Share News

గోశాల టు కబేళా!

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:57 AM

గోవుల రవాణా, వధకు అడ్డుకట్ట వేయడంపై దృష్టిసారించిన పోలీస్‌ అధికారులు గోశాలల నిర్వహణలో అక్రమాలపై దృష్టిసారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గోశాల టు కబేళా!

అక్రమంగా తరలిస్తున్న ఆవులను గోశాలలకు అప్పగిస్తున్న పోలీసులు

అక్కడి వారితో కబేళా నిర్వాహకుల మిలాఖత్‌

రైతులకు ఇచ్చినట్టు రాసుకుని అప్పగిస్తున్న వైనం

నగరంలో యథేచ్ఛగా గోవధ

నిష్ఫలమవుతున్న పోలీసు చర్యలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గోవుల రవాణా, వధకు అడ్డుకట్ట వేయడంపై దృష్టిసారించిన పోలీస్‌ అధికారులు గోశాలల నిర్వహణలో అక్రమాలపై దృష్టిసారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గోవులను రవాణా చేస్తున్న వాహనాలను సీజ్‌ చేసి, గోవులను గోశాలలకు అప్పగిస్తున్నా, అక్కడి నిర్వాహకులు తిరిగి వాటిని కబేళాలు నడిపే వారికే విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దేశంలో గోవధ నిషేధం. కబేళాల్లో ఆవులను సంహరిస్తే కేసులు పెట్టి అరెస్టు చేయాలి. అక్రమంగా గోవులను తరలించడం కూడా నేరమే. అయినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా నగరంలో గోవధ జరుగుతోంది. యథేచ్ఛగా గోమాంసం విక్రయాలు సాగిపోతున్నాయి. నగర ప్రజలకు మేక, గొర్రెమాంసం అందుబాటులో ఉంచేందుకు మారికవలస వద్ద కబేళాను ఏర్పాటుచేశారు. దీనికి అన్ని శాఖల అనుమతులున్నాయి. అయితే అక్కడ కూడా గోవధ చేయకూడదు. కానీ రైల్వేన్యూకాలనీ, వన్‌టౌన్‌ రెల్లివీధి, గాజువాక, ఆరిలోవ తదితర ప్రాంతాల్లో జీవీఎంసీ ట్రేడ్‌ లైసెన్స్‌ల ముసుగులో అనధికారిక కబేళాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగే వారపుసంతల నుంచి గోవులను కొనుగోలు చేసి వాహనంలో పదుల సంఖ్యలో ఆవులు, లేగదూడలను నగరంలోని అనధికార కబేళాలకు తరలిస్తున్నారు. వాటిని వధించి మాంసాన్ని స్థానికంగా విక్రయదారులకు, హోటళ్లకు, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గోవధపై హిందూ పరిరక్షణ సంఘాలు, బీజేపీ అనుబంధ సంఘాలు ఉద్యమిస్తుండడంతో గోవుల రవాణాపై పోలీసులు దృష్టిసారించారు. కబేళాలకు గోవులను తరలిస్తున్న వాహనాలను పట్టుకుని, డ్రైవర్లు, వ్యాపారులపై కేసులు నమోదుచేస్తున్నారు. ఆయా వాహనాల్లోని ఆవులను సమీప గోశాలలకు అప్పగిస్తున్నారు.

పక్క జిల్లాకు తరలింపు

జిల్లాలో అధికారిక గోశాలలు లేవు. దాంతో ఇక్కడ పట్టుకున్న గోవులను విజయనగరం జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడి గోశాలల నిర్వాహకులకు పశులను అప్పగించిన తర్వాత అకనాలెడ్జ్‌మెంట్‌ తీసుకుని రికార్డుల్లో ఎన్నిఆవులు, దూడలను అప్పగించారో నమోదుచేయాలి. నిరుపేదలు, పాడి పెంపకంపై ఉత్సాహం చూపేవారికి అక్కడి నిర్వాహకులు వాటిని ఉచితంగా అందజేయాలి. ఆ సమయంలో వారి ఆధార్‌కార్డు జెరాక్స్‌, చిరునామా, ఫోన్‌ నంబరు రికార్డుల్లో నమోదుచేయాలి.

అక్రమంగా కబేళాకు

ఇలా గోశాలలకు చేరిన ఆవులు తిరిగి అడ్డదారుల్లో కబేళాకు తరలిపోతున్నాయి. కబేళా నిర్వాహకులు గోశాలలను నిర్వహించే వారితో ఇప్పటికే మిలాఖత్‌ అయిపోయారు. వారికి డబ్బు ఆశచూపించి, పశుపోషణకు ముందుకు వచ్చిన రైతులకు అప్పగించినట్టుగా రికార్డుల్లో రాయించి, వాహనాలపై కబేళాకు తరలిస్తున్నారు. ఇందుకోసం నకిలీ ఆధార్‌కార్డు నంబర్లు, ఇతర పత్రాలు సమర్పిస్తున్నట్టు సమాచారం. ఈ అక్రమానికి గోశాలల నిర్వాహకులు పూర్తిగా సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు చర్యలు నిష్ఫలమవుతున్నాయి.

ఎవరిది బాధ్యత

గోశాలల నుంచి మళ్లీ కబేళాలకే ఆవులు తరలిపోతున్న సమాచారం పోలీసుల వద్ద ఉన్నప్పటికీ, వారు పట్టించుకోవడం లేదు. అప్పగించిన ఆవులు ఎలా ఉన్నాయి?, ఎవరికైనా ఉచితంగా పోషణకు అందజేశారా, వారి వద్ద ఆవులున్నాయా?...లాంటి తనిఖీలు చేపట్టడం లేదు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే ఆ పని పశుసంవర్ధకశాఖ అధికారులదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నగరంలో ఏయే పోలీస్‌ స్టేషన్లలో గోవుల అక్రమ రవాణాపై ఎన్ని కేసులు నమోదుచేశారు?, పట్టుకున్న ఆవులను ఏ గోశాలకు అప్పగించారు?, అక్కడ వాటి పరిస్థితి ఏమిటనే దానిపై సీపీ శంఖబ్రతబాగ్చి ఆరా తీస్తే గోవధ నెట్‌వర్క్‌ బయటపడుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 12:57 AM