Share News

మొక్కుబడిగా చెత్త సేకరణ!

ABN , Publish Date - Oct 17 , 2025 | 01:16 AM

జీవీఎంసీ పరిధిలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) వాహనాల పనితీరు నానాటికీ తీసికట్టుగా మారింది.

మొక్కుబడిగా చెత్త సేకరణ!

క్లాప్‌ వాహనాల ఇష్టారాజ్యం

కాంట్రాక్టర్‌ జీతాలు చెల్లించడం లేదంటూ తరచూ విధులు బహిష్కరిస్తున్న డ్రైవర్లు

మిగిలిన రోజుల్లో మూడు ట్రిప్పులు తిరగాల్సి ఉండగా ఒకటి, రెండింటితో సరి

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

వాహనాలు రాకపోవడంతో చెత్తను రోడ్లపై పడేస్తున్న ప్రజలు

నగరంలో దిగజారుతున్న పారిశుధ్యం

ఎంఎస్‌ఎఫ్‌ల్లో కాకిలెక్కలతో అధికారుల కళ్లకు గంతలు

ప్రతినెలా క్లాప్‌ వాహనాల కాంట్రాక్టర్‌కు రూ.3.9 కోట్లు చెల్లింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ పరిధిలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) వాహనాల పనితీరు నానాటికీ తీసికట్టుగా మారింది. వాహనాల డ్రైవర్లకు కాంట్రాక్టర్‌ సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో వారంతా తరచూ విధులు బహిష్కరిస్తున్నారు. దానివల్ల ఆరోజు చెత్తసేకరణ నిలిచిపోతోంది. మిగిలిన రోజుల్లో కూడా అధికారుల పర్యవేక్షణ లోపించడంతో చెత్తసేకరణ తూతూమంత్రంగా జరుగుతోంది. దీంతో ప్రజలు తమ ఇళ్లలో చెత్తను రోడ్లపక్కన, గెడ్డల్లోనూ పడేస్తున్నారు.

జీవీఎంసీ పరిధిలో గల 610 క్లాప్‌ వాహనాలు ఆదివారం మినహా ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలి. ఇందుకోసం ప్రతి వెయ్యి ఇళ్లకు ఒక వాహనాన్ని కేటాయించారు. ఒక్కో వాహనం మూడు ట్రిప్పుల్లో తమకు కేటాయించిన ప్రాంతంలోని ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి సమీపంలోని ఎంఎస్‌ఎఫ్‌కు తరలించాలి. కానీ ప్రస్తుతం నగరంలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్లాప్‌ వాహనాల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దాంతో క్లాప్‌ వాహనాలు మూడు ట్రిప్పులకు బదులు ఒకటి, రెండు ట్రిప్పులతోనే సరిపెట్టేస్తున్నాయి. క్లాప్‌ వాహనాలపై పర్యవేక్షణ బాధ్యతను వార్డు సచివాలయంలోని శానిటేషన్‌ కార్యదర్శులకు జీవీఎంసీ అధికారులు అప్పగించినా వారు అందుకు అంగీకరించడం లేదు. తమ జాబ్‌చార్ట్‌లో క్లాప్‌ వాహనాల పర్యవేక్షణ లేనందున ఆ బాధ్యతలను తీసుకోబోమని తెగేసి చెబుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయం చూడకుండా శానిటేషన్‌ సెక్రటరీలే ఆ బాధ్యత చూడాలంటూ పట్టుబడుతున్నారు. దీనివల్ల క్లాప్‌ వాహనాలపై పర్యవేక్షణ గాలికి వదిలేసినట్టయింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వాహనాల కాంట్రాక్టర్‌ను, డ్రైవర్లను అడిగేవారు లేకుండాపోయారు. ఒక్కో ట్రిప్పులో కనీసం 700 కిలోలు చెత్త ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ 250-300 కిలోలతో కూడా ఎంఎస్‌ఎఫ్‌లకు వాహనాలు వెళుతున్నాయి. ప్రతి వాహనానికి గతంలో జీపీఎస్‌ను అమర్చారు. దీనివల్ల ఆ వాహనం ఏ ప్రాంతంలో తిరిగింది, ఏ సమయంలో ఎంఎస్‌ఎఫ్‌కు వెళ్లింది...అనే వివరాలను అధికారులు జీపీఎస్‌తోపాటు ఎంఎస్‌ఎఫ్‌ల వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ద్వారా గుర్తించేవారు. కానీ ఇప్పుడు వాహనాల జీపీఎస్‌, ఎంఎస్‌ఎఫ్‌ల వద్ద ఏర్పాటుచేసిన సీసీకె మెరాలు కూడా పనిచేయడం మానేశాయి. దీంతో క్లాప్‌ వాహనాలు ఎన్ని ట్రిప్పులు తిరిగాయి, ఎంత బరువు చెత్తను తీసుకువెళ్లాయనే సమాచారం కోసం ఎంఎస్‌ఎఫ్‌ల వద్ద ఏర్పాటుచేసిన సిబ్బంది చేతిలోని రికార్డుల్లో నమోదుచేసే వివరాలే ఆధారం అవుతున్నాయి. క్లాప్‌ వాహనాల కాంట్రాక్టర్‌, డ్రైవర్లు ఆయా పాయింట్లలోని సిబ్బందిని మచ్చికచేసుకుని తమకు అనుకూలంగా వివరాలు నమోదుచేయించుకుంటున్నారు. వారిచ్చిన వివరాలు ఆధారంగా ప్రతినెలా బిల్లు కోసం జీవీఎంసీకి ఫైల్‌ పెడుతున్నారు.

