Share News

ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:00 AM

పాఠశాలల విద్యార్థులకే కాకుండా జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నది. కళాశాలలు పునఃప్రారంభం కావడానికి ఇంకా నెల రోజులకుపైగా సమయం వున్నప్పటికీ ఏప్రిల్‌లోనే పుస్తకాలను పంపిణీ చేయాలని విద్యా శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్‌పుస్తకాలను కూడా అందజేస్తున్నారు.

ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు
అనకాపల్లిలో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు పుస్తకాలు అందిస్తున్న అధికారులు

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న వారికి మాత్రమే

పాఠ్య పుస్తకాలతోపాటు నోట్‌ బుక్స్‌ కూడా..

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

పాఠశాలల విద్యార్థులకే కాకుండా జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నది. కళాశాలలు పునఃప్రారంభం కావడానికి ఇంకా నెల రోజులకుపైగా సమయం వున్నప్పటికీ ఏప్రిల్‌లోనే పుస్తకాలను పంపిణీ చేయాలని విద్యా శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్‌పుస్తకాలను కూడా అందజేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేసింది. అదే విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండు ఉచితాలకు మంగళం పాడింది. దీంతో విద్యార్థులు సొంత సొమ్ముతో పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి, కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు అందజేయాలని నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చేనాటికే కళాశాలలు ప్రారంభం కావడం, పాఠ్యపుస్తకాలను ముద్రించి పంపిణీ చేయడానికి తగిన సమయం లేకపోవడంతో ఈ ఏడాది నుంచి పాఠ్యపుస్తకాలు అందజేయనున్నట్టు ప్రకటించింది. మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభించారు. ఇప్పుడు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. తొలుత ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సెకండియర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. తరువాత ఇతర ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని విద్యాసంస్థల్లో చదువుతున్న బాలబాలికలకు అందజేస్తారు. కాగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు అందజేయడానికి 1,24,884 నోటు పుస్తకాలు జిల్లాకు చేరాయి. ఒక్కో విద్యార్థికి 12 నోట్‌పుస్తకాలు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం సెకండియర్‌ విద్యార్థులకు నోట్‌బుక్స్‌ అందిస్తున్నారు. ఫస్టియర్‌ అడ్మిషన్లు పూర్తయిన తరువాత ఆ విద్యార్థులకు కూడా నోట్‌పుస్తకాలు పంపిణీ చేస్తారు.

Updated Date - Apr 30 , 2025 | 01:00 AM