ఫ్లై ఓవర్లు అవసరం
ABN , Publish Date - May 22 , 2025 | 01:26 AM
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావస్తున్నందున...కనెక్టివిటీ కోసం వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మిస్తున్నదని, అయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తట్టుకోవడానికి ఫ్లైఓవర్లు కూడా అవసరమని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వీఎంఆర్‌డీఏలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖా మంత్రి పి.నారాయణ బుధవారం సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యేలంతా వారి వారి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సూచనలు తెలియజేశారు.
పురపాలక, పట్టణాభివృద్ది శాఖా మంత్రి నారాయణ సమీక్షా సమావేశంలో
ఎమ్మెల్యేల డిమాండ్
నియోజకవర్గాల్లో ప్రతి అభివృద్ధి పనీ
ఎమ్మెల్యేలకు చెప్పాకే చేపట్టాలి
ఇకపై ప్రతి నెలా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని మంత్రి వెల్లడి
సింహాచలం పంచ గ్రామాల సమస్య, అనకాపల్లి ల్యాండ్ పూలింగ్, బీచ్ కారిడార్ వంటి అంశాలపై త్వరలో కీలక నిర్ణయం
విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావస్తున్నందున...కనెక్టివిటీ కోసం వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మిస్తున్నదని, అయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తట్టుకోవడానికి ఫ్లైఓవర్లు కూడా అవసరమని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వీఎంఆర్‌డీఏలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖా మంత్రి పి.నారాయణ బుధవారం సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యేలంతా వారి వారి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సూచనలు తెలియజేశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ నుంచి భీమిలి వరకు బీచ్‌ను జోన్లుగా విభజించి వాటర్ స్పోర్ట్స్ ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా సింహాచలం బీఆర్‌టీఎస్ కారిడార్‌లో ఇళ్లస్థలాలు కోల్పోయిన వారికి ఇచ్చిన టీడీఆర్‌లు ఆన్‌లైన్‌లో విక్రయించుకునే అవకాశం కల్పించాలన్నారు. అధికారులు ఏమైనా అభివృద్ధి పనులు ప్రతిపాదించినప్పుడు వాటిని ముందుగా ఎమ్మెల్యేలకు తెలియజేయాలని చెప్పగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమర్థించారు. నాయకులు వారి పార్టీ మైలేజీ కోసం వాటిని ప్రచారం చేసుకుంటారని, ప్రజలకు చేరువుగా తీసుకువెళతారని, ఇరు వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయానికి వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుందని, ట్రాఫిక్ సమస్య తీరేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. మారియట్ హోటల్ వద్ద ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చారని, స్థలానికి టీడీఆర్‌లు ఇవ్వాలని కోరారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రహదారుల నిర్మాణాలపై మాట్లాడారు. మరికొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా జీవీఎంసీ వాటర్ పైపులైన్లు త్వరగా పూర్తిచేయాలని, ఎక్కడికక్కడ నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని కోరారు. కొండవాలు ప్రాంతాల్లో వ్యర్థాలను తరలించే వాహనాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. పేదల వద్ద 2014లో డీడీలు కట్టించుకున్నామని, వారికి ఇళ్లు అప్పగించాలని మరో ఎమ్మెల్యే కోరారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ, సింహాచలం పంచ గ్రామాల సమస్య, అనకాపల్లి ల్యాండ్ పూలింగ్, బీచ్ కారిడార్ వంటి అంశాలపై త్వరలోనే కీలక నిర్ణయాలు వస్తాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇకపై ప్రతి నెలా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయకుమార్, బండారు సత్యనారాయణమూర్తి, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విజయనగరం కలెక్టర్ అంబేద్కర్, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ విశ్వనాథన్, పురపాలక శాఖ కమిషనర్ సంపత్‌కుమార్, ఏపీఈపీడీసీఎల్ సీంఎడీ పృథ్వీతేజ్, తదితరులు పాల్గొన్నారు.