భారీ వర్షంతో జలమయం
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:50 AM
మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం అర్ధరాత్రి తర్వాత మొదలైన వర్షం.. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఆగకుండా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షం నీరు రహదారులపై ప్రవహించడంతో కాలువలను తలపించాయి. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు.
అచ్యుతాపురం, ‘పేటల్లో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
డ్రైనేజీలు పొంగి.. వాగులను తలపించిన రోడ్డు
రాకపోకలకు వాహనదారుల ఇక్కట్లు
అచ్యుతాపురం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం అర్ధరాత్రి తర్వాత మొదలైన వర్షం.. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఆగకుండా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షం నీరు రహదారులపై ప్రవహించడంతో కాలువలను తలపించాయి. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా రహదారులపై ఎక్కడ గోతులు వున్నాయో తెలియక వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. వర్షం కారణంగా బాణసంచా విక్రయదారులు ఆందోళన చెందారు. వాతావరణం మసుగ్గా వుండడంతోపాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షాపుల ముందు బురదగా వుండడంతో సాయంత్రం వరకు దుకాణాలు తెరవలేదు. కాగా ఉదయం ఎనిమిది గంటల తరువాత వర్షం తెరిపిచ్చినప్పటికీ.. సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై వుంది.
‘పేటలో నీట మునిగిన ఆవాసాలు
పాయకరావుపేట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేటలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పలు కాలనీలు నీటమునిగాయి. ఆనందనగర్ కాలనీ, ఇందిరా కాలనీలో ఆదివారం మధ్యాహ్నం వరకు అడుగులోతున నీరు నిలిచి ఉండడంతోపాటు ఇళ్లలోకి చేరింది. దీంతో సామగ్రి తడిపోయి పలువురు ఇబ్బంది పడ్డారు. కొంతమంది ఇళ్లలోకి వచ్చిన వర్షం నీటిని బయటకు పంపేందుకు మోటార్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ప్రైవేటు లేఅవుట్లలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా లేకపోవడంతో వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కాలనీల్లో కురిసిన వర్షం నీరు త్వరగా బయటకు పోవడానికి సరైన అవుట్‌లెట్‌లు లేకపోవడంతో డ్రైనేజీల్లో మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నది.
కోటవురట్లలో కుండపోత..
కోటవురట్ల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలుగ్రామాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు దఫదఫాలుగా భారీ వర్షం కురిసింది. వర్షం నీటితో రహదారులు వాగులను తలపించాయి. చెరువులు ఇప్పటికే నిండడంతో అలుగులు పారుతున్నాయి. గెడ్డలు, వాగులతోపాటు సర్పా, వరాహ నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. రహదారులపై ఏర్పడిన గోతులు వర్షం కారణంగా మరింత పెద్దవి అవుతున్నాయి.