ఏయూ మాజీ వీసీకి జైలు శిక్ష
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:58 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఒకరికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఒకరికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం వర్సిటీలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే...బోటనీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్టు)గా పనిచేస్తున్న ఎస్‌వీవీఎస్ నూకన్నదొరను అప్పటి ఉన్నతాధికారులు ఆరోపణలు వచ్చాయంటూ విధుల నుంచి తొలగించారు. దీనిపై వర్సిటీ అధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరగినా ప్రయోజనం లేకపోవడంతో దొర హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు...దొరను ఉద్యోగంలో కొనసాగించాలని 2023లో తీర్పు ఇచ్చింది. అయితే, కోర్టు ఇచ్చిన తీర్పును వర్సిటీ అధికారులు పట్టించుకోలేదు. ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. తీర్పును అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు అప్పటి వైస్ చాన్సలర్‌ను స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో బెయిల్‌బుల్ వారెంట్‌ను ఈ ఏడాది ఆగస్టులో కోర్టు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ అందలేదన్న కారణాలను చూపించి తప్పించుకునే ప్రయత్నం చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి బాధితుడు తీసుకువెళ్లడంతో తాజాగా గురువారం జరిగిన వాదనల అనంతరం నెలరోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఇదిలావుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బాధితుడైన ఉద్యోగిని విధుల్లోకి తీసుకున్నారు.
భువనేశ్వర్-హైదరాబాద్ ప్రత్యేక రైలు కొనసాగింపు
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దువ్వాడ మీదుగా హైదరాబాద్-భువనేశ్వర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను కొనసాగిస్తామని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. 07165 నంబరు గల రైలు డిసెంబరు 2 నుంచి జనవరి 27 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.05 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అదేరోజు సాయంత్రం 5.15 గంటలకు భువనేశ్వర్ వెళుతుంది. తిరుగు ప్రయాణంలో 07166 నంబరు గల రైలు డిసెంబరు 3 నుంచి జనవరి 28 వరకు ప్రతి బుధవారం రాత్రి 11.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.35 గంటలకు దువ్వాడ చేసుకుంటుంది. అదేరోజు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ వెళుతుంది.
నలుగురు ఎస్‌ఐ బదిలీ
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): నగర పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న నలుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రతబాగ్చి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
వ.నం పేరు ప్రస్తుతం బదిలీ
1. లంబ శ్రీనివాసరావు దువ్వాడ ద్వారకా క్రైమ్
2. ఎస్.సంతోష్‌కుమార్ త్రీటౌన్ ద్వారకా
3. సిరిపురపు రాజు ద్వారకాక్రైమ్ త్రీటౌన్
4. జె.ధర్మేంధ్ర ద్వారకా దువ్వాడ