Share News

ఉక్కు సీఎండీగా శక్తిమణి

ABN , Publish Date - Jun 25 , 2025 | 01:02 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సీఎండీగా శక్తిమణి నియామకానికి ఉక్కు మంత్రిత్వ శాఖ పచ్చ జెండా ఊపింది.

ఉక్కు సీఎండీగా శక్తిమణి

నెల రోజుల్లో బాధ్యతలు చేపట్టే అవకాశం

విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సీఎండీగా శక్తిమణి నియామకానికి ఉక్కు మంత్రిత్వ శాఖ పచ్చ జెండా ఊపింది. ఆయన నెల రోజుల్లో ఇక్కడకు వచ్చి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ఇంతకు ముందు సీఎండీగా పనిచేసిన అతుల్‌ భట్‌ పదవీ విరమణ (నవంబరు 2024)కు ముందే పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహించి శక్తిమణిని సీఎండీగా ఎంపిక చేసింది. ఆయనకు గతంలో ఈ స్టీల్‌ప్లాంటులో ఏజీఎంగా పనిచేసిన అనుభవం ఉంది. ఊహించని విధంగా అతుల్‌భట్‌పై ఆరోపణలు రావడంతో ఆయన్ను పదవీ విరమణకు ముందే సీఎండీ పోస్టు నుంచి తప్పించి సెలవులో పంపించేశారు. ఇన్‌చార్జి సీఎండీగా ఏకే సక్సేనాను తీసుకువచ్చారు. కేవలం మూడు నెలల కాలానికి వచ్చిన ఆయన ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్టీల్‌ ప్లాంటులో కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉన్నందున సక్సేనాను ఉక్కు మంత్రిత్వ శాఖ కొనసాగించింది. వారు అనుకున్నట్టుగానే సక్సేనా వీఆర్‌ఎస్‌ అమలు చేసి 1,200 మందిని ఇంటికి పంపించేశారు. మరో నాలుగు వేల మంది కాంట్రాక్ట్‌ వర్కర్లను తీసేశారు. ఉద్యోగుల సంఖ్య ఇంకా కుదించాలని యత్నిస్తున్నారు. స్థిర వ్యయాలను బాగా తగ్గించారు. విభాగాల వారీగా ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్ట్టుకు ఇస్తున్నారు. ఈ సంస్కరణలన్నీ పూర్తయిపోయి, బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని కూడా ప్రారంభించాక సక్సేనాను ఇక్కడి నుంచి పంపాలని భావిస్తున్నారు. అందుకే శక్తిమణిని ఇన్నాళ్లు ఆపారని సమాచారం. ప్రస్తుతం స్టీల్‌ప్లాంటు గత నాలుగు నెలలుగా లాభాల బాటలో ఉంది. ఇంకో ఆరు నెలల్లో పరిస్థితి ఇంకా మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తోంది. ప్లాంటును పూర్తిస్థాయితో నడపడానికి వనరులు సమకూర్చినట్టే అవసరమైన డైరెక్టర్లను కూడా నియమించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.


వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే రేషన్‌

రేపటి నుంచి పంపిణీ

విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి):

వృద్ధులు, దివ్యాంగులైన బియ్యం కార్డుదారులకు వచ్చే నెలకు సంబంధించిన బియ్యం ఈనెల 26వ తేదీ నుంచి ఇంటి వద్దే పంపిణీ చేస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కర్‌ తెలిపారు. జిల్లాలో 641 రేషన్‌ డిపోల పరిధిలో 32,701 మంది వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారన్నారు.

ఐసీడీఎస్‌ ప్రాంతీయ సదస్సు రేపు

విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి):

మహిళాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమం, గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం వంటి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 26న నగరంలో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు ఐసీడీఎస్‌ ఆర్జేడీ జి.చిన్మయిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న ఉదయం 9 నుంచి మూడు గంటల వరకు ఏయూ ప్లాటినం జూబ్లీ గెస్ట్‌ హౌస్‌ మీటింగ్‌ హాల్‌లో ఈ సదస్సు జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పీడీలు, సీడీపీవోలు, ఏసీడీపీవోలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇందులో భాగస్వాములవుతారన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు ఆమె తెలిపారు.

సంక్షేమ హాస్టళ్లలో ప్రవేశాలు

జిల్లాలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 53 హాస్టళ్లు

1,400 మందికి అవకాశం

దరఖాస్తులను ఆహ్వానిస్తున్న అధికారులు

మూడో తరగతి నుంచి పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు హాస్టల్స్‌లో అవకాశం

విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ప్రవేశాల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదివే విద్యార్థులకు బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలకు చెందిన హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా హాస్టళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

జిల్లాలో బీసీ, సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 53 హాస్టళ్లలో సుమారు 1,400 మందికి ప్రవేశాలు కల్పించేందుకు అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 8 ప్రీమెట్రిక్‌, 15 పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో 700, బీసీ సంక్షేమ శాఖకు చెందిన 12 ప్రీ మెట్రిక్‌, 18 పోస్టు మెట్రిక్‌ హాస్టల్స్‌లో మరో 700 మందికి ప్రవేశాలు కల్పించేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు ఆధార్‌, కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకువెళితే ఆయా హాస్టళ్లలో దరఖాస్తులు ఇస్తారని, వెంటనే పూర్తిచేసి అక్కడ అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లలో ఎస్సీ విద్యార్థుల సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి. బీసీ, ఓసీ విద్యార్థుల ఖాళీలు భర్తీ అయినట్టు తెలిపారు.

వీరికి మాత్రమే అవకాశం

సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చేరాలంటే విద్యార్థులు జిల్లా పరిధిలో చదువుతుండాలి. ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో పదో తరగతిలోపు చదివే విద్యార్థులకు, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో ఇంటర్‌, ఆపైన చదివే విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. హాస్టళ్లలో వసతి కల్పించడంతో పాటు విద్యార్థికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడతారు. కాస్మోటిక్‌ చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. వచ్చే నెల 15వ తేదీ వరకు హస్టళ్లలో చేరేందుకు అవకాశం ఉంది.


వీఎంఆర్‌డీఏ కల్యాణ మండపాలు అద్దెకు...

విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) తాటిచెట్లపాలెం, చినముషిడివాడలలోని కల్యాణ మండపాలను, పెదగంట్యాడలో ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ను నెలవారీ అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించింది. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకుంటే జూలై 9వ తేదీన సిరిపురం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో వేలం వేసి ఎవరు ఎక్కువ అద్దె చెల్లించడానికి ముందుకువస్తారో వారికి ఇవ్వనున్నారు. వేలం పాడుకున్నవారు మూడేళ్ల పాటు తీసుకోవలసి ఉంటుంది.

Updated Date - Jun 25 , 2025 | 01:02 AM