ఎర్రమట్టి దిబ్బల్లో జియో హెరిటేజ్ స్థలం గుర్తింపు
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:27 AM
ప్రభుత్వం నియమించిన కమిటీ సోమవారం ఎర్రమట్టి దిబ్బలు ప్రాంతాన్ని సందర్శించింది.
భీమునిపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వం నియమించిన కమిటీ సోమవారం ఎర్రమట్టి దిబ్బలు ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడ జియో హెరిటేజ్ స్థలాన్ని గుర్తించింది. ఆ స్థలాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని స్థానిక రెవెన్యూ అధికారులకు సూచించింది. జియో హెరిటేజ్ స్థలంలో తవ్వకాలు జరుపుతున్నారని పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేశారు. కోర్టు ఆదేశాల మేరకు జియో హెరిటేజ్ స్థలం గుర్తింపునకు వారం కిందట మైనింగ్ శాఖ ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో వీఎంఆర్‌డీఏ నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఆర్‌డీఓ (సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్సు), గనుల శాఖ నుంచి డిప్యూటీ డైరెక్టర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి డైరెక్టర్ పి.దుర్గాప్రసాద్, సీనియర్ జియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ దొరడ్ల సభ్యులుగా ఉన్నారు. కమిటీ సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, జియో హెరిటేజ్ స్థలాన్ని గుర్తించి హద్దులు నిర్ణయించింది. ఆ స్థలం చుట్టూ కాంక్రీట్ పిల్లర్లు నిర్మించిన తరువాత మరోమారు వెళ్లి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయనున్నారు.
పెరుగుతున్న చికున్‌గున్యా బాధితులు
రోగులను వేధిస్తున్న జాయింట్ పెయిన్స్
పదుల సంఖ్యలో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వైనం
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
నగరంలో చికున్‌గున్యాతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తమ వద్దకు వచ్చే వారిలో చికున్‌గున్యా బాధితులు రోజుకు కనీసం ముగ్గురు ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. వారం రోజుల్లో సుమారు 30 మంది చికున్ గున్యా జ్వరాలతో వచ్చినట్టు కేజీహెచ్ ఓపీ గేటు ఎదురుగా క్లినిక్ నిర్వహించే ఒక ప్రముఖ వైద్యుడు వెల్లడించారు. కొందరు తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారన్నారు.
ఎలా సోకుతుంది..
చికున్‌గున్యా ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ వల్ల, ఆ జాతికి చెందిన మరో దోమ ద్వారా సోకుతుంది. ఇదే దోమ వల్ల డెంగ్యూ కూడా వస్తుంది. రోగుల్లో ఆకస్మిక, తీవ్రమైన జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉంటాయి. చేతులు, కాళ్లు, మణికట్టు, చీలమండ వద్ద నొప్పి అధికంగా ఉంటుంది. కొందరిలో తలనొప్పి, వికారం, వాంతులు, శరీరంపై దద్దుర్లు, నీరసం, అలసట ఉంటాయని వైద్యులు తెలిపారు. లక్షణాలను బట్టి చికిత్సను అందిస్తుంటారు. జ్వరం నాలుగు నుంచి వారం రోజులు ఉంటుంది. నొప్పులు మాత్రం కొందరికి రెండు వారాల నుంచి ఆరు నెలు వరకూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
వారం, పది రోజులుగా రోజుకు రెండు, మూడు కేసులు వస్తున్నాయి. ఎక్కువమందిలో జాయింట్ పెయిన్స్ తీవ్రంగా ఉంటున్నాయి. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. వైద్యుల సలహా మేరకు మందులు వినియోగించాలి. లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. చికున్ గున్యా బారినపడిన వారందరికీ జాయింట్ పెయిన్స్ ఉండవు. కొందరికి తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వికారం ఉంటాయి. దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- డాక్టర్ వై.జ్ఞానసుందరరాజు, జనరల్ ఫిజీషియన్