ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:42 PM
జిల్లా అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లా అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లా అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రధానంగా పీజీఆర్‌ఎస్‌లో అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, వాటిపై సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ప్రగతిలో నడిపించాలన్నారు. పాత రుణాల రికవరీ పెంచాలని, కొత్త రుణాలను అందించాలని, లక్ష్యం మేరకు గ్రామీణాభివృద్ధి సంస్థ సేవలను అందించాలన్నారు. గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ పనులపై ఆరా తీశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డు ఉండాలని, వారికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో మొక్కలు నాటే పనుల స్థితిగతులపై ఆరా తీస్తూ, వేగవంతం చేయాలన్నారు. జల్‌జీవన్ మిషన్ పనులు, భూగర్భ జలాల పెంపు, సాగునీటి వనరుల అభివృద్ధి, పంచాయతీరాజ్, తదితర శాఖల పనులను వేగవంతం చేయాలన్నారు. మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీవోలు వారంతపు సమీక్షలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వభరత్, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, పీజీఆర్‌ఎస్ జిల్లా నోడల్ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, డ్వామా పీడీ విద్యాసాగర్, సీపీవో ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అఽధికారి పీఎస్.కుమార్, ఎల్‌డీఎం మాతునాయుడు, తదితరులు పాల్గొన్నారు.