నిధులు కుమ్మరింత!
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:39 AM
నగరంలో జరగబోయే పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు (సీఐఐ) పేరుతో నిధుల కుమ్మరింతకు జీవీఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు.
సీఐఐ సదస్సు పేరుతో రూ.40 కోట్లతో నగర సుందరీకరణ పనులకు జీవీఎంసీ ప్రతిపాదనలు
నేడు స్టాండింగ్ కమిటీ సమావేశం
అజెండా కాపీలను సకాలంలో పంపకపోవడంపై మేయర్, అధికారులపై పలువురు కార్పొరేటర్ల అసంతృప్తి
విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
నగరంలో జరగబోయే పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు (సీఐఐ) పేరుతో నిధుల కుమ్మరింతకు జీవీఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో నగరం వేదికగా సీఐఐ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలోని రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, మరమ్మతులు, సెంటర్ మీడియన్లు, డివైడర్లకు రంగులు వేయడం, పచ్చదనం అభివృద్ధి, రహదారులపై మార్కింగ్‌లు, స్టడ్స్ ఏర్పాటు, ప్రధాన రోడ్లపై కొత్తగా బీటీ లేయర్ల నిర్మాణం, వీధి దీపాలకు మరమ్మతులు, కొత్తగా హైమాస్ట్ ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, డి వైడర్లు, ఫుట్‌పాత్‌లపై కెర్బ్‌వాల్స్ పెయింటింగ్, జాతీయ రహదారిపై ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి ఆర్‌అండ్‌బీ కూడలి వరకు ఉన్న ఐరన్ తీగల ఫెన్సింగ్ పాడైపోవడంతో కొత్తగా ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం సుమారు రూ.40 కోట్ల వరకు వెచ్చించేందు ప్రతిపాదనలను తయారుచేశారు.
సీఐఐ సదస్సు బీచ్ రోడ్డులోని ఏపీఐఐసీ మైదానంలో నిర్వహించాలని అధికారులు భావిస్తుండగా, ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌ఏడీ జంక్షన్ మీదుగా తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం జంక్షన్, ఆలిండియా రేడియో డౌన్ మీదుగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు, గ్రీన్ బెల్ట్ రిపేర్లు, సుందరీకరణ, గ్రీనరీ డెవలప్‌మెంట్, లైటింగ్ రిపేర్లకు పనులు ప్రతిపాదించిన అధికారులు... ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి సింహాచలం, అడవివరం, హనుమంతవాక మీదుగా విశాలక్షినగర్ వైపు రోడ్లకు మరమ్మతులు, మార్జిన్ పెయింటింగ్‌లు, స్టడ్స్ ఏర్పాటు, ఫుట్‌పాత్‌ల రిపేర్లు, పెయింటింగ్‌లు, గ్రిల్స్‌కు రంగులు వేయాలని ప్రతిపాదించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే హనుమంతవాక జంక్షన్ నుంచి వెంకోజీపాలెం పెట్రోల్ బంక్, ఎంవీపీలోని కరాచీ బేకరీ మీదుగా సమతా కాలేజీ రోడ్డును కొత్తగా బీటీ వేయడంతోపాటు రిపేర్లు, రోడ్డు మార్కింగ్, స్టడ్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. కరాచీ బేకరీ జంక్షన్ నుంచి ఎంవీపీ డబుల్ రోడ్డు, రైతు బజార్ సర్కిల్ మీదుగా అప్పూఘర్ వరకు కొత్త రోడ్లు, పెయింటింగ్‌లు, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు, రంగులు వేయాలని ప్రతిపాదించారు. అదేవిధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి సీతకొండ వరకు బీచ్ రోడ్డులో సుందరీకరణ, రోడ్డు మార్జిన్ పెయింటింగ్‌లు, ఫుట్‌పాత్‌లు, గ్రిల్స్ పెయింటింగ్ పనులను ప్రతిపాదించారు. నగరంలోని వీఐపీ రోడ్డు, సిరిపురం జంక్షన్, బీచ్ రోడ్డు, పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ ఆలయం మీదుగా కురుపాం సర్కిల్ వరకు రోడ్డు అద్భుతంగా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం రిపేర్లు, పెయింటింగ్‌లు, కొత్త బీటీ లేయర్లు పేరుతో ప్రతిపాదనలు రూపొందించడం విస్మయానికి గురిచేస్తోంది. సీఐఐ సదస్సు పేరుతో అవసరం లేని పనులకు కూడా ప్రతిపాదనలు తయారుచేసి, కాంట్రాక్టర్లతో తూతూమంత్రంగా పనులు చేయించి అధికారులు నిధులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కొందరు కార్పొరేటర్లు విమర్శలు గుప్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
నేడు స్టాండింగ్ కమిటీ సమావేశం
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నట్టు కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకునేందుకు 91 అంశాలతో అజెండాను తయారుచేసి సభ్యులకు ఆదివారం అందజేశారు. అజెండాలో ప్రధానంగా నగరంలో నవంబరు 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ సదస్సు కోసం నగర సుందరీకరణ, అభివృద్ధికి సంబంధించిన పనులే ఎక్కువగా ఉన్నాయి. ఇవికాకుండా 67, 93, 96 వార్డుల పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలు, నగరంలో పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తున్న తాత్కాలిక కార్మికులకు జీతాల చెల్లింపులు, గాజువాక జోన్‌లోని వివిధ వార్డులో పేరుకుపోయిన చెత్తను అక్కడి డంపింగ్ యార్డుకు తరలించేందుకు వీలుగా అద్దె వాహనాలు, డ్రైవరన్లు సమకూర్చుకోవడం, ముడసర్లోవలోని ఎంఎస్‌ఎఫ్-3లో అద్దెప్రాతిదికన సమకూర్చుకున్న వాహనాలకు ముగ్గురు డ్రైవర్లను ఆరు నెలలకు నియమించుకోవడం వంటి అంశాలు ఉన్నాయి. స్టాండింగ్ కమిటీ సమావే శం ఏర్పాటు చేస్తున్నట్టు సభ్యులకు జీవీఎంసీ కార్యదర్శి కార్యాలయం నుంచి శనివారం రాత్రి సమాచారం అందడం, ఆదివారం సాయంత్రానికి అజెండా కాపీలను పంపించడం వివాదానికి దారితీసింది. స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కనీసం మాటమాత్రంగానైనా తమకు చెప్పకపోవడం, ఆదివారం ఉదయానికి కూడా తమకు అజెండా కాపీలు అందకపోవడంతో పలువురు కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం జీవీఎంసీ కార్యాలయంలోని ఫ్లోర్ లీడర్ చాంబర్‌లో సమావేశయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌తోపాటు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. సోమవారం జరిగే సమావేశంలో అజెండాలోని అంశాలను క్షుణ్ణంగా చదివిన తరువాత, సంబంధిత అధికారుల వివరణ సంతృప్తిగా అనిపిస్తేనే ఆయా అంశాలను ఆమోదించాలని, లేని పక్షంలో వాయిదా కోరాలని తీర్మానించినట్టు సమాచారం. దీంతో సోమవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంపై అధికారుల్లో చర్చకు దారితీసింది.