల ఎకరాలు, 2027-28లో పది వేల ఎకరాలు, 2028-29లో 20 వేల ఎకరాల్లో కాఫీ మొక్కలు వేస్తారు. ఇదే సమయంలో మరో 60 వేల ఎకరాల్లో ఉపాధి హామీ పథకం కింద కాఫీ మొక్కలకు నీడనిచ్చే చెట్లు పెంచుతారు. వీటిల్లో 2029-30, 2030-31 సంవత్సరాల్లో ఏటా 30 వేల ఎకరాల చొప్పున కాఫీ మొక్కలునాటుతారు.

ఇదిలావుండగా ఇప్పటికే వున్న కాఫీ తోటల్లో సుమారు 70 వేల ఎకరాలను రానున్న ఐదేళ్లలో పునరుజ్జీవం చేస్తారు. 2026-27 నుంచి 2030-31 వరకు ఏటా 15 వేల ఎకరాల్లో ఈ పనులు చేస్తారు. అలాగే 10 వేల మంది కాఫీ రైతులకు మిరియాల సేకరణ అవసరమైన అల్యూమినియం నిచ్చెనలు అందిస్తారు. మొత్తం మీద రూ.202.193 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనున్నది.కొత్త కాఫీ ప్రాజెక్టు ద్వారా ఏజెన్సీలో మరో లక్ష గిరిజన కుటుంబాలకు మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 01:19 AM