బాలికకు వేధింపులు... యువకుడిపై పోక్సో కేసు
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:22 AM
ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురిచేశాడనే అభియోగంపై రామకృష్ణ (25) అనే యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి, మంగళవారం రిమాండ్‌కు తరలించినట్టు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
పోలీసులు చిత్రహింసలు పెట్టినట్టు న్యాయాధికారికి నిందితుడి ఫిర్యాదు
మర్మాంగంపై అగరువత్తితో
కాల్చినట్టు ఆరోపణ
విచారణకు ఆదేశం
మహారాణిపేట, జూలై 24 (ఆంధ్రజ్యోతి):
ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురిచేశాడనే అభియోగంపై రామకృష్ణ (25) అనే యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి, మంగళవారం రిమాండ్‌కు తరలించినట్టు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వన్‌టౌన్‌లోని రంగిరాజు వీధిలో నివాసం ఉంటున్న రామకృష్ణ అదే ప్రాంతానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. బాలిక తిరస్కరించడంతో ఆమె ఇంటికి వెళ్లి చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక తండ్రి ఆదివారం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామకృష్ణను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హార్బర్ ఏసీపీ కాళిదాసు సోమవారం పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం మంగళవారం న్యాయాధికారి వద్ద హాజరుపరిచారు. అయితే ఆదివారం తనను స్టేషన్‌లో ఉంచినప్పుడు సీఐ దాలిబాబు ఆదేశాల మేరకు ఎస్‌ఐ శ్రీను, రైటర్ సంతోష్ కలిసి తనను చిత్రహింసలకు గురిచేశారని, మర్మాంగంపై అగరవత్తితో కాల్చడంతో తీవ్రగాయాలయ్యాయని న్యాయాధికారికి నిందితుడు రామకృష్ణ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో నిందితుడికి రిమాండ్ విధించిన మెజిస్ర్టేట్...ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ శంఖబ్రతబాగ్చీని ఆదేశించినట్టు సమాచారం. మెజిస్ర్టేట్ ఆదేశాలతో సీపీ శంఖబ్రతబాగ్చి దీనిపై హార్బర్ ఏసీపీని వివరణ కోరారు. తాను నిందితుడిని సోమవారం అరెస్టు చేశానని, నిందితుడి మర్మాంగంపై గాయపరిచిన ఘటన ఆదివారం జరిగిందని, సోమవారం తనకు ఆ విషయాన్ని స్టేషన్ సిబ్బందిగానీ, నిందితుడుగానీ చెప్పలేదని వివరణ ఇచ్చినట్టు సమాచారం. నిందితుడిని స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసిన విషయం బయటకు పొక్కడంతో సీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.