Share News

ప్రైవేటు ఆలయాలపై దృష్టి

ABN , Publish Date - Nov 03 , 2025 | 01:04 AM

కార్తీకశుద్ధ ఏకాదశి రోజైన శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మృతిచెందిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.. భవిష్యత్తులో మరే ఆలయంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్ఠ రక్షణ, భద్రత చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవదాయ శాఖ పరిధిలో వున్న ఆలయాలతోపాటు ప్రైవేటు వ్యక్తులు, ట్రస్టులు, సంస్థల నిర్వహణలో వున్న ఆలయాల గురించి సమగ్ర వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, దేవదాయ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ప్రైవేటు ఆలయాలపై దృష్టి
గ్రామ దేవతల ఉత్సవాల సందర్భంగా ఒక ఆలయం వద్ద భక్తుల రద్దీ (ఫైల్‌ ఫొటో)

పటిష్ఠ భద్రత, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం

సమగ్ర వివరాలు సేకరించాలని జిల్లాల అధికారులకు ఆదేశాలు

పలు అంశాలతో మార్గదర్శకాలు జారీ

నేటి నుంచి ఆలయాలను పరిశీలించనున్న దేవదాయ శాఖ సిబ్బంది

మూడు రోజుల్లో వివరాలు సేకరణ

నక్కపల్లి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కార్తీకశుద్ధ ఏకాదశి రోజైన శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మృతిచెందిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.. భవిష్యత్తులో మరే ఆలయంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్ఠ రక్షణ, భద్రత చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవదాయ శాఖ పరిధిలో వున్న ఆలయాలతోపాటు ప్రైవేటు వ్యక్తులు, ట్రస్టులు, సంస్థల నిర్వహణలో వున్న ఆలయాల గురించి సమగ్ర వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, దేవదాయ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

వాస్తవానికి దేవదాయ శాఖ పరిధిలో సిక్స్‌-ఏ, సిక్స్‌-బీ, సిక్స్‌-సీ, సిక్స్‌-డీ కేటగిరీల్లో వున్న ఆలయాల గురించి మాత్రమే ఆ శాఖ అధికారుల వద్ద పక్కా సమాచారం వుంటుంది. దేవదాయ శాఖ పరిధిలో వున్న ఆలయాల్లో ముఖ్య జాతర్లు, వార్షికోత్సవాలు, కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఈవోలు, జూనియర్‌/ సీనియర్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమిస్తారు. అవసరమైన క్యూ లైన్లు, ఇతర సదుపాయాలను కల్పిస్తుంటారు. కానీ ప్రైవేటు ఆలయాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎన్ని వున్నాయనే సమాచారం దేవదాయ శాఖ వద్ద లేదు. ఈ నేపథ్యంలో కాశీబుగ్గలో ఒక ప్రైవేటు వ్యక్తి నిర్వహణలో వున్న ఆలయంలో జరిగిన విషాద ఘటనను పరిగణలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రైవేటు ఆలయాలపై నివేదికలు సిద్ధం చేయాలని మంత్రులు నారా లోకేశ్‌, ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లకు సూచించారు. అధికారుల ఆదేశాల మేరకు దేవదాయ శాఖ ఈవోలు.. గ్రామాలు, పట్టణాల్లో ప్రైవేటు ఆలయాల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఏ ఊరులో ఎన్ని ప్రైవేటు గుడులు వున్నాయి? వాటిని ఎవరు నిర్మించారు? ప్రస్తుతం ఎవరు నిర్వహిస్తున్నారు? జాతరలు, ముఖ్యమైన పండుగలు, వార్షికోత్సవాలు ఏయే రోజుల్లో జరుగుతాయి? ఎంతమంది భక్తులు ఈ కార్యక్రమాలకు వస్తుంటారు? ఏటేటా భక్తులు ఎంత మేర పెరుగుతున్నారు? తదితర అంశాలపై సోమవారం నుంచి వివరాలు సేకరించనున్నారు. ఇంకా భక్తులు ఆలయంలోకి వెళ్లే మార్గాలు/ వచ్చే మార్గాలు ఎలా వున్నాయి? బారికేడ్లు/రెయిలింగ్‌ సామర్థ్యం ఎంత? ఆలయ గర్భగుడిలో ఒకేసారి ఎంతమంది భక్తులు వుండవచ్చు? విద్యుత్‌ లైన్లు ఎలా వున్నాయి? సీసీ కెమెరాలు వున్నాయా? తదితర అంశాలపైనా సమగ్ర నివేదికలను రూపొందించి సంబంధిత అసిస్టెంట్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు అందజేయాలి. ప్రైవేటు ఆలయాల వివరాలు సేకరించేటప్పుడు ఆలయ భౌగోళిక పరిస్థితులను పరిశీలించడంతోపాటు ఇతర వివరాలను సేకరించడంలో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌ఐలను సమన్వయపర్చుకోవాలని సూచించారు. ఈ సమాచారం ఆధారంగా ఉత్సవాలు, భక్తుల రద్దీ అధికంగా వుండే రోజుల్లో కాశీబుగ్గ లాంటి దుర్ఘటనలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టే యోచనలో ప్రభుత్వం వుంది. ఆయ ఉత్సవాలు జరిగే రోజుల్లో పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాలపై దేవదాయ శాఖ విశాఖ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ సుజాతను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. ప్రైవేటు ఆలయాల స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లపై అసిస్టెంట్‌ కమిషనర్లకు సూచనలిచ్చామని, మూడు రోజుల్లో అన్ని ఆలయాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు.

Updated Date - Nov 03 , 2025 | 01:04 AM