Share News

తెరపైకి ఫ్రీ హోల్డ్‌

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:32 AM

గడువుదాటిన డీపట్టా భూములకు స్వేచ్ఛ కల్పించేందుకు ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగిపోయాయి.

తెరపైకి  ఫ్రీ హోల్డ్‌

  • వైసీపీ హయాంలో 609 ఎకరాలకు అనుమతి

  • 126 ఎకరాలకు పూర్తైన రిజిస్ట్రేషన్లు

  • మరో మూడు వేల ఎకరాలకు దరఖాస్తులు పెండింగ్‌

  • ఏడాదిగా కొనసాగుతున్న ఆంక్షలు

  • గ్రామీణ ప్రాంతాల్లోని భూములకే అవకాశం

విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

గడువుదాటిన డీపట్టా భూములకు స్వేచ్ఛ కల్పించేందుకు ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. ఏడాదిగా ఫ్రీహోల్డ్‌భూముల వ్యవహారం పూర్తిగా నిలిపివేసిన ప్రభుత్వం, తాజాగా అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్‌కు అర్హత కలిగిన భూములకు మోక్షం లభించనున్నది.

భూమిలేని నిరుపేదలకు సుమారు 50 ఏళ్ల క్రితం అప్పటి పాలకలు డీపట్టాలు ఇచ్చారు. రైతులు ఈ భూముల్లో వ్యవసాయం లేదా తోటలు పెంచుకుని జీవించాలి. వారసత్వంగా కుటుంబసభ్యులు సాగుచేసుకోవచ్చు. క్రయవిక్రయాలకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నగరానికి ఆనుకుని వందలాది డీపట్టా భూములు అమ్మకాలు జరిగినా అధికారికంగా ఎవరికీ హక్కులు దఖలుపడలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దలు, వారి అనుయాయులు ఈ డీపట్టా భూములపై కన్నేశారు. డీపట్టా ఇచ్చిన 20 ఏళ్ల తరువాత భూములపై రైతులకు సర్వహక్కులు కల్పించేలా ఫ్రీహోల్డ్‌ చేయాలని నిర్ణయించి, 2023 జీవో జారీచేశారు. అయితే జీవో వెలువడక ముందే వైసీపీ నేతలు, అధికారులు, రియల్టర్లు నగరం చుట్టూ వందలాది ఎకరాల డీపట్టా భూములను కొనుగోలుచేసి అనధికార ఒప్పందాలు చేసుకున్నారు. వీరిలో ఉన్నతస్థాయిలో పనిచేసి రిటైరైన ఓ అధికారి, అతని అనుచరులు త్రిలోక్‌, సుభాష్‌, గతంలో వైసీపీలో ఉండి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న నేత, మరికొందరు వైసీపీ నేతలు, వ్యాపారులు ఉన్నారు.

మూడువేల ఎకరాలకు దరఖాస్తులు

ఫ్రీహోల్డ్‌పై ప్రభుత్వం జీవో జారీ చేయడంతో జిల్లాలో సుమారు మూడువేల ఎకరాలకు రైతులు దరఖాస్తుచేశారు. వాస్తవంగా ఆనందపురం, పెందుర్తి, భీమిలి, పద్మనాభం, గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం మండలాల్లో ఆరువేల డీపట్టా భూములను పేదలకు ఇళ్ల కోసం సమీకరించారు. మిగిలిన మూడువేల ఎకరాలకు 2023లో దరఖాస్తులు వచ్చాయి. వీటిని అప్పటి జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొన్నింటిని తిరస్కరించి, తొలివిడతలో 609 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు జారీచేశారు. వాటిలో ఆనందపురం, భీమిలి, పెందుర్తి, పద్మనాభం మండలాల్లోని 126 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు చేపట్టారు. అయితే ఈ భూములపై దుమారం రేగడంతో 2024 మార్చి తరువాత ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్ల జారీ నిలిపివేశారు. అప్పట్లో కీలక అధికారిగా పనిచేసిన వ్యక్తి కోసం అతని అనుచరులు త్రిలోక్‌, సుభాష్‌ ఆనందపురం మండలం గండిగుండం, రామవరం, భీమన్నదొరపాలెం, మామిడిపాలెం, పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం, భీమిలి మండలం అన్నవరం, పరిసర గ్రామాలు, పద్మనాభం మండలంలో కొన్ని గ్రామాల్లో భూములకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల వైసీపీ నేతలు రైతులను బెదిరించారనే విమర్శలున్నాయి. గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్రీహోల్డ్‌పై ఆంక్షలు విధించింది. ఏడాది తరువాత వాటిని తొలగించాలని నిర్ణయించంతో మరోసారి ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్ల జారీ ఊపందుకోనున్నది.

గ్రామీణ మండలాల్లోనే...

జిల్లాలోని పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతం ఉంది. పెందుర్తి, భీమిలిలో కొంతభాగం జీవీఎంసీ పరిధిలో ఉన్నది. వైసీపీ హయాంలో కూడా గ్రామీణ ప్రాంతంలోని డీపట్టా భూములకే ఫ్రీహోల్డ్‌ అనుమతులు ఇచ్చారు. జీవీఎంసీ పరిధిలో భీమిలి, పెందుర్తి, విశాఖ రూరల్‌, గోపాలపట్నం, గాజువాక, పెదగంట్యాడ మండలాల్లో ఉన్న డీపట్టా భూములకు ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం ఫ్రీ హోల్డ్‌కు అనుమతిచ్చిన నేపథ్యంలో గతంలో అనుసరించిన విధానాన్ని కొనసాగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఆనందపురం, పద్మనాభం మండల కేంద్రాల్లోనూ ఫ్రీహోల్డ్‌ అనుమతులు ఇవ్వకూడదని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Jul 07 , 2025 | 12:32 AM