Share News

ఇసుక సరఫరాలో గోల్‌మాల్‌?

ABN , Publish Date - May 17 , 2025 | 12:29 AM

నగర శివారులో సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు సరఫరా చేసే ఇసుకలో భారీ గోల్‌మాల్‌ జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇసుక సరఫరాలో గోల్‌మాల్‌?

  • సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సరఫరా

  • ప్రతి ఇంటికి నాలుగు విడతలుగా 20 టన్నులు..

  • సుమారు ఐదారు టన్నుల ఇసుక పక్కదారి!

  • కాంటాక్టర్లతో పలువురు హౌసింగ్‌ అధికారుల మిలాఖత్‌..

  • రూ. 1.8 లక్షల యూనిట్‌ ఇంటికి ప్లాస్టింగ్‌ లేకుండానే ఇసుక వినియోగం

  • ఇసుక వినియోగంపై నిగ్గు తేల్చాలని హెచ్చరించిన ఉన్నతాధికారి

విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి):

నగర శివారులో సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు సరఫరా చేసే ఇసుకలో భారీ గోల్‌మాల్‌ జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఇంటికి 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తే అందుల్లో సుమారు ఐదారు టన్నులు పక్కదారి పడుతుందనే ఫిర్యాదులున్నాయి. అవసరానికి మించి సరఫరా చేసే ఇసుకను కొందరు కాంట్రాక్టర్లు బయటకు తరలిస్తున్నారు. చాలాకాలంగా సాగుతున్న ఈ దందాపై జిల్లా స్థాయిలో హౌసింగ్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు సరికదా కాంట్రాక్టర్లతో మిలాఖత్‌ అయ్యారనే వాదన వినిపిస్తోంది. అయితే వారం, పది రోజుల క్రితం జిల్లాకువచ్చిన హౌసింగ్‌ ఉన్నతాధికారి ఒకరు జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇసుక సరఫరాలో భారీగా తేడాలున్నాయని, వినియోగం లెక్కలు తేల్చకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరించడంతో అందరు అవాక్కయ్యారు.

నగర శివార్లలో 65 లేఅవుట్లలో 98,212 ఇళ్లు నిర్మిస్తున్నారు. లబ్ధిదారులకు బదులు కాంట్రాక్టర్లే ఇళ్లు నిర్మిస్తున్నారు. సెంటు స్థలంలో నిర్మించే ఇంటికి కేంద్రం పీఎంఎవై కింద రూ.1.8 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో నిర్మించే ఇళ్లకు తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయరు.. ఇంటి ముందు వైపుగా గోడను మాత్రమే ప్లాస్టింగ్‌ చేసి లబ్ధిదారునికి అప్పగిస్తారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులగా ఉండే లబ్ధిదారులకు ఓ ఇంటి కోసం బ్యాంకు ఇచ్చే రూ.35 వేల రుణం సదరు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ సొమ్ము కూడా కాంట్రాక్టరుకు ఇస్తే ఇంటికి తలుపులు, కిటికీల ఏర్పాటుతో పాటు నాలుగు వైపులా గోడలు, లోపల, ఫ్లోరింగ్‌కు ప్లాస్టింగ్‌ చేసి ఇస్తారు. ఇందుకు అనుగుణంగా లక్ష మంది లబ్ధిదారుల్లో 32వేల మందికి డ్వాక్రా రుణం కింద రూ.35 వేల వంతున చెల్లించారు.

