Share News

మహిళల కోసం జెండర్‌ రీసోర్స్‌ సెంటర్లు

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:55 AM

స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్యలోని మహిళల ఆర్థిక, సామాజిక, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి జెండర్‌ రీసోర్స్‌ సెంటర్లు (లింగ వనరుల కేంద్రాలు) సేవలు అందిస్తున్నాయి. జిల్లాలో 2023-24లో రావికమతం మండలంలో జీఆర్‌సీ సెంటర్‌ ఏర్పాటు చేశారు. తరువాత 2024-25లో నక్కపల్లి, కె.కోటపాడుకి కేంద్రాలు మంజూరయ్యాయి.

మహిళల కోసం జెండర్‌ రీసోర్స్‌ సెంటర్లు
నర్సీపట్నంలో జెండర్‌ రీసోర్స్‌ సెంటర్‌.

నక్కపల్లి, రావికమతంలో ఏర్పాటు

త్వరలో నర్సీపట్నంలో ఏర్పాటుకు సన్నాహాలు

జిల్లాలో మరో మూడు ఏర్పాటుకు ప్రతిపాదనలు

గ్రామ, మండల సోషల్‌ యాక్షన్‌ కమిటీలకు శిక్షణ

మండల సమాఖ్యలోని మహిళల సమస్యల పరిష్కారానికి కృషి

నర్సీపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్యలోని మహిళల ఆర్థిక, సామాజిక, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి జెండర్‌ రీసోర్స్‌ సెంటర్లు (లింగ వనరుల కేంద్రాలు) సేవలు అందిస్తున్నాయి. జిల్లాలో 2023-24లో రావికమతం మండలంలో జీఆర్‌సీ సెంటర్‌ ఏర్పాటు చేశారు. తరువాత 2024-25లో నక్కపల్లి, కె.కోటపాడుకి కేంద్రాలు మంజూరయ్యాయి. నక్కపల్లి జెండర్‌ రీసోర్స్‌ సెంటర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కె.కోటపాడులో కేంద్రం ప్రారంభం కావల్సి ఉంది. 2025-26లో నర్సీపట్నానికి జీఆర్‌సీ మంజూరైంది. త్వరలో వీటి సేవలు అందుబాటులోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో మూడు కేంద్రాలు అనకాపల్లి, రాంబిల్లి, పరవాడలో ఏర్పాటు చేయడానికి డీఆర్‌డీఏ పీడీ శశీదేవి ప్రతిపాదనలు పెట్టారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక జెండర్‌ రీసోర్స్‌ సెంటర్‌ ఉండాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.

జెండర్‌ రీసోర్స్‌ సెంటర్‌ ముఖ్య ఉద్దేశం ఇదీ..

గ్రామ, మండల సమాఖ్య సంఘాల్లోని సభ్యులతో సామాజిక కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. గ్రామ కమిటీలో ముగ్గురు, మండల కమిటీలో ఐదుగురు చొప్పున సభ్యులుగా ఉంటారు. వీరికి డీఆర్‌డీఏ తరఫున జెండర్‌ రీసోర్స్‌ సెంటర్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రతీ రోజు సమస్యలు వింటారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు జెండర్‌ రీసోర్స్‌ సెంటర్‌లో అందుబాటులో ఉంటారు. అదే విధంగా జీఆర్‌సీ కేంద్రం వద్ద ఫిర్యాదుల పెట్టె కూడా ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలు లింగ వివక్ష, లైగింక వేధింపులు, సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్టు అయితే ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు. సామాజిక కార్యచరణ కమిటీ సభ్యులు మహిళల సమస్యలు విని అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. అలాగే మహిళలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తారు. నర్సీపట్నం వెలుగు కార్యాలయం ఆవరణలో త్వరలో జెండర్‌ రీసోర్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రత్నప్రభ తెలిపారు.

Updated Date - Oct 20 , 2025 | 12:55 AM