Share News

‘ఉక్కు’ ప్రమాదంపై ఫోరెన్సిక్‌ తనిఖీలు

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:08 AM

స్టీల్‌ప్లాంటులో బ్లాస్ట్‌ ఫర్నేస్‌కు రా మెటీరియల్‌ సరఫరా చేసే కన్వేయర్‌ బెల్ట్‌ తెగిపోయిన ఘటనపై విశాఖపట్నం సిటీ పోలీసులు సోమవారం ఫోరెన్సిక్‌ నిపుణులతో వెళ్లి పరిశోధన చేశారు.

 ‘ఉక్కు’ ప్రమాదంపై ఫోరెన్సిక్‌ తనిఖీలు

కారణాల వెలికితీతకు కమిటీ ఏర్పాటు

స్టీల్‌ప్లాంటులో మరిన్ని సీసీ టీవీ కెమెరాలు

ఉద్యోగులకు ఒరిజనల్‌ ఐడీ కార్డు ఉంటేనే ప్రవేశం

విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులో బ్లాస్ట్‌ ఫర్నేస్‌కు రా మెటీరియల్‌ సరఫరా చేసే కన్వేయర్‌ బెల్ట్‌ తెగిపోయిన ఘటనపై విశాఖపట్నం సిటీ పోలీసులు సోమవారం ఫోరెన్సిక్‌ నిపుణులతో వెళ్లి పరిశోధన చేశారు. బెల్డ్‌ తెగిపోవడానికి అసలైన కారణాలు ఏమిటో గుర్తించడానికి అందుబాటులో ఉన్న అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటామని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. ఇటీవల స్టీల్‌ప్లాంటులో నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో కన్వేయర్‌ బెల్ట్‌లు తరచూ తెగిపోతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులే కావాలని వాటిని కోసేస్తున్నారని యాజమాన్యం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో నవంబరు 25న బీఎఫ్‌-3కి ముడి పదార్ధాలు సరఫరా చేసే ఎంబీ-2 కన్వేయర్‌ బెల్టు తెగిపోయింది. దీనివల్ల ఆ బీఎఫ్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న యాజమాన్యం 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీస్‌ కమిషనర్‌ విచారణకు వెళ్లారు. అప్పుడు ప్లాంటు పర్యటనలో ఉన్న స్టీల్‌ జాయింట్‌ సెక్రటరీలు, సీఎండీ సక్సేనాతో కలసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. పూరిస్థాయిలో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. కన్వేయర్‌ బెల్ట్‌లకు, వాటివల్ల ప్లాంటుకు జరుగుతున్న నష్టంపై సీఎండీ సక్సేనా ప్రత్యేక కమిటీ వేశారు. వారిని సమన్వయం చేసుకుంటూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అదనపు పర్యవేక్షణ

ప్లాంటులో చాలాచోట్ల సీసీ టీవీ కెమెరాలున్నాయి. కన్వేయర్‌ బెల్ట్‌లు తెగిపోతుండడంతో ప్రత్యేక విభాగాల్లో మరిన్ని సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. దాంతో యాజమాన్యం ఏర్పాట్లలో నిమగ్నమైంది. అంతేకాకుండా ప్లాంటులో విధులకు వచ్చే ప్రతి ఒక్కరు యాజమాన్యం జారీ చేసిన ఐడీ కార్డును(ఒరిజినల్‌) ధరించాలని ఆదేశించింది. కొందరు కలర్‌ జెరాక్స్‌ కాపీలు లామినేషన్‌ చేయించి వినియోగిస్తున్నారని, వాటిని అనుమతించమని స్పష్టంచేసింది.

Updated Date - Dec 02 , 2025 | 01:08 AM