Share News

తూకంలో మోసం

ABN , Publish Date - May 12 , 2025 | 12:34 AM

వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న వారు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. ఎలకా్ట్రనిక్‌ తూనిక యంత్రాలను ట్యాంపరింగ్‌ చేయించి, వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. వాస్తవ బరువుకన్నా పది శాతం తక్కువ వచ్చేలా కాటాలో సర్దుబాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల రిమోట్‌ కంట్రోల్‌తో కాటాలను ఆపరేట్‌చేస్తూ తూకంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులు తనిఖీలు చేస్తే తప్ప ఇటువంటి మోసాలు బయటపడడంలేదు.

తూకంలో మోసం
మాసం దుకాణంలో లీటర్‌ మోడ్‌లో ఉన్న ఎలకా్ట్రనిక్‌ తూనిక యంత్రం మీద 5 కిలోల రాయి పెట్టగా 5.510 కిలోలు బరువు చూపిస్తున్న దృశ్యం

ఎలకా్ట్రనిక్‌ కాటాల్లోనూ వినియోగదారులకు బురిడీ

లీటర్‌ (ఎల్‌) మోడ్‌లో పెట్టి కిలో బరువుగా తూకం

కిలోకు 90 గ్రాములు నష్టపోతున్న కొనుగోలుదారులు

మాసం, చేపల దుకాణాలలో అధికంగా మోసాలు

లీగల్‌ మెట్రాలజీ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలు

నర్సీపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి): వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న వారు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. ఎలకా్ట్రనిక్‌ తూనిక యంత్రాలను ట్యాంపరింగ్‌ చేయించి, వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. వాస్తవ బరువుకన్నా పది శాతం తక్కువ వచ్చేలా కాటాలో సర్దుబాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల రిమోట్‌ కంట్రోల్‌తో కాటాలను ఆపరేట్‌చేస్తూ తూకంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులు తనిఖీలు చేస్తే తప్ప ఇటువంటి మోసాలు బయటపడడంలేదు.

గతంలో త్రాసు కాటాలు వుండేవి. కొంతమంది వ్యాపారులు త్రాసు గొలుసుల్లో కొన్ని లింకులను తప్పించడం, త్రాసు కింద ఆయస్కాంతం ముక్క పెట్టడం, తూకం రాళ్లను అరగదీయడం వంటి పనుల ద్వారా వస్తువుల తూకం తగ్గేలా మోసాలకు పాల్పడేవారు. తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడేవి. సంబంధిత వ్యాపారికి జరిమానా విధించి వదిలేశారు. త్రాసు కాటాల స్థానంలో ఎలక్ర్టానిక్‌ కాటాలు అందుబాటులోకి వచ్చాయి. వస్తువు ఎంత బరువు వుందో డిస్‌ప్లేలో కనిపిస్తుండడంతో తూకం కచ్చితంగా వుంటుందని వినియోగదారులు భావించారు. కానీ కాదేదీ మోసానికి అనర్హం అన్నట్టుగా.. ఎలక్ర్టానిక్‌ కాటాల్లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, చికెన్‌ దుకాణాల్లో తూకంలో మోసాలు అధికంగా జరుగుతున్నట్టు తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖల్లో బయటపడుతున్నది. వాస్తవ బరువుకన్నా పది శాతం ఎక్కువ చూసేలా కాటా మెకానిజంలో మార్పులు చేస్తున్నట్టు గుర్తించారు. ఉదాహరణకు కిలో సరకును కాటా వేస్తే.. ఎలక్ర్టానిక్‌ డిస్‌ప్లేలో 1,100 గ్రాములు చూపిస్తుంది. ఈ లెక్కన కిలో సరకు కొంటే.. వినియోగదారులకు 900 గ్రాములే వస్తుంది.

మోసం ఎలా జరుగుతుందంటే...

దుకాణదారుడు ఎలకా్ట్రనిక్‌ కాటాలో లీటర్‌ మోడ్‌(ఎల్‌)లో తూకం వేసి ఇస్తాడు. కొనుగోలుదారులు తూనిక యంత్రం డిస్‌ప్లే మీద బరువు చూసుకుని డబ్బులు ఇస్తుంటారు. వ్యాపారి లీటర్‌ మోడ్‌లో తూకం వేసి, కిలోల బరువు కింద కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. ఒక లీటరుకి 910 గ్రాములు వస్తుంది. కిలోకి 1,000 గ్రాములు. లీటర్‌ మోడ్‌లో తూకం వేసి ఇవ్వడం వల్ల కొనుగోలుదారుడు 90 గ్రాములు నష్ట పోతున్నాడు. మరికొందరు వ్యాపారులు కిలోకు 100 నుంచి 150 గ్రాములు తూకం తక్కువ వచ్చే విధంగా మిషన్‌లో సెట్టింగ్స్‌ మార్చుకుంటున్నట్టు లీగల్‌ మెట్రాలజీ అధికారులు గమనించారు. ఎలమంచిలిలో ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్న మాంసం దుకాణాలపై లీగల్‌ మెట్రాలజీ అధికారులు కేసులు రాశారు.

కొనుగోలుదారులు ఏం చేయాలంటే..

ఎక్ర్టానిక్‌ తూనిక యంత్రం మీద సరకులు తూకం వేసే ముందు లీటర్‌ (ఎల్‌) మోడ్‌లో ఉందేమో గమనించాలి. లీటర్‌ మోడ్‌లో ఉంటే మోడ్‌ బటన్‌ నొక్కమని వ్యాపారిని అడగాలి.

ఎలకా్ట్రనిక్‌ కాటా మీద బేసిన్‌ లేదా ట్రే పెట్టిన తర్వాత టేర్‌ బటన్‌ నొక్కి సున్నా చూపించమని అడగాలి.

ఎలకా్ట్రనిక్‌ కాటా మీద అనుమానం వస్తే... లీగల్‌ మెట్రాలజీ అధికారులు ముద్ర వేసిన తూకం రాయితో బరువు చూపించమని అడగాలి.

తూనిక యంత్రానికి లీగల్‌ మెట్రాలజీ అధికారులు ముద్ర వేసిన వైర్‌ కట్టి ఉందో లేదో చూడాలి

కేంద్ర ప్రభుత్వం (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) ఆమోదించిన ఎలకా్ట్రనిక్‌ తూనిక యంత్రాలు మాత్రమే వాడాలి. చైనా తూనిక యంత్రాల వినియోగం నిషేధం.

వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి (9ఎన్‌పీ2)

అనురాధ, లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌, నర్సీపట్నం

మాంసం, చేపల విక్రయదారులు ఎలకా్ట్రనిక్‌ తూనిక యంత్రాలతో మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించాం. ఇటీవల ఎలమంచిలిలో పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా.. కిలోకు 100 నుంచి 120 గ్రాములు తక్కువ వచ్చింది. దీంతో నాలుగు దుకాణాలపై కేసులు రాశాం. కాటాను లీటర్‌ మోడ్‌లో పెట్టి బరువు తుయ్యడం వల్ల కొనుగోలుదారులు నష్టపోతున్నారు. ఈ విషయంలో. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలక్ర్టానిక్‌ కాటా కిలో మోడల్‌లో వుందో లేదో చెక్‌ చేసుకోవాలి.

Updated Date - May 12 , 2025 | 12:35 AM