Share News

నిధులు మింగేశారు.. నిర్మాణాలు వదిలేశారు

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:01 PM

మండల కేంద్రంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయ నూతన భవనం అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 95 శాతం నిధులను డ్రా చేసుకున్న కాంట్రాక్టర్‌ పనులను మాత్రం పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం కూడా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

నిధులు మింగేశారు.. నిర్మాణాలు వదిలేశారు
పిచ్చి మొక్కల మధ్య అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్న ఐసీడీఎస్‌ నూతన భవనం

నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయ నూతన భవనం

కాంట్రాక్టర్‌ 95 శాతం నిధులు డ్రా చేసుకున్న వైనం

ఎటువంటి చర్యలు తీసుకోని గత వైసీపీ ప్రభుత్వం

పరాయి పంచన పాడుబడిన షెడ్డులో ఉద్యోగుల విధులు

వర్షమొస్తే అవస్థలు

పట్టించుకోని ఉన్నతాధికారులు

గూడెంకొత్తవీధి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయ నూతన భవనం అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 95 శాతం నిధులను డ్రా చేసుకున్న కాంట్రాక్టర్‌ పనులను మాత్రం పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం కూడా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఐసీడీఎస్‌ ప్రాజెక్టుకి సొంతగూడు కలగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఐసీడీఎస్‌ ఉద్యోగులు శిథిలావస్థలో ఉన్న పాత రెవెన్యూ కార్యాలయం షెడ్డులోనే విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.

చింతపల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న జీకేవీధి మండలాన్ని 2013లో విడదీసి నూతన ఐసీడీఎస్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీకేవీధి ఐసీడీఎస్‌ నూతన ప్రాజెక్టుకి కొత్త భవనం అందుబాటులో లేకపోవడంతో అప్పట్లో రెవెన్యూ కార్యాలయాల సముదాయంలో పాడుబడిన రేకుల షెడ్డును కేటాయించారు. ఐసీడీఎస్‌ అధికారులు భవనం పైకప్పును బాగుచేసుకుని, గోడలకు రంగులు వేసుకుని కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. 2018లో జీకేవీధి ఐసీడీఎస్‌ కార్యాలయ నూతన భవనం నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.53 లక్షల నిధులను మంజూరు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం భవనం నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించింది. నిర్మాణ బాధ్యతలను టెండర్‌ ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్‌ తొమ్మిది నెలల్లో పూర్తిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ ఐసీడీఎస్‌ కార్యాలయ నూతన భవనాన్ని శ్లాబ్‌ వరకు నిర్మించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.53 లక్షల నిధుల్లో దాదాపు 95 శాతం నిధులు సంబంధిత కాంట్రాక్టర్‌ డ్రా చేసుకున్నారు. అయితే నాలుగేళ్ల క్రితం భవన నిర్మాణ పనులను నిలిపివేశారు. అప్పటి నుంచి ఈ భవన నిర్మాణ పనులు పునఃప్రారంభం కాలేదు.

కార్యాలయానికి సొంతగూడు కలేనా..

నాలుగేళ్ల క్రితం ఐసీడీఎస్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌ నిలిపి వేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 95 శాతం నిధులు డ్రా చేసుకున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. స్థానికులు, ఐసీడీఎస్‌ ఉద్యోగులు ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని అర్జీలు పెట్టుకున్నా గత ప్రభుత్వం స్పందించలేదు. దీంతో జీకేవీధి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుకి సొంతగూడు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పాత భవనం పైకప్పు నుంచి వర్షపునీరు లోపలికి వస్తుండడంతో ఐసీడీఎస్‌ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. భవనం చిన్నది కావడంతో సూపర్‌వైజర్లు రికార్డులు భద్రపరుచుకునేందుకు అవస్థలు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన సరుకులను ప్రాజెక్టు కార్యాలయంలో భద్రపరచడానికి సిబ్బంది యాతన పడుతున్నారు.

ఇప్పటికీ అదే పరిస్థితి

గూడెంకొత్తవీధి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయ నూతన భవనాన్ని పూర్తి చేయడంలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సదరు కాంట్రాక్టర్‌ 95 శాతం నిధులను డ్రా చేసుకుని పనులను అర్ధాంతరంగా నిలిపివేసినా అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదు. మండల కేంద్రాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు నాలుగేళ్లుగా ఈ అసంపూర్తి భవనాన్ని చూస్తున్నారే తప్ప ఎందు వలన నిర్మాణ పనులు నిలిచిపోయాయని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా అసంపూర్తి భవనాన్ని పూర్తి చేసేందుకు కలెక్టర్‌, ఐటీడీఏ పీవో చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 11:01 PM