Share News

నాణ్యమైన కాఫీ ఉత్పత్తికి జీసీసీ చేయూత

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:16 PM

గిరిజన ప్రాంతంలో నాణ్యమైన కాఫీ ఉత్పత్తికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) రైతులకు చేయూతనందిస్తున్నది. అంతర్జాతీయ ధరలు పొందాలంటే కచ్చితంగా పండ్ల సేకరణ నుంచి పార్చిమెంట్‌ తయారీ వరకు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని జీసీసీ అధికారులు సూచిస్తున్నారు.

నాణ్యమైన కాఫీ ఉత్పత్తికి జీసీసీ చేయూత
పార్చిమెంట్‌ తయారీకి అనువైన కాఫీ పండ్లు (ఫైల్‌)

శాస్త్రీయ పద్ధతులపై ఆదివాసీ రైతులకు శిక్షణ

అంతర్జాతీయ ధరలు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ

చింతపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో నాణ్యమైన కాఫీ ఉత్పత్తికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) రైతులకు చేయూతనందిస్తున్నది. అంతర్జాతీయ ధరలు పొందాలంటే కచ్చితంగా పండ్ల సేకరణ నుంచి పార్చిమెంట్‌ తయారీ వరకు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని జీసీసీ అధికారులు సూచిస్తున్నారు. నాణ్యమైన కాఫీ ఉత్పత్తికి రైతులు తీసుకోవాల్సిన మెలకువలపై గ్రామస్థాయిలో జీసీసీ ఉద్యోగులు రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మార్కెట్‌లో పార్చిమెంట్‌ కాఫీకి గరిష్ఠ ధర లభిస్తున్నది. రైతులు కాఫీ పండ్లను సేకరించి పార్చిమెంట్‌ తయారు చేసుకుని విక్రయించుకుంటే శ్రమకు తగిన ఆదాయం పొందవచ్చు. జిల్లాలో ఆదివాసీ రైతులు పండిస్తున్న కాఫీ రుచులు ఖండాతరాలకు విస్తరించినా గింజల సేకరణ, ప్రాసెసింగ్‌లో మెలకువలు పాటించకపోవడం వలన అధిక ఆదాయం పొందలేకపోతున్నారు.

జిల్లాలో ఆదివాసీ రైతులు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు. ఏపీఎఫ్‌డీసీ సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతోంది. ఏపీఎఫ్‌డీసీ యాజమాన్యం పండించిన కాఫీలో 90 శాతం పార్చిమెంట్‌ గాను, పది శాతం మాత్రమే చెర్రీగాను తయారు చేసుకుని గింజలను విక్రయిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 45 శాతం మంది రైతులు మాత్రమే కాఫీ గింజలను పార్చిమెంట్‌ రూపంలో తయారుచేసుకుని విక్రయిస్తుండగా, 65 శాతం మంది రైతులు చెర్రీ రూపంలో విక్రయిస్తున్నారు. గత ఏడాది జీసీసీ కిలో పార్చిమెంట్‌కి రూ.400 గరిష్ఠ ధరను అందించింది. చెర్రీ కిలో రూ.250, ఆర్గానిక్‌ చెర్రీ కిలో రూ.330 ధర అందించింది. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది గరిష్ఠ ధరలు అందించేందుకు జీసీసీ సన్నద్ధమవుతున్నది. కాగా గిరిజన రైతులు కాఫీ గింజలను పార్చిమెంట్‌గా తయారుచేసుకోకుండా చెర్రీ రూపంలో విక్రయించడం వలన 50 శాతం ధరను నష్టపోవాల్సి వస్తుంది. దీంతో జీసీసీ పార్చిమెంట్‌ తయారీపై రైతులను ప్రోత్సహిస్తున్నది.

