నేటి నుంచి పాఠశాలలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 01:15 AM
వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొదటి రోజునే సర్వేపల్లి రాధాకృష్ణన్ స్టూడెంట్ కిట్లు (బూట్లు మినహా మిగిలినవి) పంపిణీ చేయనున్నారు. ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫామ్‌కు అవసరమైన క్లాత్, ఒకటి, ఆరో తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు డిక్షనరీలు, బెల్టు అందజేస్తారు.
తొలిరోజునే స్టూడెంట్ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు
సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం
విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి
విశాఖపట్నం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి):
వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొదటి రోజునే సర్వేపల్లి రాధాకృష్ణన్ స్టూడెంట్ కిట్లు (బూట్లు మినహా మిగిలినవి) పంపిణీ చేయనున్నారు. ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫామ్‌కు అవసరమైన క్లాత్, ఒకటి, ఆరో తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు డిక్షనరీలు, బెల్టు అందజేస్తారు.
గత విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకూ 72 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు సన్నబియ్యం సరఫరా చేసింది. గతంలో ముతక బియ్యం 50 కిలోలు వంతున పంపిణీ చేసేవారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం పథకం పేరుతో ముద్రించిన 25 కిలోల బస్తాలు పంపిణీ చేశారు. ఏళ్ల తరబడి ముతకబియ్యం సరఫరాతో రమారమి 30 శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి పాఠశాలలో భోజనం చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. సన్న బియ్యం దుర్వినియోగం కాకుండా ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ ముద్రించారు.
ఇక గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 117 రద్దు చేసిన కూటమి ప్రభుత్వం పాఠశాలలను పునర్వ్యవస్థీకరించింది. ఫౌండేషన్ నుంచి హైస్కూల్ ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలల వరకూ పలు కేటగిరీలుగా విభజించింది. విశాఖ జిల్లాలో 41 ఫౌండేషన్, 232 బేసిక్, 178 మోడల్ ప్రాథమిక పాఠశాలలు, 21 యూపీ, 76 ఉన్నత పాఠశాలలు, 10 ఉన్నత పాఠశాలలు ప్లస్ బేసిక్, ఐదు ఉన్నత పాఠశాలలు ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు మొత్తం563 ఉంటాయి.
కాగా గత ప్రభుత్వం అమలుచేసిన నాడు-నేడు పథకం (ప్రస్తుతం మన బడి-మన భవిష్యత్తు) కింద చేపట్టిన నిర్మాణాలు కొంతవరకూ అసంపూర్తిగా ఉన్నాయి. సుమారు రూ.23 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అవి విడుదలైతే 460 గదులు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు. ఇదిలావుండగా టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌తో జిల్లాలో చాలా పాఠశాలల టీచర్లు బదిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్తగా టీచర్లు రానున్నారు. వీరి ఆధ్వర్యంలో పాఠశాలల్లో విద్యార్థులు చేరికకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనున్నారు.
పాఠశాలలు సిద్ధం
ఎన్.ప్రేమ్‌కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి
పునఃప్రారంభానికి పాఠశాలలను సిద్ధం చేశాం. మూడు, నాలుగు రోజుల నుంచి ఉన్నత పాఠశాలల్లో వసతులపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. గురువారం నుంచి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించనున్నాము. పిల్లలకు కిట్లు పంపిణీ చేస్తాం. పిల్లల చేరికలు పెంచుకునేలా ప్రణాళిక రూపొందించి అమలుచేస్తాం. గురువారం నుంచి ప్రతి విద్యార్థి పాఠశాలలకు వచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.