నర్సీపట్నానికి నిధులు వరద
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:38 AM
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవతో మునిసిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు వీఎంఆర్‌డీఏ రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కల్వర్టుల నిర్మాణంతోపాటు స్కేటింగ్ రింక్ ప్రహరీ గోడ మరమ్మతులు, షెడ్డు నిర్మాణం, బలిఘట్టం సత్యనారాయణస్వామి ఆలయం వద్ద అసంపూర్తిగా వున్న కల్యాణ మండపం పనులను పూర్తిచేస్తారు.
స్పీకర్ అయ్యన్న చొరవతో రూ.5 కోట్లు మంజూరు చేసిన వీఎంఆర్‌డీఏ
పలు వార్డుల్లో రోడ్లు, కాలువలు, కల్వర్టుల నిర్మాణం
అందుబాటులోకి రానున్న కల్యాణ మండపం
నర్సీపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవతో మునిసిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు వీఎంఆర్‌డీఏ రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కల్వర్టుల నిర్మాణంతోపాటు స్కేటింగ్ రింక్ ప్రహరీ గోడ మరమ్మతులు, షెడ్డు నిర్మాణం, బలిఘట్టం సత్యనారాయణస్వామి ఆలయం వద్ద అసంపూర్తిగా వున్న కల్యాణ మండపం పనులను పూర్తిచేస్తారు.
మునిసిపాలిటీలోని పలు వార్డుల్లో మట్టి రోడ్లు, కచ్చా డ్రైనేజీల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలో బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, అయ్యన్న కాలనీ, బ్యాంక్ కాలనీ, కొత్తవీధి, శివపురం ప్రాంతాలతో పాటు పెదబొడ్డేపల్లి, బలిఘట్టంలో రోడ్లు, కాలువలు అభివృద్ధి చేయాల్సి ఉంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచన మేరకు వీఎంఆర్‌డీఏ అధికారులు రూ.5 కోట్లు మంజూరు చేశారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు ప్రతిపాదించి నిధులు కేటాయించారు. 2వ వార్డులో ఆరు పనులకు రూ.53.3 లక్షలు, 3వ వార్డులో 8 పనులకు 48.9 లక్షలు, 7వ వార్డులో 3 పనులకు రూ.12.5 లక్షలు, 9వ వార్డులో 5 పనులకు రూ.34 లక్షలు, 10వ వార్డులో 3 పనులకు రూ.30 లక్షలు, 11వ వార్డులో 5 పనులకు రూ.53 లక్షలు, 12వ వార్డులో 2 పనులకు రూ.10 లక్షలు, 15వ వార్డులో రూ.12 లక్షలు, 16వ వార్డులో 12 పనులకు రూ.80 లక్షలు, 20వ వార్డులో ఒక పనికి రూ.75 లక్షలు, 27వ వార్డులో నాలుగు పనులకు రూ.27 లక్షలు, 28వ వార్డులో 13 పనులకు రూ.50.75 లక్షలు మంజూరు చేశారు. అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. అగ్రిమెంట్ పూర్తయిన తరువాత పనులు మొదలుపెడతారు. మునిసిపాలిటీలో ఒకేసారి సుమారు రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.