కొత్తగాజువాకలో గ్యాస్ లీక్
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:35 AM
కొత్తగాజువాక జంక్షన్‌లోని ఓ దుకాణంలో ఆదివారం గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి.
రేగిన మంటలు... ముగ్గురికి గాయాలు
పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్‌కు గ్యాస్ నింపుతుండగా ప్రమాదం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
కేసు నమోదు చేసిన పోలీసులు, సివిల్ సప్లై అధికారులు
గాజువాక, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):
కొత్తగాజువాక జంక్షన్‌లోని ఓ దుకాణంలో ఆదివారం గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో దుకాణం నిర్వాహకుడు మొల్లేటి కృష్ణారావు (56), నీలాపు లక్ష్మి (43), నీలాపు శిరీష (9)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపుచేయడంతో భారీప్రమాదం తప్పగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తగాజువాక జంక్షన్‌లో మొల్లేటి కృష్ణారావు గ్యాస్ స్టవ్ రిపేరింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. దీంతో పాటు పెద్ద సిలిండర్ల నుంచి అక్రమంగా చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ను నింపి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో స్థానికురాలు నీలాపు లక్ష్మి చిన్న సిలిండర్‌లోకి గ్యాస్‌ను నింపించుకునేందుకు తన మనవరాలు శిరీషతో కలిసి ఆదివారం దుకాణం వద్దకు వచ్చింది. సిలిండర్‌లోకి నింపుతుండగా ఒక్కసారిగా గ్యాస్‌లీకై మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న మగ్గురికి గాయాలయ్యాయి. సిలిండర్‌లోకి గ్యాస్ నింపుతున్న సమయంలో శిరీష లైటర్ వెలిగించడంతోనే ప్రమాదం జరిగిందని నిర్వాహకుడు కృష్ణారావు చెబుతుండగా, కృష్ణారావు టెస్టింగ్ కోసం లైటర్ వెలిగించడమే కారణమని లక్ష్మి చెబుతోంది. అయితే ఆ సమయంలో అక్కడ మరోవ్యక్తి ఉన్నాడని, అతడు పరారవడంతో అసలు విషయం తెలియలేదని పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే పూర్తివిషయాలు వెలుగుచూస్తాయని ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి బాధ్యులపై గాజువాక శాంతి భద్రతల విభాగం పోలీసులతో పాటు పౌరసరఫరాల విభాగం అధికారులు వేర్వేరుగా కేసులు నమోదుచేశారు.