గో బ్యాక్...అంబుజా
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:37 AM
కాలుష్య భయంతో ప్రజలు కదం తొక్కారు. కొత్త పరిశ్రమ ఏర్పాటుపై కన్నెర్ర చేశారు. బతుకులు నాశనం చేయవద్దంటూ నినదించారు. అధికారుల ఏర్పాట్లను భగ్నం చేశారు. చేయగలిగిందేమీ లేక అధికారులు ఉత్త చేతులతో వెనుతిరిగారు. ఇవీ...బుధవారం అంబుజా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ సభలో చోటుచేసుకున్న పరిణామాలు.
సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత
కాలుష్య భయం....కదం తొక్కిన జనం
ప్రజాభిప్రాయ సేకరణ భగ్నం
వెనక్కి తగ్గిన అధికారగణం
సాయంత్రం మమ అనిపించేందుకు యత్నం
నాయకులు అంగీకరించకపోవడంతో వాయిదా
విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
కాలుష్య భయంతో ప్రజలు కదం తొక్కారు. కొత్త పరిశ్రమ ఏర్పాటుపై కన్నెర్ర చేశారు. బతుకులు నాశనం చేయవద్దంటూ నినదించారు. అధికారుల ఏర్పాట్లను భగ్నం చేశారు. చేయగలిగిందేమీ లేక అధికారులు ఉత్త చేతులతో వెనుతిరిగారు. ఇవీ...బుధవారం అంబుజా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ సభలో చోటుచేసుకున్న పరిణామాలు.
గంగవరం పోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో పెదగంట్యాడ వద్ద కణితి గెడ్డను ఆనుకొని అదానీ యాజమాన్యం అంబుజా సిమెంట్స్ కంపెనీ పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై పెదగంట్యాడ ఉక్కు నిర్వాసితుల కాలనీలోని క్రీడా మైదానంలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి సమీపంలోని 20 గ్రామాల ప్రజలు, ఉక్కు కార్మిక సంఘ నాయకులు తరలివచ్చారు. అందరి కంటే ముందు అక్కడకు సీపీఎం నాయకులు జగ్గునాయుడు, సీఐటీయూ నాయకులు కుమార్, స్టీల్ ప్లాంటు పరిరక్షణ కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్, తదితరులు చేరుకుని ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారిని హార్బర్ ఏసీపీ కాళిదాసు గేటు వద్దనే కొద్దిసేపు ఆపేశారు. ఆందోళన చేయకుండా అభిప్రాయాలు చెప్పాలని లోపలకు అనుమతించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన స్థానికులు ముఖ్యంగా మహిళలు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోర్టు కాలుష్యం నుంచి కాపాడాలని తాము చాలాకాలంగా కోరుతుంటే పట్టించుకోకుండా, ఇప్పుడు మరో కాలుష్య పరిశ్రమ అంబుజా సిమెంట్స్‌ను ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. ‘గో బ్యాక్ అదానీ’, ‘గో బ్యాక్ అంబుజా’...అంటూ నినాదాలు చేశారు. ‘పరిశ్రమలు..పెట్టుబడులు..ఉపాధి అవకాశాలు’ అంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలకు ప్రజల ఆరోగ్యం పట్డదా?, ప్రాణాలు తీసే పరిశ్రమలు అనుమతిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చింది. కుర్చీలను బయటకు విసిరేశారు. బారికేడ్లు తొలగించారు. చివరకు వేదికను కూడా కూల్చివేశారు. పోలీసులు కొందరు నిరసనకారులను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
వేదికకు దూరంగా అధికారులు
ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ప్రొటోకాల్ డ్యూటీకి ఆర్‌డీఓ శ్రీలేఖ, ఏపీ పీసీబీ నుంచి ఈఈ ముకుందరావు, పెదగంట్యాడ తహశీల్దార్ అమల మైదానం వద్దకు వచ్చారు. అయితే ఆందోళన తీవ్రంగా ఉండడంతో పోలీసులు వారిని వేదిక వద్దకు రానీయలేదు. వెనుకనున్న తహశీల్దార్ కార్యాలయంలోనే ఉంచేశారు.
వేదికపై అదానీ మనుషులు!
