Share News

90 హెక్టార్లలో అడవులు అభివృద్ధి

ABN , Publish Date - Jun 06 , 2025 | 10:52 PM

అటవీ శాఖ డివిజన్‌ పరిధిలో 90 హెక్టార్లలో అడవుల పునరుద్ధరణ, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్థానిక డివిజనల్‌ ఫారెస్టు అధికారి వైవీ నరసింహారావు అన్నారు.

90 హెక్టార్లలో అడవులు అభివృద్ధి
విలేకరులతో మాట్లాడుతున్న డీఎఫ్‌వో వైవీ నరసింహరావు

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నర్సరీల ద్వారా ఆరు లక్షల మొక్కలు పెంపకం

ఐటీడీఏ నిర్ణయించిన ధరకు పంపిణీ

రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా

జంతువుల గణన కోసం కెమెరా ట్రాప్‌లు

డివిజనల్‌ ఫారెస్టు అధికారి వైవీ నరసింహరావు

చింతపల్లి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అటవీ శాఖ డివిజన్‌ పరిధిలో 90 హెక్టార్లలో అడవుల పునరుద్ధరణ, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్థానిక డివిజనల్‌ ఫారెస్టు అధికారి వైవీ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలోనే అత్యధికంగా 60 శాతం అడవులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది 25 హెక్టార్లలో నూతనంగా మొక్కలు నాటడంతోపాటు 65 హెక్టార్లలో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ ప్రారంభించామన్నారు. వన మహోత్సవం కార్యక్రమాల ద్వారా ఈనెల నుంచి అక్టోబరు వరకు డివిజన్‌ పరిధిలో 50వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనులకు పంపిణీ చేసేందుకు 20 నర్సరీల్లో ఆరు లక్షల మొక్కలను పెంచామన్నారు. ప్రధానంగా జాఫ్రా, యుకలిఫ్టస్‌, సిల్వర్‌ ఓక్‌, జామ, సీతాఫలం మొక్కలు సిద్ధం చేశామన్నారు. ఐటీడీఏ నిర్ణయించిన నామమాత్రపు ధరకు మొక్కలు గిరిజనులకు అందజేస్తామన్నారు. వచ్చే ఏడాది 12 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా చేసుకోవడం జరిగిందన్నారు.

రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా

డివిజన్‌ పరిధిలోనున్న సిగినాపల్లి, గుర్రాళ్లగొంది, సత్యవరం రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీఎఫ్‌వో వైవీ నరసింహరావు తెలిపారు. అక్రమంగా తవ్వకాలు నిర్వహించే వ్యక్తులు, వ్యాపారులపై కేసులు పెడుతున్నామన్నారు. రంగరాళ్ల క్వారీల వద్ద తవ్వకాలను నియంత్రించేందుకు స్ట్రైకింగ్‌ ఫోర్సును ఏర్పాటు చేశామన్నారు. అలాగే క్వారీల వద్ద 24గంటలు గస్తీ నిర్వహించేందుకు ఐదుగురు చొప్పున ప్రొటెక్షన్‌ వార్చర్‌ నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సిగినాపల్లిలో ఇప్పటికే ఐదుగురుని నియమించామన్నారు.

పోడు వ్యవసాయంపై సర్వే

గిరిజన ప్రాంతంలో పోడు వ్యవసాయంపై సర్వే చేపడుతున్నాట్టు డీఎఫ్‌వో నరసింహరావు తెలిపారు. అటవీ హక్కుల చట్టం ద్వారా 98 వేల ఎకరాల భూములను ఆదివాసీలకు పంపిణీ చేశామన్నారు. రైతులకు కేటాయించిన ఈ భూముల్లో మాత్రమే సాగు చేసుకోవాలని, అదనంగా సాగు చేయరాదన్నారు. రైతులు ఏ స్థాయిలో పోడు వ్యవసాయం చేస్తున్నారనే అంశంపై సర్వే చేస్తున్నామన్నారు. రైతులకు పంపిణీ చేసిన భూముల్లోనూ ఉద్యాన పంటలు సాగు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. జాతీయ రహదారి 516-ఈ ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌ నాటాలని సంబంధిత శాఖ అధికారులను అటవీ శాఖ ఆదేశించింది. ప్రతి కిలోమీటరుకి ఇరువైపులా 200 చొప్పున మొక్కలు నాటాలన్నారు. అలాగే అడవి జంతువుల గణన కోసం రూ.10లక్షలతో కెమెరా ట్రాప్‌లు, డ్రోన్‌లు కొనుగోలు చేస్తున్నామన్నారు. అడవి జంతువులు రహదారులను దాటేందుకు సొరంగ మార్గాలు (అనిమల్‌ అండర్‌ పాస్‌) ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. సొరంగ మార్గాల కోసం గుర్తించిన వివరాలు ఎన్‌హెచ్‌ అధికారులకు అందజేశామన్నారు.

టింబర్‌ డిపోల ద్వారా రూ.3.5 కోట్ల ఆదాయం

డివిజన్‌ పరిధిలోనున్న లోతుగెడ్డ, సీలేరు, కాకరపాడు, వెదురునగరం టింబర్‌ డిపోల ద్వారా అటవీ శాఖకు రూ.3.5 కోట్ల ఆదాయం వచ్చిందని డీఎఫ్‌వో నరసింహరావు అన్నారు. టేక్‌ ప్లాంటేషన్‌, అడవుల్లో పడిపోయిన వృక్షాలు, జాతీయ రహదారిలో తొలగించిన వృక్షాల దుంగలను టింబర్‌ డిపోల ద్వారా విక్రయించామన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 10:52 PM