పారిశ్రామిక ప్రగతిపై దృష్టి
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:20 AM
జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన 5వ కలెక్టర్ల సదస్సు రెండో రోజైన గురువారం జిల్లాలో పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పన, రెవెన్యూ వసూళ్లపై ప్రభుత్వం నివేదికను విడుదల చేసింది. జిల్లాలో 2025-26 సంవత్సరానికిగాను 17 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆయా కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంది. సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యం
17 కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు
రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు
ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో 9,802 మందికి ఉద్యోగాలు
రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతి నివేదిక
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన 5వ కలెక్టర్ల సదస్సు రెండో రోజైన గురువారం జిల్లాలో పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పన, రెవెన్యూ వసూళ్లపై ప్రభుత్వం నివేదికను విడుదల చేసింది. జిల్లాలో 2025-26 సంవత్సరానికిగాను 17 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆయా కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంది. సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
అచ్యుతాపురం, పరవాడ ఫార్మాసిటీల్లో అనేక పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో భూ కేటాయింపులు జరుపుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి సెజ్‌లలో ఇప్పటికే 15 పరిశ్రమలు క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టాయి. నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్‌లో ‘ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్స్’ ఏర్పాటు కోసం ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే అనేక పర్యాయాలు తమకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటుకు మౌలిక వసతులైన అంతర్గత రహదారులు, నీరు, విద్యుత్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పనులను ఏపీఐఐసీ చేపడుతున్నది.
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు
జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనకాపల్లి, పరవాడ, ఎలమంచిలి నియోజకవర్గాల పరిధిలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కుల పనులను ఇప్పటికే మొదలు పెట్టారు. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం, చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట, మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడులో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ వేగవంతంగా జరగుతున్నది.
ఉద్యోగాల కల్పనపై..
జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏడాది కాలంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9,802 మందికి, పర్యాటక రంగంలో 150 మందికి ఉద్యోగాలు కల్పించారు. జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఆధ్వర్యంలో 42సార్లు జాబ్ మేళాలు నిర్వహించి 5,620 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు.
సమగ్ర అభివృద్ధే ధ్యేయం
పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రత, ఉపాధిపై దృష్టి
అమరావతి సదస్సులో కలెక్టర్, ఎస్పీ నివేదికలు
అనకాపల్లి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలతోపాటు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రయలు ఏర్పాటు కానున్నందున పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతతోపాటు ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో వీరు జిల్లా ప్రగతి, అభివృద్ధి ప్రణాళికల నివేదికలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధే పథంలో నిలుపుతామని పేర్కొన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ అందజేసిన జిల్లా అభివృద్ధి ప్రణాళిక నివేదికలో పారిశ్రామిక అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన అంశాలను వివరించారు. సామాన్యుడికి ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా చూసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయించి, క్షేత్రస్థాయిలో లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా అందించిన నివేదికలో.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పరిశ్రమలున్న ప్రాంతాల్లో చేపడుతున్న రక్షణ చర్యలను వివరించారు. గంజాయి నిర్మూలన, నేరాల నియంత్రణపై చేపడుతున్న చర్యలపై ఆయన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.