Share News

విలువిద్యకు సంపూర్ణ ప్రోత్సాహం

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:42 PM

గిరిజన సంప్రదాయ విలువిద్యకు సంపూర్ణంగా ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు.

విలువిద్యకు సంపూర్ణ ప్రోత్సాహం
విలువిద్య పోటీలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, గిడ్డి ఈశ్వరి, తదితరులు

జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

పాడేరులో రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీలు ప్రారంభం

13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 572 మంది క్రీడాకారులు హాజరు

పాడేరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంప్రదాయ విలువిద్యకు సంపూర్ణంగా ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. 69వ స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన అంతర జిల్లాల విలువిద్య పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువిద్య క్రీడాకారులను ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ రాణిస్తారన్నారు. ప్రభుత్వ పరంగా వారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. గెలుపోటములు కంటే క్రీడా స్ఫూర్తి ప్రధానమన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతిలో విలువిద్య ఒక భాగమన్నారు. గిరిజనులు స్వతహాగానే విలువిద్యలో రాణిస్తారన్నారు. వారికి మేలకువలపై తర్ఫీదు ఇస్తే చక్కగా రాణిస్తారన్నారు. అంతకుముందు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించి, క్రీడాకారుల నుంచి గౌరవ వందన స్వీకరించి, విలువిద్య పోటీలను ప్రారంభించారు.

మూడు రోజుల పోటీలకు 572 మంది హాజరు

జిల్లా కేంద్రంలో శుక్రవారం నుంచి మూడు రోజులు నిర్వహించే రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీల్లో 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 572 మంది క్రీడాకారులు హాజరువుతున్నారని సూల్క్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శులు పాంగి సూరిబాబు, భవాని తెలిపారు. అనంతపురం జిల్లా నుంచి 54 మంది, చిత్తూరు 32, తూర్పుగోదావరి 70, పశ్చిమగోదావరి 57, కృష్ణా 28, నెల్లూరు 43, కడప 61, కర్నూలు 70, విజయనగరం 67, శ్రీకాకుళం 53, విశాఖపట్నం 16, ప్రకాశం జిల్లా నుంచి 21 మంది విలు విద్య క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, డీఈవో పి.బ్రహ్మజీరావు, రాష్ట్ర పరిశీలకుడు నారాయణరావు, డీఎస్‌డీవో జగన్మోహనరావు, ఏపీ అర్చరీ అసోసియేషన్‌ చైర్మన్‌ సీహెచ్‌.సత్యనారాయణ, కార్యదర్శి రమణ, టెక్నికల్‌ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, ఎంపీపీ రత్నకుమారి, కోచ్‌, మేనేజర్లు, వ్యాయామ సంచాలకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:42 PM