Share News

కేసు విచారణలో ఫోరెన్సిక్‌ ఆధారాలు కీలకం

ABN , Publish Date - May 06 , 2025 | 11:22 PM

నేర విచారణలో ఫోరెన్సిక్‌ ఆధారాల పాత్ర కీలకమని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నేరాల దర్యాప్తులో ఆధునిక శాస్త్రీయ విధానాలపై మంగళవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కేసు విచారణలో ఫోరెన్సిక్‌ ఆధారాలు కీలకం
శిక్షణలో మాట్లాడుతున్న డీఐజీ గోపీనాథ్‌ జెట్టి

డీఐజీ గోపీనాథ్‌ జెట్టి

అనకాపల్లి టౌన్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): నేర విచారణలో ఫోరెన్సిక్‌ ఆధారాల పాత్ర కీలకమని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నేరాల దర్యాప్తులో ఆధునిక శాస్త్రీయ విధానాలపై మంగళవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫోరెన్సిక్‌ నిపుణులు చెప్పిన విషయాలను అవగతం చేసుకొని కేసుల విచారణను మరింత వేగవంతం చేయాలని అన్నారు. నేరాల విషయంలో బాధితులకు న్యాయం జరగాలంటే దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్‌ వైద్యులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ, ఈ శిక్షణ కార్యక్రమం కేసుల దర్యాప్తులో స్పష్టతను పెంచడానికి దోహదపడుతుందన్నారు. ఈ వర్క్‌షాపులో నార్కోటిక్‌, మత్తు పదార్థాలు, విష పదార్థాలు, డిజిటల్‌ ఆధారాలు, సైబర్‌ నేరాల పరికరాలు, ఆడియో/ వీడియో ఫుటేజీ, డీఎన్‌ఏ, రక్తనమూనాలు, మానవ అవయవాలు వంటి ఆధారాల సేకరణ, ప్యాకింగ్‌, భద్రపరిచే విధానంపై శిక్షణ ఇచ్చారు. ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.నాగరాజు, శాస్త్రీయ సహాయకులు ఎం.రాంబాబు, పీవీఎస్‌డీ చలపతి, ఇ.కిరణ్‌కుమార్‌ శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్‌, ఎల్‌.మోహనరావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణుస్వరూప్‌, ఫోరెన్సిక్‌ వైద్యులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:22 PM