విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా ట్రై మోటార్ సైకిళ్లు
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:09 AM
జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ట్రై మోటార్ సైకిళ్లు పంపిణీ చేయనుంది.
జిల్లాకు 60 మంజూరు చేసిన ప్రభుత్వం
అత్యధికంగా భీమిలి నుంచి 24 మంది దరఖాస్తులు
విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ట్రై మోటార్ సైకిళ్లు పంపిణీ చేయనుంది. ఆరు నియోజకవర్గాలకు పది చొప్పున ట్రై మోటార్ సైకిళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసింది. ఇందుకోసం 85 మంది దరఖాస్తు చేసుకున్నట్టు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. ట్రై మోటారు సైకిళ్లను ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలోనే కొనుగోలు చేసి జిల్లాలకు పంపుతుంది. వాటిని ప్రజా ప్రతినిధుల చేతులు మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే...అత్యధికంగా భీమిలి నుంచి 24 మంది, తూర్పు నియోజకవర్గం నుంచి 15 మంది, గాజువాక నుంచి 14 మంది, పశ్చిమ నియోజకవర్గం నుంచి 12 మంది, దక్షిణ నియోజకవర్గం నుంచి 11 మంది, ఉత్తర నియోజకవర్గం నుంచి నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
వీరికి మాత్రమే పంపిణీ..
ఇప్పటివరకూ ఏ పథకం ద్వారా ట్రైసైకిల్ పొందని 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న, ఉపాధి కలిగిన లేదా ఉద్యోగం చేస్తున్న, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విభిన్న ప్రతిభావంతులు మాత్రమే ఈ ట్రైసైకిళ్లు పొందేందుకు అర్హులుగా అధికారులు చెబుతున్నారు. అలాగే, 70 శాతానికిపైగా వైకల్యంతో బాధపడుతున్న వారై ఉండాలి. వార్షిక ఆదాయం రూ.మూడు లక్షలలోపు ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సొంత వాహనం కలిగి ఉండరాదు. అటువంటి వారి నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరించినట్టు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కవిత తెలిపారు.