జలాశయాలకు వరద పోటు
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:14 AM
పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శారదా, పెద్దేరు, బొడ్డేరు, సర్పా నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ జలాశయాల్లోకి వరద నీరు చేరుతున్నది. రైవాడ, పెద్దేరు రిజర్వాయర్లు ఇప్పటికే పూర్తిగా నిండడంతో అధికారులు స్పిల్‌వే గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
గరిష్ఠస్థాయికి చేరిన రైవాడ, పెద్దేరు రిజర్వాయర్లు
స్పిల్‌గేట్ల నుంచి అదనపు నీరు దిగువకు విడుదల
పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శారదా, పెద్దేరు, బొడ్డేరు, సర్పా నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ జలాశయాల్లోకి వరద నీరు చేరుతున్నది. రైవాడ, పెద్దేరు రిజర్వాయర్లు ఇప్పటికే పూర్తిగా నిండడంతో అధికారులు స్పిల్‌వే గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
దేవరాపల్లి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైవాడ జలాశయంలోకి సమ్మెద, పినకోట చల్లగెడ్డల నుంచి ఆదివారం 900 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లుకాగా, రిజర్వాయర్‌లో 113.5 మీటర్ల వద్ద నీటి నిల్వలను అధికారులు క్రమబద్ధీకరిస్తూ అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 100 క్యూసెక్కులు, విశాఖ నగర పాలక సంస్థకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లోనుబట్టి ఆదివారం రాత్రి స్పిల్‌గేటు ఎత్తి నీటిని నదిలోకి విడుదల చేసే అవకాశం వుందని డీఈఈ సత్యంనాయుడు తెలిపారు.
పెద్దేరు నుంచి 350 క్యూసెక్కులు విడుదల
మాడుగుల రూరల్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దేరు జలాశయంలోకి ఆదివారం 248 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు కాగా ఆదివారం సాయంత్రానికి 136.55 మీటర్లకు చేరింది. రాత్రి తొమ్మిది గంటలకు స్పిల్‌వే మూడో గేటు తెరిచి 350 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడతామని జలాశయం ఏఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాచకట్టు కాలువకు 10 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువకు 50 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు.
స్వల్పంగా పెరిగిన కల్యాణపులోవ నీటి మట్టం
రావికమతం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చీమలపాడు పంచాయతీ పరిధిలో వున్న కల్యాణపులోవ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు క్రమం పెరుగుతున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 460 అడుగులు కాగా ఆదివారం 80 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతూ 453.02 అడుగులకు పెరిగింది. వారం రోజుల్లో నీటి మట్టం మూడు అడుగుల పెరిగినట్టు ప్రాజెక్టు ఏఈ సూర్య తెలిపారు. ఆయకట్టుకు సకాలంలో నీటిని విడుదల చేయడంతోపాటు రెండు వారాల నుంచి వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో 75 శాతం విస్తీర్ణంలో వరినాట్లు పూర్తయినట్టు ఆయన చెప్పారు. ఖరీఫ్‌కు నీటి ఎద్దడి తలెత్తే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.