పండ్లు సేకరించే కాలం

నవంబరు మొదటి వారం నుంచి మార్చి నెలాఖరు వరకు రైతులు కాఫీ పండ్లను సేకరించుకోవాలి. మొక్కలో బాగా పండిన కాఫీ పండ్లను సేకరించుకుని ఎప్పటికప్పుడు బేబీ పల్పర్‌ ద్వారా పార్చిమెంట్‌ను తయారుచేసుకోవాలి. పండ్లు సేకరించిన ఆరు గంటలలోపు పార్చిమెంట్‌ చేసుకోవాలి.

సేకరణలో పాటించాల్సిన నియమాలు

గిరిజన రైతులు కాఫీ పండ్ల సేకరణలో ప్రత్యేక మెలకువలు పాటించాలి. మొక్కల్లో ఉన్న కాఫీ గింజల గుత్తుల్లో పండిన(ఎరుపురంగు) పండ్లను మాత్రమే సేకరించాలి. పండిన పండ్లు, దోరగింజలు, కాయలు కలిపి కోసుకోరాదు. రైతులు పండ్లను సేకరించి మంచి బస్తాల్లో నింపుకోవాలి. పండ్లను మట్టిలో వేయరాదు. డ్రైయింగ్‌ యార్డు(సిమెంట్‌గాని, చెక్కతోగాని నిర్మించిన)లో గింజలను పెట్టుకోవాలి. పండ్లను విడతలవారీగా సేకరించుకుని ఆఖరిలో(ఫిబ్రవరి, మార్చి) మొక్కలో మిగిలిన ఐదు, పది శాతం గింజలను మాత్రమే చెర్రీగా తయారుచేసుకునేందుకు సిద్ధం చేసుకోవాలి.

పార్చిమెంట్‌ తయారీ

కాఫీ గింజలను పార్చిమెంట్‌గా తయారు చేసుకుని విక్రయిస్తే గరిష్ఠ ధర లభిస్తుంది. మొక్కల నుంచి సేకరించిన కాఫీ పండ్లను బేబీ పల్పర్ల సహాయంతో తొక్కను తొలగించుకోవాలి. పల్పింగ్‌ చేసుకున్న కాఫీ పప్పును మంచినీళ్లతో శుభ్రం చేసుకుని మట్టి, ఇసుక అంటుకోకుండా సిమెంట్‌తో నిర్మించుకున్న యార్డుల్లో గింజలను ఎండబెట్టుకోవాలి. రాత్రివేళ కాఫీ పప్పుపై మంచు పడకుండా టార్పాలిన్లు కప్పుకోవాలి. నాలుగైదు రోజులు ఎండబెట్టుకున్న కాఫీ పప్పును గాలితగిలే శుభ్రమైన గోనెసంచుల్లో నింపుకోవాలి. గోనెసంచులను చెక్కలపైనగాని, సిమెంట్‌తో నిర్మించుకున్న గోదాములలో భద్రపరుచుకోవాలి. పార్చిమెంట్‌ తేమ శాతం 10.5 మించి ఉండరాదు.

చెర్రీ తయారీ..

కాఫీ తోటల నుంచి ఆఖరిగా సేకరించిన గింజలను చెర్రీ తయారీకి ఉపయోగించుకోవడం చాలా మంచిది. తోటల్లో ఆఖరిగా సేకరించిన పండ్లు, కాయలను సిమెంట్‌తో నిర్మించుకున్న యార్డుల్లో ఎండబెట్టుకోవాలి. సుమారు 13-15 రోజులు ఎండబెట్టుకోవాలి. పండ్లు, కాయలు సమానంగా ఎండేలా చూసుకోవాలి. రాత్రివేళ మంచు కాఫీ గింజలపై పడకుండా టార్పాలిన్లు కప్పుకోవాలి. బాగా ఎండిన కాయలు గుప్పిట్లోకి తీసుకుని ఊపితే గలగలా శబ్ధం వచ్చేటట్లు ఎండబెట్టుకోవాలి. చెర్రీ తేమశాతం 10.5 శాతానికి మించి ఉండరాదు.

Updated Date - Oct 22 , 2025 | 11:16 PM