Share News

స్వర్ణకవచ అలంకరణలోకనకమహాలక్ష్మి అమ్మవారు

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:23 AM

బురుజుపేటలోని కనకమహాలక్ష్మి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

స్వర్ణకవచ అలంకరణలోకనకమహాలక్ష్మి అమ్మవారు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

మహారాణిపేట, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

బురుజుపేటలోని కనకమహాలక్ష్మి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారు స్వర్ణకవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి 108 స్వర్ణ పుష్పాలతో వేదపండితులు అర్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఆదిలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


ఉక్కు సమస్యలపై కలెక్టర్‌ దృష్టి

రెండు రోజుల క్రితం నగరానికి విచ్చేసిన కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సెక్రటరీతో భేటీ

నిర్వాసితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి

తొలగించిన నిర్వాసిత కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి

విమల విద్యాలయం కొనసాగించాలని సూచన

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ ప్లాంటు సమస్యల పరిష్కారంపై కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నిర్వాసిత కాంట్రాక్టు వర్కర్లను కూడా స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం తీసేసిన నేపథ్యంలో వారికి న్యాయం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం స్టీల్‌ ప్లాంటుకు ఢిల్లీ నుంచి స్టీల్‌ సెక్రటరీ సందీప్‌ ఫౌండ్రీ రాగా కలెక్టర్‌ ప్లాంటుకు వెళ్లి ఆయన్ను ప్రత్యేకంగా కలిశారు. స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు భూములు ఇచ్చి నిర్వాసితులుగా మారిన వారికి ఉపాధి కల్పించాలని చట్టంలో ఉందని, ఇంకా ఎనిమిది వేల మందికి ఉపాధి లేదని సెక్రటరీకి వివరించారు. ఉపాధి కల్పన కేంద్రం ద్వారా వచ్చే జాబితా ప్రకారం దశల వారీగా వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా మే నెలలో 200 మందికిపైగా నిర్వాసిత కాంట్రాక్టు వర్కర్లను తొలగించారని, తక్షణం వారిని తిరిగి తీసుకోవాలని సూచించారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదేవిధంగా నిర్వాసిత కుటుంబాల కోసం ప్లాంటు యాజమాన్యం సహకారంతో నడుస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొనసాగించలేని పక్షంలో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వీఆర్‌ఎస్‌ అమలు చేయాలన్నారు. అదేవిధంగా ఆ విద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే ఎయిడెడ్‌ సిబ్బంది ద్వారా దానిని నడిపిస్తామని, తద్వారా ఆ ప్రాంత పేద పిల్లలకు విద్య అందుతుందన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచించారు. ఈ సమస్యల పట్ల స్టీల్‌ సెక్రటరీ సందీప్‌ ఫౌండ్రిక్‌ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే తగిన నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.


24న విజయవాడకు డీఎస్సీ అభ్యర్థులు

25న నియామక పత్రాల అందజేత

వచ్చే నెల మూడో తేదీ నుంచి నూతన ఉపాధ్యాయులకు శిక్షణ

10న కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టింగ్స్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

మెగా డీఎస్సీలో ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధ్యాయులుగా ఎంపికైన 1,134 మంది ఈనెల 24న విజయవాడ బయలుదేరనున్నారు. ఆరోజు ఉదయం ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం నుంచి బస్సులు బయలుదేరతాయి. అభ్యర్థులతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరిని అనుమతించనున్నారు. ఈ నెల 25వ తేదీన అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తారు. విజయవాడలో నియామక పత్రాలు అందుకున్న తరువాత తిరిగి జిల్లాకు తీసుకువస్తారు. అలాగే దసరా సెలవులు ముగిసిన తరువాత అక్టోబరు మూడు నుంచి పదో తేదీ వరకు నూతన ఉపాధ్యాయులకు కేటగిరీల వారీగా శిక్షణ ఇస్తారు. ఇందుకు సబ్బవరం, రుషికొండ ఐటీ హిల్స్‌లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. శిక్షణ చివరిరోజు పదో తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అందుకు ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్‌ కేటగిరీలో ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పాడేరు డివిజన్‌, అనకాపల్లి జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఈ పర్యాయం భర్తీ చేస్తారు. ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన కౌన్సెలింగ్‌లో మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలో పనిచేస్తూ బదిలీ అయినవారు చాలామంది ఇప్పటివరకూ రిలీవ్‌ కాలేదు. ఆయా పోస్టుల్లోకి వెళ్లేందుకు టీచర్లు లేకపోవడమే అందుకు కారణం. డీఎస్సీలో ఎంపికైన టీచర్లను అక్కడకు పంపి, వారిని రిలీవ్‌ చేస్తామని విశాఖ డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Sep 23 , 2025 | 01:23 AM