Share News

జలాశయాల్లోకి వరద

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:21 AM

తుఫాన్‌ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని జలాశయాలకు వదద నీరు పోటెత్తుతున్నది.

జలాశయాల్లోకి వరద

ముందు జాగ్రత్తగా గేట్లు ఎత్తిన అధికారులు

అనకాపల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):

తుఫాన్‌ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని జలాశయాలకు వదద నీరు పోటెత్తుతున్నది. తాండవ, పెద్దేరు, కోనాం, రైవాడ, జలాశయాల నీటి మట్టాలు పెరగుతుండడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళ, బుధవారాల్లో కుభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం వుండడంతో ముందుజాగ్రత్త చర్యగా జలాశయాల్లోకి వచ్చే వరద కంటే.. స్పిల్‌వే గేట్ల ద్వారా ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దేరు జలాశయం నుంచి 500 క్యూసెక్కులు, తాండవ నుంచి 937 క్యూసెక్కులు, రైవాడ నుంచి 1,500 క్యూసెక్కులు, కల్యాణపులోవ నుంచి 250 క్యూసెక్కులు, కోనాం జలాశయం నుంచి 450 క్యూసెక్కుల నీటిని ఆయా నదుల్లోకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగితే అవుట్‌ఫ్లోను మరింత పెంచుతామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

తాండవ నుంచి 937 క్యూసెక్కులు విడుదల

నాతవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ నేపథ్యంలో తాండవ రిజర్వాయర్‌ నుంచి అధికమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు డీఈఈ అనురాధ తెలిపారు. గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా, సోమవారం 410 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో నీటిమట్టం 377.8 అడుగులు వుంది. అయితే తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుండడంతో సోమవారం మధ్యాహ్నం స్పిల్‌వే గేట్లు ఎత్తి 937 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. నదికి ఇరువైపులా వున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని డీఈఈ కోరారు.

రైవాడ నుంచి 1,500 క్యూసెక్కులు...

దేవరాపల్లి, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి) మండలంలో రైవాడ జలాశయంలోకి సమ్మెద, పినకోట గెడ్డల నుంచి 1,200 క్యూసెక్కుల వదర నీరు చేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా, సోమవారం 112.2 మీటర్లుగా నమోదైంది. సాధారణంగా 113.5 మీటర్లు దాటితేనే స్పిల్‌వే గేట్లు ఎత్తుతారు. కానీ తుఫాన్‌ కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పిల్‌వే గేట్ల నుంచి 1,500 క్యూసెక్కుల నీటిని శారదా నదిలోకి విడుదల చేస్తున్నట్టు డీఈఈ సత్యంనాయుడు తెలిపారు.

కల్యాణపులోవకు 250 క్యూసెక్కుల వరద

రావికమతం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘మొంథా’ తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. కల్యాణపులోవ జలాశయం ఇప్పటికే పూర్తిగా నిండిపోగా.. వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటమట్టం 460 అగులుకాగా, సోమవారం సాయంత్రం 250 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతున్నది. నీటిమట్టాన్ని 458 అడుగుల వద్ద నిలకడగా వుంచుతూ, స్పిల్‌వేలో రెండు గేట్లు ఎత్తి 250 క్యూసెక్కుల నీటిని సర్పా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం మండలాల్లో నదికి ఇరువైపులా వున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఏఈ డి.సూర్య కోరారు.

కోనాం నుంచి 450 క్యూసెక్కులు విడుదల

చీడికాడ, అక్టోబరు 27 (ఆంధ్ర జ్యోతి): కోనాం జలాశయంలోకి 350 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 101.25 మీటర్లు కాగా సోమవారం సాయంత్రం 99 మీటర్లుగా నమోదైంది. అయితే తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుండంతో స్పిల్‌వే గేట్ల నుంచి 450 క్యూసెక్కుల నీటిని బొడ్డేరు నదిలోకి విడిచిపెడుతున్నట్టు జలాశయం ఏఈఈ సత్యనారాయణదొర తెలిపారు.

పెద్దేరు నుంచి 300 క్యూసెక్కులు..

మాడుగుల రూరల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మండలంలోని పెద్దేరు జలాశయంలోకి వరద నీరు చేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు కాగా సోమవారం 295 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 135.2 మీటర్లకు చేరింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జలాశయం అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు జలాశయం మూడో గేటు ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. పెద్దేరు నదికి ఇరువైపులా వున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ సుఽధాకర్‌రెడ్డి సూచించారు.

Updated Date - Oct 28 , 2025 | 01:21 AM