Share News

విద్యార్థుల జీవితాలతో ఆటలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 01:05 AM

తమ వద్ద నుంచి బయటకు వెళ్లే విద్యార్థుల వివరాలను వెల్లడించే విషయంలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మొండిగా వ్యహరిస్తున్నాయి.

విద్యార్థుల జీవితాలతో ఆటలు

  • ప్రైవేటు స్కూళ్ల అరాచకం

  • యూడైస్‌ వివరాలు వెల్లడిలో జాప్యం

  • జిల్లాలో 14,000 మందికి ఇప్పటికీ హాజరు వేయలేని పరిస్థితి

  • తల్లికి వందనం పథకం వర్తింపునకు గండం

  • తల్లిదండ్రుల ఆందోళన

  • ఎంఈవోల ఆదేశాలు పట్టించుకోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు

విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):

తమ వద్ద నుంచి బయటకు వెళ్లే విద్యార్థుల వివరాలను వెల్లడించే విషయంలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మొండిగా వ్యహరిస్తున్నాయి. మండల విద్యాశాఖాధికారుల ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థుల వివరాలను గోప్యంగా ఉంచడంతో వారంతా తల్లికి వందనం పథకానికి అర్హత కోల్పోయే ఉన్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభంలో యూడైస్‌ పోర్టల్‌లో ప్రతి విద్యార్థి వివరాలను నమోదుచేస్తారు. ఒకవేళ పాఠశాల మారినట్టయితే సదరు విద్యా సంస్థకు చెందిన యూడైస్‌ ఖాతా నుంచి సదరు విద్యార్థి పేరు తొలగించాలి. అలా తొలగించిన విద్యార్థి వివరాలను ‘డ్రాప్‌ బాక్స్‌’లో వేయాలి. విద్యార్థి ప్రవేశం పొందిన పాఠశాల యాజమాన్యం ఆ డ్రాప్‌ బాక్స్‌ నుంచి వివరాలు తీసుకుని తమ యూడైస్‌ ఖాతాలో నమోదుచేయాలి. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్లే విద్యార్థి వివరాలు డ్రాప్‌ బాక్సు నుంచి తీసుకుని యూడైస్‌ ఖాతాలో నమోదుచేసిన తరువాతే సదరు పాఠశాలలో హాజరువేస్తారు. అంత వరకూ విద్యార్థి హాజరు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేరు. అయితే, దీనిని చాలా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉల్లంఘిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు సుమారు 14 వేల మంది విద్యార్థుల వివరాలు యూడైస్‌ ఖాతా నుంచి డ్రాప్‌ బాక్సుకు చేరలేదు. దీంతో వారంతా హాజరు కోల్పోతున్నారు. అత్యధికంగా గాజువాక మండలంలో 2,500 మంది, సీతమ్మధారలో 2,050 మంది, చినగదిలిలో 1,980, గోపాలపట్నంలో 1,850, మిగిలిన మండలాల్లో 1,000 మందికి అటుఇటుగా విద్యార్థుల హాజరు నమోదుకావడం లేదు. మొత్తం 14 వేలలో 12 వేల వివరాలు ప్రైవేటు పాఠశాలల యూడైస్‌ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం దీనిపై విద్యా శాఖలో తీవ్ర చర్చ నడుస్తోంది.

ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లింపు కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకువస్తుంటాయి. దీంతో అప్పటివరకు చదివిన పాఠశాల నుంచి సమీపంలో మరో ప్రైవేటు లేదా ప్రభుత్వ పాఠశాలలో చేరతారు. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. అయితే విద్యాహక్కు చట్టం వరకు 14 ఏళ్ల వరకు ఒక విద్యార్థి పాఠశాలలో చేరడానికి టీసీ అవసరం లేదు. టీసీ కోసం యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదు. ఈ నేపథ్యంలో జిల్లాలో అనేకమంది ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో మారుతున్నారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు యాజమాన్యాలు టీసీలు ఇవ్వడం లేదు సరికదా యూడైస్‌ ఖాతా నుంచి వారి పేరు తొలగించి డ్రాప్‌ బాక్స్‌లో వేయడం లేదు. దీంతో జిల్లాలో 14 వేల మంది విద్యార్థుల వివరాలపై గందరగోళం నెలకొంది. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళుతున్నా హాజరు వేయడం లేదు. దీనిపై మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలో ప్రైవేటు యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చినా ఎక్కువమంది పట్టించుకోవడం లేదు. పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు హాజరు వేయకపోవడంతో తల్లికి వందనం పథకం వర్తించదని ఉపాధ్యాయులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Jul 06 , 2025 | 01:05 AM