అందాల వ్యూపాయింట్‌కు వెళ్లాంటే సాహసమే..
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:14 PM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి సమీపంలో ఉన్న చెరువులవేనం ప్రకృతి సౌందర్యానికి నిలయంగా గుర్తింపు పొందింది. నాలుగేళ్ల క్రితం చెరువులవేనం వ్యూపాయింట్‌కి వెళ్లేందుకు ఐటీడీఏ అధికారులు కనెక్ట్ పాడేరులో భాగంగా గ్రావెల్ రోడ్డు నిర్మించారు. త్వరలో తారు రోడ్డు నిర్మిస్తామని వైసీపీ నాయకులు ఆర్భాటంగా ప్రచారం చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం చెరువులవేనం వెళ్లేందుకు పర్యాటకులు, ఆదివాసీలు సాహసం చేయాల్సి వస్తున్నది.
వర్షం పడితే చెరువలవేనం రోడ్డు బురదే..
తారు రోడ్డు నిర్మిస్తామని ఐదేళ్లు ఊరించిన వైసీపీ నేతలు
నాలుగు నెలల్లో ప్రారంభం కానున్న పర్యాటక సీజన్
పట్టించుకోని పాలకులు, అధికారులు
చింతపల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): లంబసింగికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై చెరువులవేనం గ్రామం ఉన్నది. చెరువులవేనం వాతావరణం విభిన్నంగా ఉంటుంది. శీతాకాలంలో మంచు మేఘాలు చెరువులవేనాన్ని తాకుతూ పయనిస్తుంటాయి. వ్యూపాయింట్‌కి ఎదురుగానున్న లోయపై మంచు దుప్పటి కప్పినట్టుగా సుందరంగా ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను ఏడేళ్ల క్రితం తొలిసారిగా ‘ఆంధ్రజ్యోతి’ బాహ్యప్రపంచానికి పరిచయం చేసింది. ప్రతీ ఏడాది పర్యాటక సీజన్‌లో లంబసింగికి వచ్చిన సందర్శకులు చెరువులవేనం ప్రకృతి అందాలు వీక్షించేందుకు క్యూ కడుతున్నారు. గత నాలుగేళ్లగా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.
అధ్వానంగా చెరువులవేనం రహదారి
చెరువులవేనం రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. గతంలో చెరువులవేనం గ్రామానికి వెళ్లేందుకు లంబసింగి నుంచి కాలిబాట మాత్రమే ఉండేది. పర్యాటకులు సైతం ఈ కాలిబాటలోనే వ్యూపాయింట్ వద్దకు వచ్చేవారు. మూడేళ్ల క్రితం కనెక్ట్ పాడేరులో భాగంగా భీమనాపల్లి నుంచి చెరువులవేనం వరకు అధికారులు రూ.80లక్షలతో మెటల్ రోడ్డు వేయించారు. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ బండరాళ్లను బ్లాస్టింగ్ చేసి మట్టి రోడ్డు నిర్మించారు. నిధులు విడుదల జాప్యం కారణంగా మెటల్ వేయలేదు. చిన్నపాటి వర్షం కురిసినా బురదమయమైపోతున్నది. దీంతో ఈ రహదారిపై వాహనాలు ప్రయాణించే పరిస్థితి లేకుండా పోయింది.
ఊరించి.. ఉసురుమనిపించిన వైసీపీ నేతలు
చెరువులవేనం వ్యూపాయింట్ వద్దకు తారు రోడ్డు నిర్మాణం చేపడతామని వైసీసీ నేతలు ఊరించి ఉసురుమనిపించారు. ప్రతి ఏడాది పర్యాటక సీజన్ ప్రారంభంకాగానే పర్యాటకులు, స్థానిక ఆదివాసీలు రహదారి సమస్యను వైసీపీ నాయకుల దృష్టికి తీసుకు వెళ్లడం, వెంటనే తారు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామంటూ ఐదేళ్లు ప్రకటనలకే పరిమితం చేశారు. చెరువులవేనం గ్రామానికి కనీసం వైసీపీ నేతలు మెటల్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. దీంతో వైసీపీ నాయకుల హామీలు నీటిమూటలయ్యాయని ఆదివాసీలు విమర్శిస్తున్నారు.
నాలుగు నెలల్లో పర్యాటక సీజన్
మరో నాలుగు నెలల్లో పర్యాటక సీజన్ ప్రారంభం కానున్నది. కూటమి ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ నేపథ్యంలో చెరువులవేనం వ్యూపాయింట్ వద్దకు రహదారి నిర్మాణం చేపడితే సందర్శకులు, ఆదివాసీలకు ఉపయోగకరంగా వుంటుంది. రెండు రోజుల క్రితం చెరువులవేనం సందర్శించిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సళిన్ కుమార్ శ్రీవాస్తవ చెరువులవేనం సందర్శించారు. వ్యక్తిగత వాహనాలు వ్యూపాయింట్‌కి వెళ్లే పరిస్థితి లేక ప్రైవేటు జీపులో అతికష్టంపై కొండపైకి చేరుకున్నారు. ప్రకృతి అందాలు అత్యద్భుతంగా ఉన్నాయని, వ్యూపాయింట్ వరకు రహదారి నిర్మించాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని ఆయన చెప్పారు.