కాంట్రాక్టర్‌కు డబ్బు.... నగరవాసులకు తిప్పలు

ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరించాల్సిన క్లాప్‌ వాహనాలు వారంలో మూడు, నాలుగు రోజులు మాత్రమే వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను నిల్వ ఉంచుకోలేక రోడ్లపైన, సమీపంలోని గెడ్డల్లోనూ పడేస్తున్నారు. దీనివల్ల పారిశుధ్య సమస్య తలెత్తుతోంది. గెడ్డల్లో చెత్తకారణంగా మురుగునీటి ప్రవాహం నిలిచిపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. మరోవైపు రోడ్డుపక్కన పడేస్తున్న చెత్తను పశువులు, కుక్కలు చిందరవందర చేస్తున్నాయి.

చెత్త సేకరణ సక్రమంగా జరగనప్పటికీ కాంట్రాక్టర్‌కు మాత్రం జీవీఎంసీ ప్రతి నెలా రూ.3.9 కోట్లు బిల్లు చెల్లించాల్సిక తప్పని పరిస్థితి ఉంటోంది. అధికారులు కూడా క్లాప్‌ వాహనాలు ఎన్నిరోజులు పనిచేయలేదు, ఎన్ని ట్రిప్పులు తిరిగాయనే లెక్కలు వేయకుండా కాంట్రాక్టర్‌కు డబ్బు చెల్లించేస్తున్నారు. గతంతో పోల్చితే ఇటీవల కాలంలో నగరంలో పారిశుధ్యం దిగజారింది. ఈ విషయం గుర్తించే కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఇటీవల క్లాప్‌ వాహనాల పనితీరుపై దృష్టిసారించారని అధికారులు చెబుతున్నారు. వార్డు శానిటేషన్‌ సెక్రటరీలు ప్రతిరోజూ ఏదో ఒక క్లాప్‌ వాహనం వెనుక తిరిగి ఇంటింటికీ చెత్తసేకరణ జరిగేలా చూడాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు. అలాగే ప్రజలు చెత్తను క్లాప్‌ వాహనాలకు మాత్రమే ఇవ్వాలని, రోడ్లపై, గెడ్డల్లో పడేస్తే జరిమానా విధించాలని, ఒకవేళ వాహనాలు ఇళ్లకు వెళ్లకపోతే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

----------------------------

జీవీఎంసీ పరిధిలో క్లాప్‌ వాహనాలు సుమారు 610

ఈ-ఆటోలు 65

ఒక వాహనం రోజుకు తిరగాల్సిన ట్రిప్పులు 3

ఒక ట్రిప్పులో తీసుకువెళ్లాల్సిన చెత్త 700 కిలోలు

ఒక్కో వాహనానికి జీవీఎంసీ చెల్లించే మొత్తం రూ.64 వేలు

వాహనాల కాంట్రాక్టర్‌కు ఒక నెలకు మొత్తం రూ.3.9 కోట్లు

----------------------------

Updated Date - Oct 17 , 2025 | 01:16 AM