ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:42 PM
ఎట్టకేలకు 33 నెలల తరువాత ఐటీడీఏ పాలకవర్గం సమావేశం జరగనుంది. ఈ నెల 21న ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత 33 నెలలుగా ఐటీడీఏలో పాలకవర్గ సమావేశాలను నిర్వహించకపోవడంతో అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా పాలన సాగించిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

33 నెలల తరువాత ఎట్టకేలకు ఐటీడీఏ పాలకవర్గం సమావేశం
ఆఖరుగా 2022 జూలై 2న నిర్వహణ
ఆ తరువాత వాటిపై దృష్టి పెట్టని ఐటీడీఏ చైర్మన్లు
ఇన్నాళ్లూ ఇష్టారాజ్యంగా సాగిన ఐటీడీఏ యంత్రాంగం పాలన
21న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామని ఇన్‌చార్జి పీవో అభిషేక్‌గౌడ వెల్లడి
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఎట్టకేలకు 33 నెలల తరువాత ఐటీడీఏ పాలకవర్గం సమావేశం జరగనుంది. ఈ నెల 21న ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత 33 నెలలుగా ఐటీడీఏలో పాలకవర్గ సమావేశాలను నిర్వహించకపోవడంతో అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా పాలన సాగించిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ప్రతి మూడు నెలలకొకమారు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరగాలనేది నిబంధన. కలెక్టర్ ఐటీడీఏ చైర్మన్ హోదాలో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహిస్తారు. 2022 జూలై రెండవ తేదీన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరగగా, అప్పటి నుంచి ఇప్పటికి అంటే 33 నెలలైంది. ఐటీడీఏ బైలా నిబంధనల ప్రకారం కనీసం పదిసార్లు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు జరగాల్సి ఉండగా, ఆ దిశగా ఐటీడీఏ చైర్మన్‌గా వ్యవహరించే కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. కానీ 2022 జూలై తరువాత నుంచి కలెక్టర్లుగా పని చేసిన వారంతా మిన్నకుండడం గమనార్హం. అయితే ఎట్టకేలకు 33 నెలల తరువాత ఈ నెల 21న ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రతి మూడు నెలలకు సమావేశాలు జరగాల్సి ఉండగా..
ఐటీడీఏ ద్వారా గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి చేపడుతున్న, చేపట్టబోయే కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమై చర్చించుకునేందుకుగానూప్రతి మూడు నెలలకు ఒక మారు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఐటీడీఏ చైర్మన్ హోదాలో కలెక్టర్, ప్రాజెక్టు నిర్వాహకుడిగా ఐటీడీఏ పీవో, గౌరవ సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్‌లు, వివిధ శాఖల అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు ఉంటారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఇతర మంత్రులు ముఖ్యఅతిఽథులుగా హాజరవుతారు. దీంతో ప్రతి మూడు నెలలకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరగాలని, అందులో తాము గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు ఎదురుచూస్తుంటారు. అయితే గత 33 నెలలుగా ఐటీడీఏలో పాలకవర్గ సమావేశాలను నిర్వహించకపోవడంతో అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా పాలన సాగించిందనే విమర్శలు ఉన్నాయి. గతేడాది డి సెంబరు నాటికి ఐటీడీఏను ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పండగలా వేడుకలు నిర్వహించాల్సి ఉండగా, అవేవి పట్టించుకోకుండా ఐటీడీఏ ఆవరణలో ఒక పైలాన్ నిర్మించి అధికారులే దానిని ఆవిష్కరించారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు జరగపోవడం వల్లే అధికారులు ఐటీడీఏ పాలనను సైతం తమ సొంత జాగీరులా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.
రోణంకి గోపాలక్రిష్ణ హయాంలో సక్రమంగా నిర్వహణ
2021కి ముందు ఏడాదికి ఒకమారు మాత్రమే ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించేవారు. ఐటీడీఏ పీవోగా రోణంకి గోపాలక్రిష్ణ విధుల్లో చేరిన తరువాత ఐటీడీఏ పాలకవర్గ సమావేశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయన పీవోగా 2021 జూన్‌లో చేరారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే 2021 డిసెంబరులో, 2022 మార్చిలో, 2022 జూలైలో ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను నిర్వహించారు. అయితే అప్పటికే పాడేరు జిల్లా కేంద్రం కావడంతో దానిపై ఐటీడీఏ చైర్మన్ హోదాలో కలెక్టర్ దృష్టిపెట్టాల్సి ఉండడంతో ఐటీడీఏ పీవో మిన్నకున్నారు. దీంతో 2022 అక్టోబరు నెలలో జరగాల్సిన సమావేశం జరగపోవడంతో అప్పటి నుంచి పాలకవర్గ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారోనని సభ్యులైన ప్రజా ప్రతినిధులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఐటీడీఏ వైపు కన్నెత్తి చూడని గిరిజన సంక్షేమ మంత్రి
రాష్ట్రంలో పెద్ద ఐటీడీఏ అయినప్పటికీ వైసీపీ పాలనలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇటుగా కన్నెత్తి చూసిన దాఖలాలులేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఐటీడీఏల పరిధిలో 27 లక్షల మంది గిరిజనులుంటే, ఒక్క పాడేరు ఐటీడీఏ పరిధిలో 7 లక్షల మంది గిరిజనులున్నాయి. దీంతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాడేరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడడంతో పాటు ఇక్కడి నుంచే ఇతర ఐటీడీఏల్లోని కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది. కానీ సదరు గిరిజన మంత్రి స్థానిక ఐటీడీఏను స్వయంగా సందర్శించిన పాపాన పోలేదు. దీంతో ఇక ఇతర ఐటీడీఏల పరిస్థితిపై ప్రత్యేకించిచెప్పనవసరం లేదు. ఐటీడీఏల పనితీరు, పాలకవర్గ సమావేశాలు, గిరిజనులు సాదక బాధలు, తదితర అంశాలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సైతం పట్టించుకోకపోవడంతో, అధికారులు కూడా వారిని అనుసరిస్తూ మిన్నకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నది. ఫలితంగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశంపై కలెక్టర్, ఐటీడీఏ పీవో వంటి అధికారులు దృష్టిపెట్టని పరిస్థితి గతం నుంచి ఏర్పడిందని పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మన్యం వాసులు భావిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రస్తుత గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను ప్రతి మూడు నెలలకు నిర్వహిస్తామని గతేడాది జూలైలోనే ఆమె హామీ ఇచ్చినప్పటికీ అది సైతం నెరవేరలేదు.
21న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఈ నెల 21న నిర్వహించనున్నామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే. అభిషేక్‌గౌడ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్, కార్పొరేషన్ల అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ సభ్యులకు ఆహ్వానాలు పంపామన్నారు. ఈ నెల 21న ఉదయం 11 గంటలకు పాలకవర్గంలోని సభ్యులైన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు విధిగా ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.