Share News

ఆక్రమించిన ప్రభుత్వ భూముల స్వాధీనంపై దృష్టి

ABN , Publish Date - May 24 , 2025 | 11:23 PM

ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనంపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

ఆక్రమించిన ప్రభుత్వ భూముల స్వాధీనంపై దృష్టి
అధికారులతో జూమ్‌కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, మే 24 (ఆంధ్రజ్యోతి): ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనంపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలోని ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టరేట్‌ల నుంచి శనివారం నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను నియంత్రించేందుకు జిల్లా, మండల స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలన్నారు. అలాగే బంజరు, ప్రభుత్వ భూములు, నీటిపారుదల భూములు, చెరువుల ఆక్రమణలను ఈనెల 31లోగా గుర్తించి నివేధిక సమర్పించాలన్నారు. అలాగే ఆక్రమణదారులకు ఫారం 7, నోటీస్‌ జారీ చేయాలని, స్పీకింగ్‌ ఆర్డర్‌లు సిద్ధం చేయాలన్నారు. భూబదలాయింపు చట్టం ప్రకారం ఆక్రమణదారులపై అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

పునరావాస పనులు వేగవంతం చేయండి

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన పునరావాస పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ వారం రోజుల్లో పునరావాస కాలనీలకు ఎంపిక చేసిన 12 గ్రామాలను తరలించాలని సూచించారు. అలాగే ఇళ్ల నిర్మాణాలను మెజర్‌మెంట్‌ బుక్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌, పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి వి.అభిషేక్‌, సబ్‌ కలెక్టర్లు సౌర్యమన్‌ పటేల్‌, కల్పశ్రీ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:23 PM