Share News

ఉక్కుకు మంచి రోజులు

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:02 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు మళ్లీ మంచి రోజులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉక్కుకు మంచి రోజులు

  • మళ్లీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టాల్సిందిగా కేంద్ర ఉక్కు మంత్రిని కలిసిన ఎంపీ శ్రీభరత్‌

  • నియామకాలు చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించిన వైనం

  • ఆర్‌.కార్డుదారులకూ అవకాశం కల్పించాలని వినతి

  • పదోన్నతులపై కూడా చర్చ

విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు మళ్లీ మంచి రోజులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయం తగ్గింపు పేరుతో కొన్నాళ్లుగా ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్ల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నారు. మరోవైపు వంద శాతం ఉత్పత్తి తీయాలని ఒత్తిడి పెడుతున్నారు. ఉద్యోగులతో పన్నెండు గంటలు పనిచేయిస్తున్నారు. కొన్నేళ్లుగా పదోన్నతులు ఇవ్వడం మానేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. దాంతో వారిలో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. మూడు వేల మంది శాశ్వత ఉద్యోగులు, మరో ఐదు వేల మంది కాంట్రాక్టు వర్కర్లను తగ్గించేసి పూర్వంలా వంద శాతం ఉత్పత్తి చేయాలంటే తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఇలాగైతే ఎన్నాళ్లో ప్లాంటు నడపలేరని కూడా చెబుతున్నారు. దీనిపై విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌ స్పందించారు. దీనిపై సోమవారం ఢిల్లీలో పెద్దలతో చర్చించారు. కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామిని కలిసి విశాఖపట్నం ప్లాంటులో మళ్లీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఉద్యోగులకు పదోన్నతులు కూడా ఆపేశారని, వారిలో ఉత్సాహం నింపడానికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు భూములు ఇచ్చి నిర్వాసితులుగా మారిన వారిలో చాలామందికి ఇంకా ఉపాధి కల్పించలేదని, వాటిపై కూడా చర్యలు చేపట్టాలని కోరారు.

ఐదేళ్లుగా రిక్రూట్‌మెంట్‌ లేదు

స్టీల్‌ ప్లాంటులో పదిహేను వేల మంది శాశ్వత ఉద్యోగులు, మరో 15 వేల మంది కాంట్రాక్టు వర్కర్లు ఉండేవారు. ఏటా వేయి నుంచి 1,200 మంది శాశ్వత ఉద్యోగులు (ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌) పదవీ విరమణ చేస్తున్నారు. ఇంతకు ముందు ఏటా రిక్రూట్‌మెంట్‌ ఉండేది. 2020లో రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి, ఆపేశారు. అప్పటి నుంచి కొత్తగా ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు పేరుతో ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్ల సంఖ్య తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు శాశ్వత ఉద్యోగులు 10,200 మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఎగ్జిక్యూటివ్స్‌ 3,200 మంది కాగా మిగిలినవారు నాన్‌ ఎగ్జిక్యూటివ్స్‌. కాంట్రాక్టు వర్కర్లు ఎనిమిది వేల మందే ఉన్నారు. వీరితో 100 శాతం ఉత్పత్తి సాధ్యం కాదనేది అందరికీ తెలిసినా ఖర్చులు తగ్గించాలని మౌనంగా ఉన్నారు. ఇలా నడిపితే ప్లాంటు మూతపడే ప్రమాదం ఉండడంతో తక్షణమే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎంపీ శ్రీభరత్‌ కోరారు.

50 శాతం ఉద్యోగులు నిర్వాసితులకే

కూటమి ప్రభుత్వం వస్తే నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తుందని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. దానిని నిలుపుకొనే దిశగా ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ప్లాంటులో కొత్తగా టెక్నికల్‌ ఉద్యోగాలు ఏమైనా తీస్తే అందులో 50 శాతం నిర్వాసితులకు కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగానే నిర్వాసితులకు అవకాశం కల్పించాలని ఎంపీ శ్రీభరత్‌ కోరారు. స్టీల్‌ ప్లాంటులో ఇంకా ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. అలాగే ఇటీవల తొలగించిన కాంట్రాక్టు వర్కర్లను తిరిగి తీసుకోవాలని ఆయన మంత్రిని అడిగారు.

విద్యాలయాలపైనా చర్చ

స్టీల్‌ప్లాంటులో కేంద్రీయ విద్యాలయం ఉంది. దానిని కేంద్ర విద్యా శాఖ పరిధిలోకి మార్చాలని ఎంపీ కోరారు. అదేవిధంగా విమల విద్యాలయం సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు చేయాలని, ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు.

లాభాలలోకి వచ్చేందుకు సహకారం

‘ఎక్స్‌’లో కేంద్ర మంత్రి కుమారస్వామి

ఎంపీ శ్రీభరత్‌ తనను కలిసిన తరువాత ఉక్కు శాఖ మంత్రి కుమార్‌స్వామి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు గురించి ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. విశాఖపట్నం ప్లాంటు లాభాలలోకి రావడానికి, దానిపై ఆధారపడిన ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 01:02 AM