Share News

బాలికలు చదువుకు దూరం

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:17 AM

సబ్‌ డివిజన్‌ కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో బాలికలకు సీట్ల కొరత ఏర్పడింది. చింతపల్లిలో విద్యార్థినుల కోసం బాలుర-2 ఆశ్రమ పాఠశాలను బాలికల పాఠశాలగా మార్పు చేసేందుకు గత ఏడాది గిరిజన సంక్షేమశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికి ఆచరణకు నోచుకోలేదు.

బాలికలు చదువుకు దూరం
బాలికల పాఠశాలగా మార్పుచేసేందుకు ప్రతిపాదించిన బాలుర-2 పాఠశాల

- ఆశ్రమ పాఠశాలల్లో బాలికలకు సీట్ల కొరత

- ప్రతిపాదనకే పరిమితమైన కొత్త పాఠశాల

- పట్టించుకోని గిరిజన సంక్షేమశాఖ అధికారులు

చింతపల్లి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సబ్‌ డివిజన్‌ కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో బాలికలకు సీట్ల కొరత ఏర్పడింది. చింతపల్లిలో విద్యార్థినుల కోసం బాలుర-2 ఆశ్రమ పాఠశాలను బాలికల పాఠశాలగా మార్పు చేసేందుకు గత ఏడాది గిరిజన సంక్షేమశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికి ఆచరణకు నోచుకోలేదు. దీంతో విద్యార్థినులకు బాలికల ఆశ్రమ పాఠశాలల్లో సీట్లు లభించక అవస్థలు పడుతున్నారు.

చింతపల్లి మండలంలోని చింతపల్లి, లంబసింగి, వంగసార గ్రామాల్లో మూడు బాలికల ఆశ్రమ పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. బాలురకు ఏడు ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వంగసార, చింతపల్లిలో 570, లంబసింగిలో 450 సీట్లు కేటాయించారు. లంబసింగిలో విద్యార్థినులకు సరిపడా తరగతి, వసతి భవనాలు అందుబాటులో లేవు. దీంతో ఈ పాఠశాలలో 350 మందికి మించి విద్యార్థినులను చేర్చుకునే పరిస్థితి లేదు. వంగసార, చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలపైనే విద్యార్థినులు ఆధారపడుతున్నారు. ప్రతి ఏడాది మండలంలో మూడు, నాలుగు, ఐదు తరగతులు పూర్తి చేసుకున్న గిరిజన విద్యార్థినులు సుమారు 4500 నుంచి 5000 మంది ఉంటున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చేరే విద్యార్థినులు 800 మంది వరకు ఉంటున్నారు. కేవలం 250 నుంచి 300 మంది విద్యార్థినులకు మాత్రమే మూడు బాలికల ఆశ్రమ పాఠశాలల్లో సీట్లు లభిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు మూడు పాఠశాలల్లోనూ ఐదవ తరగతిలో పరిమితికి మించి 100 నుంచి 150 మంది వరకు చేర్పించుకుంటున్నారు. అయితే పాఠశాలలో వసతి సమస్య తలెత్తుతోంది.

ప్రతిపాదనలకే పరిమితం

వసతి గృహాల్లో చేరే విద్యార్థినుల సంఖ్య భారీగా పెరగడంతో చింతపల్లి మండలానికి మరో బాలికల ఆశ్రమ పాఠశాల అవసరమని గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలుర-2 పాఠశాలను బాలికల పాఠశాలగా మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి బాలుర-2 పాఠశాలను బాలికల పాఠశాలగా మార్పుచేసి విద్యార్థినులను చేర్చుకోవాలని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బాలుర-2లో చదువుతున్న విద్యార్థులను వివిధ పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం గిరిజన సంక్షేమశాఖ అధికారులు కనీసం స్పందించడం లేదు. బాలుర-2లో ఈ ఏడాది యథావిధిగా విద్యార్థులను చేర్పించుకుంటున్నారు. దీంతో బాలుర-2 పాఠశాల బాలికల పాఠశాలగా మార్పు అనేది ఉండదని స్పష్టమైంది.

సీట్ల కోసం అవస్థలు

మండలంలో బాలికలు ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యార్థినులు, తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశాలు కావాలని ప్రతి రోజు పది నుంచి 15 మంది విద్యార్థినులు, తల్లిదండ్రులు వస్తున్నారు. దీంతో ప్రస్తుతం పాఠశాలలో 40 సీట్లు మాత్రమే ఉన్నాయని, విద్యార్థినులందరికి సీట్లు కేటాయించలేమని ఉపాధ్యాయులు చెప్పి పంపించేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో సీట్ల కోసం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సిఫారసులు చేస్తున్నారంటే డిమాండ్‌ ఏ స్థాయిలో ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో సీట్లు లభించక పొరుగు మండలాలకు వెళుతున్నారు. అక్కడ స్థానిక మండలానికి చెందిన విద్యార్థినులకు మాత్రమే సీట్లు కేటాయిస్తున్నారు. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో సీట్లు లభించని విద్యార్థినులు విద్యకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు స్పందించి చింతపల్లికి అదనంగా మరో బాలికల పాఠశాలను ఏర్పాటుచేసి ఆదివాసీ విద్యార్థినులందరికి సీట్లు కేటాయించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:17 AM