గ్రేటర్‌తో గేమ్స్
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:53 AM
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ నిర్మించిన స్పోర్ట్స్ ఎరీనా కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకున్న సంస్థ డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు.
ఏడాదిగా అద్దె చెల్లించని ‘స్పోర్ట్స్ ఎరీనా’ కాంట్రాక్టర్
బకాయి రూ.1.2 కోట్లు
నోటీసులు ఇచ్చినా పట్టించుకోని నిర్వాహకులు
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.25 కోట్లతో నిర్మించిన జీవీఎంసీ
మూడు నెలలకు రూ.28 లక్షల చొప్పున అద్దె చెల్లించేలా ప్రైవేటు సంస్థకు అప్పగింత
నిర్వాహకులకు లబ్ధి కలిగించేలా అప్పట్లో అధికారుల నిర్ణయం
తక్షణం స్వాధీనం చేసుకోవాలని కార్పొరేటర్లు డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ నిర్మించిన స్పోర్ట్స్ ఎరీనా కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకున్న సంస్థ డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు. అధికారులు నోటీసులు జారీచేసినా నిర్వాహకుడు పట్టించుకోవడం లేదు. దీంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకుని జీవీఎంసీయే నిర్వహించాలని కొందరు కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.
నగరంలోని పిల్లలకు ప్రపంచస్థాయి సదుపాయాలతో క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేయాలనే లక్ష్యంతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా మైదానానికి ఆనుకుని ఉన్న వీఎంఆర్‌డీఏకు చెందిన స్థలంలో 2018లో రూ.25 కోట్ల వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మాణం ప్రారంభించారు. భవనం సెల్లార్‌లో పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆరు బ్యాడ్మింటన్ కోర్టులు, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులతోపాటు క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించారు. మొదటి అంతస్థులో రెండు స్విమ్మింగ్‌పూల్స్, చెస్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలకు సంబంధించిన కోర్టులను ఏర్పాటుచేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనం లోపల క్రీడాకారులు సమావేశం కావడానికి, దుస్తులు మార్చుకోవడానికి మహిళలు, పురుషులకు వేర్వేరుగా గదులను నిర్మించారు. భవన నిర్మాణం పూర్తయ్యేసరికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో స్పోర్ట్స్ ఎరీనాను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించేసి, అప్పట్లో జీవీఎంసీలో పనిచేసిన ఒక అధికారికి అస్మదీయుడైన వ్యక్తికి అద్దెకు కేటాయించేలా చక్రంతిప్పారు. రూ.25 కోట్లు వెచ్చించి నిర్మించిన అత్యాధునిక సదుపాయాలు కలిగిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఎస్3 అనే సంస్థకు మూడు నెలలకు రూ.28 లక్షలు చొప్పున అద్దెకు కేటాయించేసింది. అద్దెకు తీసుకున్న సంస్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రత్యేకతలను ప్రచారం చేసుకుని, క్రీడల్లో శిక్షణ పొందేవారి నుంచి నగరంలో ఎక్కడా లేనంత ఫీజులు వసూలుచేయడం ప్రారంభించింది. అక్కడ శిక్షణ పొందేవారు క్రీడాంశాలను బట్టి నెలకు రూ.2,500 నుంచి రూ.ఎనిమిది వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ఫీజులు నిర్ణయించడంతో నగరంలోని సామాన్య, మధ్య తరగతికి చెందిన కుటుంబాల పిల్లలు అటువైపు చూసేందుకు కూడా సాహసించలేని పరిస్థితి ఏర్పడింది.
రూ.1.2 కోట్లు అద్దె బకాయి
మూడు నెలలకు రూ.28 లక్షలు అద్దె చెల్లించాల్సిన నిర్వాహకులు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శిక్షణ పొందుతున్న వారి నుంచి ముక్కుపిండి భారీగా ఫీజులు వసూలుచేస్తున్న సంస్థ...జీవీఎంసీకి అద్దె చెల్లించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకూ జీవీఎంసీకి రూ.1.2 కోట్లకుపైగా అద్దె బకాయి ఉన్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం అధికారుల వద్ద ప్రస్తావిస్తే తాము నోటీసులు ఇస్తున్నాసరే నిర్వాహకుల నుంచి స్పందన ఉండడం లేదని, గట్టిగా మాట్లాడితే ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని పెద్దలతో తమకు ఫోన్ చేయించి పరోక్షంగా బెదిరిస్తున్నారని చెబుతున్నారు. స్పోర్ట్స్ ఎరీనా నుంచి రూ.1.2 కోట్లకుపైగా బకాయి ఉండడంతో కొందరు కార్పొరేటర్లు ఇటీవల జీవీఎంసీ కమిషనర్‌ను కలిసి దీనిపై చర్చించినట్టు తెలిసింది. తక్షణం స్పోర్ట్స్ ఎరీనా కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకుని, జీవీఎంసీయే నిర్వహించాలని కోరినట్టు సమాచారం. ప్రైవేటు సంస్థ భారీగా ఫీజులు వసూలు చేయడంపై కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేయగా, తానే స్వయంగా నిర్వాహకులను పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కమిషనర్ హామీ ఇచ్చినట్టు తెలిసింది.