అర్జీల పరిష్కారానికి దృష్టి సారించాలి
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:06 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీల పరిష్కారానికి అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ జాహ్నవి, డీఆర్‌ఓ సత్యనారాయణరావులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీల పరిష్కారానికి అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ జాహ్నవి, డీఆర్‌ఓ సత్యనారాయణరావులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, పీజీఆర్‌ఎస్ అర్జీలు ఏ స్థాయి అధికారుల లాగిన్‌లో ఉంటే వాటి పరిష్కార పరిస్థితిని పర్యవేక్షణ చేసి పరిష్కరించాలన్నారు. ప్రజలు దరఖాస్తు చేసుకున్న అర్జీ స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్ చేస్తే.. వివరాలను తెలియజేయాలని అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 297 అర్జీలు అందాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, డీపీవో ఈ. సందీప్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.హైమావతి, ఎక్సైజ్ శాఖ అధికారి వి.సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
అనకాపల్లి రూరల్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని పౌరుల నుంచి అర్జీలను స్వీకరించారు. పలువురి సమస్యలను స్వయంగా ఆలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ అందిన అర్జీలపై ఏడు రోజులలోపు విచారణ పూర్తి చేసి పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 45 అర్జీలు అందాయని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు తెలిపారు.