ప్రజాభిప్రాయ సేకరణ వేదికపై అదానీ గ్రూపునకు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో మోహరించారు. జరుగుతున్న ఆందోళన అంతా ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో వీడియో ద్వారా తమ పెద్దలకు చూపించారు. వేదిక వద్దకు సీఐటీయూ నాయకుడు కుమార్ చేరుకొని నిరసన వ్యక్తంచేయగా ఆయన్ను పోలీసులతో బయటకు పంపించే వరకు అదానీ మనుషులు ఒప్పుకోలేదు.
ఆర్‌డీఓ మాట వినని ఆందోళనకారులు
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆర్‌డీఓ శ్రీలేఖ, పీసీబీ ఈఈ ముకుందరావుతో కలిసి మైదానంలోకి ప్రవేశించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు గుంపులు గుంపులుగా కనిపించగా వారితో మాట్లాడడానికి యత్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడానికి అవకాశం ఇవ్వాలని, అభిప్రాయాలు చెప్పాలని ఆమె నచ్చజెప్పడానికి యత్నించగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఈ కార్యక్రమం రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని వారు స్పష్టంచేయడంతో చేసేది లేక ఆమె ఈఈతో కలిసి తహశీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిపోయారు.
సీఎంఓ నుంచి ప్రాజెక్టుపై ఆరా
ఈ ఆందోళన, నిరసన అంతా టీవీ ఛానళ్లలో రావడంతో సీఎంఓ నుంచి విశాఖపట్నం అధికారులకు ఫోన్ చేసి, అంబుజా సిమెంట్ ప్రాజెక్టు వివరాలు అర్జంట్‌గా పంపాలంటూ కోరడం గమనార్హం. దీంతో అధికారులు అప్పటికప్పుడు వివరాలు పంపించారు.
మమ అనిపించేందుకు మంతనాలు
అంబుజా సిమెంట్స్ ఏర్పాటుకు ఏదో విధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆందోళన మధ్యాహ్నం ఒంటి గంటకే ముగిసిపోగా అధికారులు సాయంత్రం ఆరు గంటల వరకు పెదగంట్యాడలోనే ఉన్నారు. అదానీకి అనుకూలమైన వారితో చిన్న సమావేశం ఏర్పాటుచేసి, అభిప్రాయాలు తీసుకొని మమ అనిపించాలని యత్నించారు. మరోవైపు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ స్థానిక రాజకీయ పార్టీల నాయకులను సాయంత్రం ఐదు గంటలకు పెదగంట్యాడ తహశీల్దార్ కార్యాలయానికి పిలిపించుకొని చర్చలు జరిపారు. ప్రజలు పరిశ్రమను వ్యతిరేకించినా, అంగీకరించినా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం అనివార్యమని, దీనికి సహకరించాలని కోరారు. అందరికీ అంగీకారమైతే అక్కడికక్కడే అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. దీనికి సదరు నాయకులు అంగీకరించలేదు. అయితే ఈ నెలాఖరులోగా తేదీని ఖరారు చేస్తామని, అప్పుడు అంతా వచ్చి అభిప్రాయాలు చెప్పాలని, ఆందోళన చేయవద్దని జేసీ సూచించారు.
ప్రజాభిప్రాయమే ఫైనల్
యాజమాన్యం ముందు అవగాహన కల్పించాల్సింది
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
అంబుజా సిమెంటు పరిశ్రమ ఏర్పాటుపై ప్రజల నిర్ణయమే ఫైనల్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. పెదగంట్యాడలో బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ భగ్నం కావడంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించే ముందు సంబంధిత యాజమాన్యాలు పరిసర ప్రాంతాల ప్రజలకు పెట్టబోయే పరిశ్రమపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. సిమెంటు పరిశ్రమల వల్ల కాలుష్యం వస్తుందని ప్రజలు భయపడుతున్నారన్నారు. దానిపై అభయం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉందన్నారు. ప్రజలు ఏదైతే అభిప్రాయాలు వెల్లడించారో అదే ఫైనల్ అని స్పష్టంచేశారు. ప్రజల నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఇదే అదనుగా కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం యత్నిస్తారని, వారి మాటలు విశ్వసించవద్దని సూచించారు.