సచివాలయాలపై ఫోకస్
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:47 PM
క్షేత్రస్థాయిలో పౌర సేవలందించే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసిన కూటమి ప్రభుత్వం, అదే స్థాయిలో పర్యవేక్షణను సైతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
వ్యవస్థ పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీవోల నియామకం
గ్రేడ్- 1 పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్‌లకు డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి
మెరుగైన పౌర సేవలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు
జిల్లా వ్యాప్తంగా 430 పంచాయతీలు, 352 గ్రామ సచివాలయాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
క్షేత్రస్థాయిలో పౌర సేవలందించే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసిన కూటమి ప్రభుత్వం, అదే స్థాయిలో పర్యవేక్షణను సైతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేవలం సచివాలయ వ్యవస్థను పర్యవేక్షించేందుకు గాను డిప్యూటీ ఎంపీడీవోలను నియమించింది. దీంతో ఇకపై మండలాల్లోని గ్రామ సచివాలయ వ్యవస్థను పర్యవేక్షించడం, లోటుపాట్లు గుర్తించి, సరిచేయడం వంటివి డిప్యూటీ ఎంపీడీవోలే బాధ్యతగా చేపడతారు.
గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందడం లేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయడంతోపాటు పటిష్ట పర్యవేక్షణ సైతం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించారు. గతంలో ప్రతి సచివాలయంలో పదకొండు మంది చొప్పున సిబ్బంది ఉండేవారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేసిన తరువాత నుంచి జనాభా ఆధారంగా ఒక్కో సచివాలయానికి 6 (2,500 జనాభా లోపు), 8(3500 జనాభా పైబడి), 10 (అవసరాన్ని బట్టి) మంది చొప్పున సిబ్బంది ఉంటున్నారు. వారిలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్‌ఎం, సర్వేయర్, వెటర్నరీ అసిస్టెంట్, వ్యవసాయ/ఉద్యానవన అసిస్టెంట్, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శి ఉంటున్నారు.
డిసెంబరు నుంచి విధుల్లోకి డిప్యూటీ ఎంపీడీవోలు
గ్రామ సచివాలయాలను మరింతగా పర్యవేక్షించాలనే ఆలోచనతో ప్రభుత్వం డిప్యూటీ ఎంపీడీవోల నియామకం చేపట్టింది. వాళ్లంతా మండల స్థాయి అధికారులుగా ఉంటే వారి పరిధిలోని గ్రామ సచివాలయాలను పర్యవేక్షిస్తారు. అయితే ప్రస్తుతం మండల స్థాయిలో ఉన్న ఎంపీడీవోలకు పనిభారం కారణంగా సచివాలయాలను ఆశించిన స్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారు. దీంతో సచివాలయ వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడుతున్నది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌లుగా పని చేస్తున్న వారి సర్వీసు ఆధారంగా డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించి మండలాలకు కేటాయించింది. అలాగే ప్రస్తుతం వారంతా పంచాయతీరాజ్ శాఖలో ఉండడంతో డిప్యూటీ ఎంపీడీవోలుగా నియమిస్తూ గ్రామ/వార్డు సచివాలయ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో వారంతా డిసెంబరు ఒకటో తేదీ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలుగా బాధ్యతలు చేపట్టి, తమ మండలాల్లోని సచివాలయ వ్యవస్థఽను గాడిన పెట్టాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తున్నది.
జిల్లాలో 430 పంచాయతీలు, 352 సచివాలయాలు
జిల్లాలో పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 22 మండలాల్లోని 430 గ్రామ పంచాయతీల పరిఽధిలో 353 గ్రామ సచివాలయాలున్నాయి. వాటి పరిధిలో ప్రస్తుతం 2,150 మంది సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి గతంలో ప్రతి సచివాలయం పరిధిలో 11 మంది చొప్పున కేటాయించినప్పుడు 2,813 మంది సిబ్బంది ఉండేవారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. జిల్లాలోని మొత్తం 352 గ్రామ సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి జనాభా ఆధారంగా సిబ్బందిని కేటాయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని మొత్తం 352 సచివాలయాల్లో కేవలం 19 మాత్రమే 2,500 పైబడి జనాభా ఉండగా, మిలిగిన 333 సచివాలయాల్లో 2,500 మంది లోపు జనాభా ఉన్నారు. దీంతో అధిక సంఖ్యలో సచివాలయాల్లో ఆరుగురు సిబ్బందిని నియమించగా, ఇతర వాటిల్లో 8 మంది, ప్రత్యేక పరిస్థితుల్లో 10 మంది సిబ్బందిని నియమించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 2,150 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది క్రమబద్ధ్దీకరణతో గతంలో పని భారంతో సతమతమవుతున్న సిబ్బందికి కాస్త ఊరట కలిగింది.