గంజాయి కేసులో నలుగురికి శిక్ష ఖరారు
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:37 AM
గంజాయి రవాణా కేసులో నలుగురు ముద్దాయిలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ గురువారం స్థానిక 9వ అదనపు జిల్లా జడ్జి హరినారాయణ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండున్నర సంవత్సరాలపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
పదేళ్లపాటు కారాగారం, రూ.లక్ష చొప్పున
చోడవరం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా కేసులో నలుగురు ముద్దాయిలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ గురువారం స్థానిక 9వ అదనపు జిల్లా జడ్జి హరినారాయణ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండున్నర సంవత్సరాలపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
చీడికాడ మండలం బైలపూడికి చెందిన జాజిమొగ్గల రమణ, దారపు మాణిక్యం, జాజిమొగ్గల నూకరాజు, కిరణంపల్లి భూలోక కలిసి 2015వ సంవత్సరం మార్చి 12వ తేదీన ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి చీడికాడ మండలం కోనాం సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ వద్ద వున్నారు. ఇక్కడి నుంచి మైదాన ప్రాంతానికి గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో అప్పటి ఎస్‌ఐ విశ్వనాథం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అక్కడకు వెళ్లారు. పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద వున్న నాలుగు మూటల్లో ప్యాకింగ్ చేసిన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు కేసు దర్యాప్తును పూర్తి చేసిన అనంతరం కోర్టులో నేరారోపణ అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ యు.వెంకటరావు వాదనలను సమర్థంగా వినిపించడంతో నిందితులు నేరానికి పాల్పడినట్టు స్థానిక అదనపు జిల్లా జడ్జి హరినారాయణ నిర్ధారణకు వచ్చారు. నలుగురు ముద్దాయిలకు పదేళ్ల చొప్పున జైలు శిక్షతోపాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు.