సేవా దాతలుగా గిరి యువత
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:17 PM
ఆదికర్మయోగి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2 లక్షల మంది గిరిజన యువతను సేవా దాతలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
‘ఆదికర్మయోగి’ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన
పాడేరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఆదికర్మయోగి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2 లక్షల మంది గిరిజన యువతను సేవా దాతలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. ఆదికర్మయోగి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదికర్మయోగి రెస్పాన్సివ్ గవర్నెన్స్ నేషనల్ మిషన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తుందన్నారు. దీనిని క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు జిల్లాలో అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు 2 లక్షల మంది గిరిజన యువతను ఆదికర్మయోగి సేవా దాతలుగా తీర్చిదిద్దుతా మన్నారు. వికసిత్ భారత్- 2047 దృష్టితో ఈ మిషన్ గిరిజన గ్రామాల అభివృద్ధికి గ్రామ స్థాయిలో నాయకత్వం, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనను బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రభుత్వ సేవలు ఆఖరి లబ్ధిదారుకు సైతం చేరేలా సదుపాయాలను బలోపేతం చేస్తామన్నారు. ఆగస్టు నాలుగో తేదీ నుంచి ఆదికర్మయోగి కార్యక్రమం అమలుపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, మండల, గ్రామ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే విద్య, వైద్యం, తాగునీరు, జీవనోపాధి, అటవీ ఉత్పత్తుల వ్యాపారం వంటి అంశాలపై గిరిజనులను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదికర్మయోగి కార్యక్రమం అమలుకు మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ అందించారన్నారు. మాస్టర్ ట్రైనర్లు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం జిల్లా సమగ్ర అభివృద్ధికి, ఆదికర్మయోగి అమలుకు కృషి చేస్తానని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, జిల్లా మాస్టర్ ట్రైనర్లు వి.నాగశిరీషా, డి.శారదాదేవి, జె.అచ్యుత్‌కిరణ్, ఆర్.రామమ్, పి. చంద్రకిరణ్, కె..ధ్రువకుమార్, బి.బాబు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.