రబీకి సన్నద్ధం!
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:56 AM
జిల్లాలో రబీ వ్యవసాయ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది రబీలో అన్ని రకాల పంటలు కలిపి 15,630 హెక్టార్లులో సాగు అయ్యే అవకాశం వుందని అంచనా వేశారు. ఇందులో సుమారు రెండు వేల ఎకరాల్లో వరి పంట వుండే అవకాశం వుంది.
ప్రణాళికను సిద్ధం చేసిన అధికారులు
15,630 హెక్టారుల్లో వివిధ రకాల పంటల సాగయ్యే అవకాశం
రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రబీ వ్యవసాయ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది రబీలో అన్ని రకాల పంటలు కలిపి 15,630 హెక్టార్లులో సాగు అయ్యే అవకాశం వుందని అంచనా వేశారు. ఇందులో సుమారు రెండు వేల ఎకరాల్లో వరి పంట వుండే అవకాశం వుంది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వరి నారుమళ్లు తయారీ సమయంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరినాట్లు ఆలస్యం అయ్యాయి. ఈ ప్రభావం పంట కోత, నూర్పిడి పనులపై పడింది. ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు, నూర్పిడి పనుల్లో రైతులు బిజీగా వున్నారు. నీటి సదుపాయం వున్న పొలాల్లో రబీలో కూడా వరి సాగు చేయడానికి రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సుమారు రెండు వేల ఎకరాల్లో వరిసాగు చేసే అవకాశం వుందన్న అంచనాతో 560 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆయా మండలాల్లో వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు. దేవరాపల్లి, చీడికాడ, కె.కోటపాడు, మాడుగుల, రావికమతం మండలాల్లో కొన్ని గ్రామాల్లో రబీ వరి సాగుకు నారుమళ్లు సిద్ధం చేసుకొంటున్నారు.
కాగా రబీలో అన్ని రకాల పంటలకు 14,559 టన్నుల ఎరువులు అవసరమని అధికారులు నిర్ధారించారు. ఇందులో 7,120 టన్నుల యూరియా ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో వుంది. ఈ నెలాఖరు నాటికి 1,704 టన్నుల యూరియా వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు నానో యూరియా, నానో డీఏపీని కూడా అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు.