Share News

విస్తృతంగా వనాలు పెంచాలి

ABN , Publish Date - May 18 , 2025 | 12:48 AM

భూ తాపాన్ని తగ్గించేందుకు విస్తృతంగా వనాలను పెంచాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పేర్కొన్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని బాటజంగాలపాలెంలో నిర్వహించిన ‘బీట్‌ ది హీట్‌’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

విస్తృతంగా వనాలు పెంచాలి
బాటజంగాలపాలెంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టెను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

భూ తాపం తగ్గించేందుకు ఇదే ప్రత్యామ్నాయం

ప్రతి కుటుంబం ఏటా కనీసం 10 మొక్కలు నాటాలి

‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో కలెక్టర్‌ విజయకృష్ణన్‌

సబ్బవరం, మే 17 (ఆంధ్రజ్యోతి): భూ తాపాన్ని తగ్గించేందుకు విస్తృతంగా వనాలను పెంచాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పేర్కొన్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని బాటజంగాలపాలెంలో నిర్వహించిన ‘బీట్‌ ది హీట్‌’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, భౌగోళికంగా వస్తున్న మార్పుల కారణంగా కొన్నేళ్లుగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూ తాపం నుంచి భవిషత్తు తరాలను రక్షించుకునేందుకు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ప్రతి కుటుంబం ఏటా కనీసం 10 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున వడదెబ్బబారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ నీరు తాగాలని సూచించారు. వడదెబ్బకు గురైతే వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. అంతకుముందు ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి డాక్టర్‌ ఆశతో మాట్లాడారు. మండలంలో మాతృ మరణాలు ఎక్కువగా ఉన్నాయనీ, హైరిస్కు కేసులను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. జాతీయ రహదారి పక్కన బాటసారులకు షెల్టర్‌ను, పశువుల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన నీటి కుండీలను ప్రారంభించారు. సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. క్యాన్సర్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కలెక్టర్‌ పర్యటనలో జడ్పీ డిప్యూటీ సీఈవో కె.రాజుకుమార్‌, డీపీవో ఆర్‌.శిరీషారాణి, డీపీఆర్‌సీ కో-ఆర్డినేటర్‌ ఇ.నాగలక్ష్మి, మండల ప్రత్యేకాధికారి కె.రమామణి, తహసీల్దార్‌ బి.చిన్నికృష్ణ, ఎంపీడీవో పి.పద్మజ, సర్పంచ్‌ పడాల వెంకటరమణ, తదిరతులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:48 AM