Share News

దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:04 AM

దొంగనోట్ల ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కీలక నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి దొంగనోట్ల ప్రింట్‌లు, ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌తోపాటు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు

మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అరెస్టు

దొంగనోట్ల తయారీకి వాడే పరికరాలు, యంత్రాలు స్వాధీనం

మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

దొంగనోట్ల ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కీలక నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి దొంగనోట్ల ప్రింట్‌లు, ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌తోపాటు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మేరీప్రశాంతి వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా సెంద్వా తాలుకా కెర్మలా గ్రామానికి చెందిన శ్రీరామ్‌ అలియాస్‌ గుప్తా (60)ను దొంగనోట్ల తయారీ కేసులో ఉజ్జయిని ఎస్టీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గంగాధర్‌ అనే వ్యక్తి ద్వారా విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌ 11లో నివాసం ఉంటున్న పాల వరప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. వీరంతా అనంతపురంలో కలిసినప్పుడు దొంగనోట్ల తయారీ గురించి ప్రస్తావన వచ్చింది. విశాఖలోని తన ఇంట్లో దొంగనోట్లు తయారుచేసుకోవచ్చునని వరప్రసాద్‌ సమ్మతి తెలిపాడు. దీంతో కొన్నాళ్ల కిందట శ్రీరామ్‌ దొంగనోట్ల తయారీకి అవసరమైన ప్రింటర్‌, తెల్లపేపర్లు, కటింగ్‌ యంత్రాలు, గమ్‌, రంగులు వంటి వాటిని ముంబై తెప్పించి వరప్రసాద్‌ ఇంట్లో పెట్టాడు. మొదటి దశలో రూ.పది లక్షలు విలువైన రూ.500, రూ.200 నకిలీ నోట్లను తయారుచేసి, నగరానికి చెందిన ఆనంద్‌ అనే వ్యక్తి ద్వారా చలామణి చేసేందుకు విఫలయత్నం చేశారు. మళ్లీ రూ.500, రూ.200 నకిలీనోట్ల తయారీని ఇటీవల ప్రారంభించాడు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం రావడంతో ఎంవీపీ పోలీసులతో కలిసి బుధవారం రాత్రి వరప్రసాద్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో దొంగనోట్లు తయారుచేస్తూ శ్రీరామ్‌ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి ల్యాప్‌ట్యాప్‌, ప్రింటర్‌తోపాటు ఒకే పేపర్‌పై నాలుగు చొప్పున రూ.500, రూ.200 నకిలీనోట్లు ప్రింట్‌ చేసిన కాగితాలతోపాటు పేపర్‌ కటింగ్‌ గ్లాస్‌ టేబుల్‌, తెల్ల పేపర్‌కట్టలు రెండు, నకిలీనోట్ల సాఫ్ట్‌ కాపీలు కలిగిన పెన్‌ డ్రైవ్‌, గమ్‌ బాటిల్‌, గ్రీన్‌ థ్రెడ్‌ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఈ సమావేశంలో ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఎంవీపీ సీఐ కేఎన్‌ఎస్‌వీ ప్రసాద్‌, టాస్క్‌ఫోర్స్‌ సీఐ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.


దఫదఫాలుగా వర్షం

పద్మనాభంలో 28.5 మి.మీ. నమోదు

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావంతో నగరం, పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి దఫదఫాలుగా వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం రాత్రి దక్షిణ కోస్తాలో తీరం దాటి కర్ణాటక వైపు పయనించిన అల్పపీడనం దిశగా సముద్రం నుంచి భారీగా తేమగాలులు వీస్తున్నాయి. దీంతో గురువారం ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. పద్మనాభంలో 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, కంచరపాలెం, రైల్వేన్యూకాలనీ, సీతమ్మధార ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. శుక్రవారం నుంచి వచ్చే ఐదారు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Oct 24 , 2025 | 01:04 AM