బైక్ డిక్కీల్లో సొత్తును చోరీ చేస్తున్న గ్యాంగ్ అరెస్టు
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:08 PM
ద్విచక్ర వాహనాల డిక్కీలో ఉంచిన నగదుతో పాటు విలువైన సొత్తును చోరీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌ను గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ సీఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నిందితులందరూ ఉత్తరప్రదేశ్ వారే..
రూ.6,28,500 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం
గాజువాక క్రైమ్ సీఐ కె.శ్రీనివాసరావు
గాజువాక, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాల డిక్కీలో ఉంచిన నగదుతో పాటు విలువైన సొత్తును చోరీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌ను గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ సీఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 14న డేగల లలిత అనే యువతి షీలానగర్‌లోని ఓ డిజిటల్ సెంటర్ వద్ద టెట్ రాసేందుకు వచ్చింది. ఆ సమయంలో ఆమె తన ద్విచక్ర వాహనం డిక్కీలో బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, డెబిట్ కార్డు, రూ.రెండు వేలను ఉంచి తాళం వేసి పరీక్షకు హాజరైంది. తిరిగి వచ్చి చూసేసరికి డిక్కీ తెరిచి ఉండడం, అందులో ఉంచిన వస్తువులు, నగదు కనిపించకపోవడంతో గాజువాక క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సీపీ ఆదేశాల మేరకు క్రైమ్ డీసీపీ కె.లతామాధురి, ఏడీసీపీ మోహన్‌రావుల పర్యవేక్షణలో ఏసీపీ డి.లక్ష్మణరావు, సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎ.మన్మథరావులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రిన్స్‌కుమార్ (28), క్రిషన్ (22), ధర్మేంద్రకుమార్ (31), మరో మైనర్ కలిసి ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వీరు సెల్‌ఫోన్ సిమ్ కార్డులను వినియోగించి బ్యాంక్ ఓటీపీల ద్వారా నగదు కాజేస్తున్నట్టు గుర్తించారు. ఇటీవల కాలంలో ఈ గ్యాంగ్ గాజువాక, పెందుర్తి, ఆరిలోవ, ఎయిర్‌పోర్టు, పెనమలూరు (కృష్ణ జిల్లా) పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడిందని సీఐ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.6,28,500 నగదుతో పాటు రెండు సెల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.