Share News

ఆడబిడలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:34 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

ఆడబిడలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

  • నేటి సాయంత్రం అనకాపల్లిలో ప్రారంభించనున్న మంత్రి అనిత

  • అనకాపల్లి, నర్సీపట్నం డిపోల్లో 204 బస్సులు

  • ఉచితం నుంచి ఘాట్‌ సర్వీసులకు మినహాయింపు

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన ఈ పథకానికి ‘స్త్రీశక్తి’గా ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఐదు రకాల బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే మహిళలు తమ వెంట ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. బస్సు కండక్టర్‌కు కార్డు చూపితే ‘జీరో ఫేర్‌’ టికెట్‌ ఇస్తారు. అనకాపల్లి డిపోలో 98 బస్సులు ఉన్నాయని, వీటిలో అంతర్రాష్ట్ర సర్వీసు ఒకటి, ఘాట్‌ సర్వీసులు రెండు (జోలాపుట్టు) మినహా మిగిలిన 95 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని డీపీటీవో వి.ప్రవీణ తెలిపారు. సంస్థకు చెందిన బస్సులతోపాటు అద్దె బస్సులను కూడా సిద్ధం చేశామని ఆమె తెలిపారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనంగా బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఆమె తెలిపారు.

నర్సీపట్నం డిపోలో మొత్తం 102 బస్సులు వున్నాయి. వీటిలో ఆలా్ట్ర డీలక్స్‌ బస్సులు 20 వున్నాయి. వీటిల్లో 17 బస్సులు విశాఖపట్నం నాన్‌ స్టాప్‌, మిగిలిన మూడు విజయవాడ,హైదరాబాద్‌, కాకినాడలకు నడుస్తున్నాయి. మిగిలిన 82 సర్వీసుల్లో 18 బస్సులు ఘాట్‌ రోడ్లలో ప్రయాణిస్తున్నాయి. వీటిని మినహాయించి మిగిలిన 64 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.


ఘాట్‌ సర్వీసులకు ఉచితం వర్తించదు

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ ఎండీ

నర్సీపట్నం డిపో పరిధిలో 18 ఘాట్‌ సర్వీసులు

నర్సీపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఘాట్‌ మార్గాల్లో నడిచే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం వర్తించదు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిప్రకారం నర్సీపట్నం డిపో నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే 18 ఘాట్‌ సర్వీసుల్లో మహిళలు యథావిధిగా టికెట్‌ తీసుకుని ప్రయాణించాల్సిందే. ఘాట్‌ మార్గాల్లో నడిచే బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కితే ప్రమాదమన్న ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నర్సీపట్నం నుంచి చింతపల్లికి టు స్టాప్‌ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు 6, నర్సీపట్నం నుంచి సీలేరుకు ఆలా్ట్ర పల్లె వెలుగు సర్వీసులు 2, మొండిగెడ్డ, నర్సీపట్నం నుంచి రాజమహేంద్రవరం (వయా కృష్ణాదేవిపేట), దేవరాపల్లి, గుమ్మిరేవుల, మారేడుమిల్లి, మంప, గుడ్లపల్లి, రేవళ్లు, రంపుల పల్లె వెలుగు సర్వీసులను ఉచిత ప్రయాణం నుంచి మినహాయించారు. ఈ బస్సుల్లో ‘జీరో టికెట్‌’ జారీ చేయరు.

Updated Date - Aug 15 , 2025 | 01:34 AM