ఇదిలావుండగా ఇళ్ల నిర్మాణాలకు గాను ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇసుక, సిమెంటు, ఐరన్‌ సరఫరా చేస్తోంది. శ్రీకాకుళం, రాజమండ్రిల్లో గల నదుల రీచ్‌ల నుంచి ఇసుకను జిల్లాలోని అన్ని లేఅవుట్లకు సరఫరా చేస్తున్నారు. ప్రతి ఇంటికి నాలుగు దఫాలలలో ఐదు టన్నుల వంతున 20 టన్నుల ఇసుక ఇస్తున్నారు. పునాదులు తీసే ముందు ఐదు టన్నులు, గోడలు నిర్మించేటప్పుడు ఐదు టన్నులు, శ్లాబ్‌ వేయడానికి ఐదు టన్నులు, ప్లాస్టింగ్‌కు ఐదు టన్నుల వంతున ఇవ్వాలన్నది ప్రతిపాదనల్లో ఉంది. ఇప్పటిరకు వరకు సుమారు 38 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వగా, ఈ నెలాఖరు నాటికి మరో 13,095 ఇళ్ల పూర్తికి లక్ష్యంగా చేసుకున్నారు. మిగిలిన వాటిలో 3,342 ఇళ్లకు పునాదులు తవ్వగా, సుమారు 24 వేల ఇళ్లు పునాదుల వరకు, 20,400 ఇళ్లకు పునాదులు పూర్తి చేయగా.. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చే పీఎంఏవై నిధులు రూ.1.8 లక్షలతో చేపట్టే ఇళ్లకు ముందు గోడను మాత్రమే ప్లాస్టింగ్‌ చేస్తారు. దీనికి కూడా ఐదు టన్నుల వంతున ఇసుకను సరఫరా చేస్తున్నారు. అదే డ్వాక్రా సంఘం నుంచి ఇచ్చే రూ.35 వేలు అందితే మొత్తం ప్లాస్టింగ్‌ చేస్తారు. దీనికి అనుగుణంగానే ఇసుక సరఫరా చేయాలి. శ్లాబ్‌ వరకు 15 టన్నులు సరఫరా చేసిన అధికారులు.. మొత్తం ఇళ్లు పూర్తికి మిగిలిన ఐదు టన్నుల సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు పూర్తిచేసిన 38 వేల ఇళ్లలో రూ.1.8 లక్షలు, రూ.2.15 లక్షలు కేటాయించినవి ఉన్నాయి. ఈ రెండింటికీ ఒకేలా 20 టన్నుల వంతున ఇసుక సరఫరా చేశారు. ఇంటి ముందు గోడ ప్లాస్టింగ్‌ చేయడానికి ఐదు టన్నుల ఇసుక అవసరం లేదు. అయినా కాంట్రాక్టర్లు ఇండెంట్‌ పెట్టిన వెంటనే ఇసుక కోసం ఆన్‌లైన్‌లో ఇన్‌ వాయిస్‌లో జనరేట్‌ చేస్తున్నారు. మరో విశేషమేమిటంటే.. సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి 13 టన్నుల ఇసుక సరిపోతుందని నగరంలో ప్రైవేటు ఇళ్లు నిర్మిస్తున్న సివిల్‌ ఇంజనీర్‌ ఒకరు తెలిపారు. అటువంటిది సెంటు స్థలంలో నిర్మించే ఇంటికి 20 టన్నుల్లో ఐదారు టన్నుల వరకు మిగులుతుందన్నారు.

ఇదిలావుండగా రీచ్‌ల నుంచి వచ్చే ఇసుక లోడుల్లో కొన్నింటిని మధ్యలోనే దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక సరఫరా విషయంలో కాంట్రాక్టర్లకు కొందరు ఏఈలు అడ్డగోలుగా సాయపడుతున్నారనే వాదన ఉంది. లేఅవుట్లలో ఇసుక నిల్వలు, వినియోగంపై లెక్కలు తేల్చకుండా కాంట్రాక్టర్లు ఇచ్చిన సొమ్ముతో కొందరు అఽధికారులు జేబులు నింపుకుంటున్నారనే ఫిర్యాదులున్నాయి. ఇసుక వినియోగంపై వారం, పది రోజుల క్రితం జిల్లాకు వచ్చిన ఉన్నతాధికారి చేసిన హెచ్చరికతో అధికారులు అప్రమత్తం అవుతారా? అనేది అనుమానమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు సరఫరా చేసే ఇసుక వినియోగంపై సమగ్ర విచారణ చేపడితే గుట్టురట్టు అవుతుందని రిటైర్డు హౌసింగ్‌ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

Updated Date - May 17 , 2025 | 12:29 AM