జంగిల్ బెల్స్‌లో జర్మన్ టెంట్లు
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:49 PM
మండలంలోని తైడా జంగిల్ బెల్స్‌ను మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. ఆధునికీకరణలో భాగంగా ఇక్కడ జర్మన్ టెంట్లను పర్యాటక శాఖాధికారులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు జోరుగా సాగుతున్నాయి.
తైడాలో జోరుగా ఆధునికీకరణ పనులు
ఉడెన్ కాటేజీల స్థానంలో దశలవారీగా టెంట్ల నిర్మాణం
పర్యాటకులను ఆకట్టుకునేలా మరిన్ని సొబగులు
అనంతగిరి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తైడా జంగిల్ బెల్స్‌ను మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. ఆధునికీకరణలో భాగంగా ఇక్కడ జర్మన్ టెంట్లను పర్యాటక శాఖాధికారులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు జోరుగా సాగుతున్నాయి.
దట్టమైన అటవీ ప్రాంతంలో పర్యాటకులు సేదతీరేందుకు 2001 సంవత్సరంలో పర్యాటకశాఖ, అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజం ప్రాజెక్టును రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభించింది. అరకు- విశాఖ ప్రధాన రహదారిని ఆనుకుని ఘాట్‌రోడ్డులో ఇది ఉండడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉడెన్ కాటేజీల్లో బస చేసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ఉడెన్ కాటేజీలు నిర్మించి దాదాపు 24 సంవత్సరాలు కావస్తుండడంతో పర్యాటకశాఖ ఉడెన్ కాటేజీల స్థానంలో జర్మన్ టెంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీని కోసం రూ.7.5 కోట్లు కేటాయించగా, టెంట్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి..
దశలవారీగా 17 జర్మన్ టెంట్ల నిర్మాణం
వాస్తవానికి జంగిల్ బెల్స్‌లో 23 ఉడెన్ కాటేజీలు ఉన్నాయి. వీటిని 24 సంవత్సరాల క్రితం నిర్మించడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. దీంతో పాత ఉడెన్ కాటేజీలు 4, న్యూ ఉడెన్ కాటేజీలు 2 అలాగే ఉంచి మిగిలిన 17 కాటేజీల స్థానంలో దశలవారీగా జర్మన్ టెంట్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో టెంటు రూ.13 లక్షలతో ఇప్పటి వరకు 14 వరకు జర్మన్ టెంట్లు నిర్మించారు. ఇవి ఫైర్ ఫ్రూఫ్ కావడంతో పూర్తి భద్రత ఉంటుంది. అంతే కాకుండా జంగిల్ బెల్స్‌లో మరిన్ని ఆధునికీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి.